హైదరాబాద్: గ్రేటర్ అభ్యర్థుల గుండెల్లో సరికొత్త గుబులు మొదలైంది. వలస ఓట్లపై ఆందోళన నెలకొంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చి స్థిరపడినప్పటికీ చాలామంది నగరవాసులు సొంత ఊళ్లలోనే ఓటింగ్‌లో పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో వేలాది మంది నగరంలోనూ, సొంత ఊళ్లోను ఓటుహక్కును కలిగి ఉన్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి 30 వేల మందికి పైగా ఓటర్లు రెండు చోట్ల ఓటుహక్కును కలిగి ఉన్నట్లు అంచనా. వివిధ కారణాల దృష్ట్యా వారంతా నగరంలో ఉంటున్నప్పటికీ పుట్టి పెరిగిన ఊళ్లలో తమ అస్తిత్వాన్ని చాటుకొనేందుకు సొంత ఊళ్లలోనే ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇదొక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లోనూ నగరంలో ఓటు హక్కును కలిగి ఉన్నప్పటికీ చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిణామం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఉన్నత, మధ్యతరగతి వర్గాల కంటే దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాలే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటారు. ప్రస్తుతం నగరంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధుల తరఫున ప్రచారంలో పాల్గొనడంతో పాటు, సభలు, సమావేశాల్లోనూ ఈ వర్గాలే భారీ సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటుహక్కును ఎక్కడ వినియోగించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
అనుచరులతో నిఘా...
► ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అనుచరులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తున్నారు. డివిజన్‌లు, కాలనీలు, బస్తీల వారీగా ఇన్‌చార్జులను ఏర్పాటు చేసి ప్రతి ఓటరు నగరంలోనే తమ ఓటుహక్కును వినియోగించుకొనేలా ప్రోత్సహించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే మద్యం, డబ్బు పంపిణీ మొదలైన దృష్ట్యా ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో సొంత ఊళ్లకు వెళ్లకుండా గట్టి హామీలను తీసుకుంటున్నట్లు తెలిసింది. నగరంలోని ఉప్పల్, ఎల్‌బీనగర్, మల్కాజిగిరి. మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం స్థిరపడిన వారు, వలస కూలీలు, అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారు, స్విగ్గి, జొమాటో, ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత వర్కర్లు తదితర వర్గాలకు చెందిన వారు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో 30 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా.
► సొంత ఊళ్లలో స్థిరనివాసం కలిగిన వీరిలో ఎక్కువ మంది నగరంలో అద్దె ఇళ్లల్లోనే నివస్తున్నారు. దీంతో నగరంలో ఓటుహక్కు, రేషన్ కార్డు వంటివి కలిగి ఉన్నప్పటికీ ఎప్పటికై నా సొంత ఊళ్లకు వెళ్లాల్సిన వారిమేననే భావనతో ఉన్నారు. దీంతో సొంత ఊళ్లోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ చాలా మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అలా వెళితే నగరంలోని వివిధ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లను ఆశిస్తున్న అభ్యర్థులకు ఇది అశనిపాతమే కానుంది.
వాహనాలు రెడీ..
హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ఓటర్లను తరలించేందుకు వివిధ పార్టీలు పెద్ద సంఖ్యలో వాహనాలను బుక్ చేస్తున్నాయి. ఓటర్లను నగరంలోని తమ ఇంటి నుంచి తీసుకెళ్లి ఓటింగ్ అనంతరం తిరిగి నగరానికి చేరవేసేందుకు ట్రావెల్స్‌కు చెందిన వాహనాలను బుక్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మినీ బస్సులు, కార్లు, క్రూజర్లు వంటి వాహనాలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారు. అలా రాలేనివాళ్లకు బస్సుల్లో, రైళ్లలో వచ్చేందుకు చార్జీలు, ఖర్చులు కూడా ముందస్తుగానే అందజేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సొంత ఊళ్లలోఓటు హక్కును వినియోగించుకొనేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలను సేకరించేందుకు ఆయా ఊళ్లకు చెందిన నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దృష్ట్యా ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ఎలాంటి ఖర్చులకై నా వెనుకడుగువేయడం లేదు. ఇటు హైదరాబాద్‌లోని వివిధ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు అందజేసే తాయిలాలు.. అటు జిల్లాల్లోని సొంత నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి వచ్చే ఆహ్వానాలతో ఓటర్లు ఎటూ తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment