కూకట్‌పల్లి బరిలో హరివర్ధన్‌రెడ్డి..? | kukatpally congress party candidate Singireddy Harivardhan Reddy | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి బరిలో హరివర్ధన్‌రెడ్డి..?

Published Sun, Oct 22 2023 8:28 AM | Last Updated on Sun, Oct 22 2023 8:28 AM

kukatpally congress party candidate Singireddy Harivardhan Reddy  - Sakshi

హైదరాబాద్: మేడ్చల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో అలకబూనిన సీనియర్‌ నాయకుడు పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం పడింది. ఏళ్లుగా మేడ్చల్‌ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హరివర్ధన్‌ను దూరం చేసుకుంటే పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు జిల్లాలోని కూకట్‌పల్లి నియోజకవర్గం టికెట్‌ కేటాయించి, అక్కడి నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. 

హరివర్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయం చేసిన నాయకుడు. గతంలో మేడ్చల్, పరిగి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు. నగరంలోని హబ్సిగూడ నుంచి కాంగ్రెస్‌ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై ఐదేళ్ల పాటు పనిచేశారు. మేడ్చల్‌ టికెట్‌ ఆశించిన హరివర్ధన్‌రెడ్డి తాను గెలుపు గుర్రమైనా బీసీ నినాదంతో టికెట్‌ రాలేదని ఆయన వాదన. దీంతో తనకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదని, సర్వే రిపోర్టులను బయటపెట్టాలని బహిరంగంగానే డిమాండ్‌ చేస్తున్నారు. 

కూకట్‌పల్లి నుంచి బరిలోకి.. 
అసమ్మతితో రగులుతున్న హరివర్ధన్‌రెడ్డికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను జిల్లాలోని కూకట్‌పల్లి నుంచి బరిలోకి దించాలని రెండవ లిస్ట్‌లో పేరు చేర్చినట్లు సమాచారం. హరివర్ధన్‌రెడ్డి నివాసముండే బోయిన్‌పల్లి ప్రాంతం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటం, ఆయనకు గతంలో నగరంలో పనిచేసిన అనుభవం ఉండటం, కూకట్‌పల్లి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న నాయకుల మధ్య పెద్దగా పోటీ లేకపోవడంతో ఆయనను అక్కడి నుంచి రంగంలోకి దించాలని రేవంత్‌రెడ్డి దూతలు మల్లు రవి యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సెకండ్‌ లిస్ట్‌లో ఆయన పేరు ఖరారు చేసి జాబితాలో నమోదైందని హరివర్ధన్‌రెడ్డి అనుచరులు జాబితాను చూపిస్తున్నారు. హరివర్ధన్‌రెడ్డి మాత్రం తాను పోటీ చేసేది.. లేనిదీ.. దసరా పండగ తర్వాత ప్రకటిస్తానని చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement