
హైదరాబాద్: బీఆర్‌ఎస్ తొలి జాబితా వెలువడనుందని జరుగుతున్న ప్రచారంతో అందులో గ్రేటర్ పరిధిలోని లక్కెవరిదో.. చిక్కెవరికో? అనే చర్చ నడుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి దక్కనున్నప్పటికీ మూడు నాలుగు స్థానాల్లో మార్పులుండవచ్చనే అభిప్రాయాలతో వాటిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాంటి వాటిల్లో ఉప్పల్, అంబర్‌పేట, కంటోన్మెంట్, ముషీరాబాద్ ఉన్నాయి.
జోరుగా ప్రచారం..
► ఉప్పల్ నియోజకవర్గం నుంచి బేతి సుభాష్‌రెడ్డికి ఈసారి టికెట్ రాదని, అక్కడ బండారి లక్ష్మారెడ్డికి ఇవ్వనున్నారంటూ ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఆ సీటు కోసం ఎంతో కాలంగా అక్కడ పని చేసుకుంటున్న జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కేటీఆర్ ఆశీస్సులున్నందున అతనికే దక్కుతుందని భావిస్తున్నవారూ ఉన్నారు. బండారి లక్ష్మారెడ్డి పేరు ప్రచారంలోకి రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, బొంతు రామ్మోహన్ ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి బండారి తప్ప తమ ఇద్దరిలో ఎవరికై నా లభించేలా చూడాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను కలిశారు. కేటీఆర్ అమెరికాలో ఉన్నందున ఆయన అండగా ఉన్నవారికి ఇప్పుడు అయోమయ పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ నగరంలో లేకపోవడంతో పార్టీ ముఖ్యులు హరీష్‌రావు, కవిత, సంతోష్‌కుమార్‌ల వద్దకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
వీరికి టికెట్ అనుమానమేనా?
► అంబర్‌పేట సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు తొలిజాబితాలో టికెట్ అనుమానమేననే అభిప్రాయాలుండగా, అక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. ముషీరాబాద్ నియోజకవర్గంపైనా సంశయాలున్నప్పటికీ, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను తప్పించేందుకు కారణాలంటూ కనిపించడం లేదంటున్నారు. వయోభారం రీత్యా అనుకుంటే ఆయన కొడుకు జైసింహకు దక్కవచ్చనే భావిస్తున్న వారితో పాటు ఎమ్మెన్ శ్రీనివాస్‌కు లభించగలదనే అభిప్రాయాలూ ఉన్నాయి.
అదృష్టం ఎవరిని వరించేనో..
► కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో ఆ నియోజకవర్గం ఇప్పటికే ఖాళీగా ఉంది.నియోజకవర్గంలో సాయన్నకు ఉన్న పేరు దృష్ట్యా ఆయన కుటుంబం నుంచే కుమార్తె లాస్య నందితకు ఇచ్చేందుకు అధిష్ఠానం సుముఖంగా ఉందనే అభిప్రాయాలున్నాయి. కేటీఆర్ అండదండలతో క్రిశాంక్‌కు టికెట్ లభించవచ్చని భావిస్తున్నవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉంటాయా.. ఉంటే ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ అమెరికా వెళ్లడానికి ముందే జాబితా తయారైందని, ఇక ప్రకటనే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సిట్టింగులో టెన్షన్,ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
గెలుపు గుర్రాలకే ..
► మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు లభించనున్నట్లు చెబుతున్నారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని, గెలిచే అవకాశాలుండటంతో తిరిగి వారినే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిలో సుధీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్), పద్మారావు(సికింద్రాబాద్) మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), ఎ.గాంధీ(శేరిలింగంపల్లి), కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్)లతో పాటు ఆయా నియోజకవర్గాల సిట్టింగులున్నారు.