Medchal constituency
-
మేడ్చల్.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే!
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి రాజకీయ ప్రముఖులకు రాజకీయంలో నిలదొక్కుకునేలా మేడ్చల్ నిలిచింది. పునరి్వభజనకు ముందు మేడ్చల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినవారే. పునరి్వభజనకు ముందు జీహెచ్ఎంసీతో కలిసి ఉండే నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్ తర్వాత అతి పెద్దదిగా మేడ్చల్ ఉండేది. మేడ్చల్, కూకట్పల్లి(కొంతభాగం) కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్(కొంతభాగం) నియోజకవర్గాలు కలిపి మేడ్చల్ నియోజకవర్గంగా ఉండేది. పునరి్వభజన తర్వాత మూడు ముక్కలైంది. ► 1962లో ఏర్పడ్డ మేడ్చల్ నియోజకవర్గం మొదటి ఎన్నికల్లో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రాంచందర్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాటి కాంగ్రెస్ యోధుడు కేవీ రంగారెడ్డిపై విజయం సాధించారు. ► 1967 నుంచి 72 వరకు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ అగ్రనేత సుమిత్రాదేవి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ► 1978లో మర్రి చెన్నారెడ్డి మేడ్చల్ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1983లో దివంగత తెలంగాణ పోరాట యోధుడు గౌడవెల్లికి చెందిన సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి సతీమణి ఉమాదేవి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎనీ్టఆర్ హవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 1983లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘట్కేసర్ మండలం కొర్రెములకు చెందిన కొమ్మురెడ్డి సురేందర్‌రెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలబడి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎనీ్టఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ► 1989లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఉమాదేవి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో నాటి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు ఎన్నికల ఆరు నెలల ముందే ఎనీ్టఆర్ మేడ్చల్ టికెట్ ప్రకటించడంతో 1994, 1999, 2004లలో కాంగ్రెస్‌కు చెందిన సింగిరెడ్డి ఉమాదేవిపై, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిపై, టీఆర్ఎస్కు చెందిన సురేందర్‌రెడ్డిపై దేవేందర్‌గౌడ్ వరుసగా గెలిచారు. ఎనీ్టఆర్, చంద్రబాబు కేబినెట్లలో రెవెన్యూ, బీసీ సంక్షేమం, హోంమంత్రిగా పనిచేసి, రాజశేఖర్‌రెడ్డి హయాంలో టీడీఎల్పీ ఉపనేతగా పని చేశారు. ► 2004లో పునరి్వభజన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి టీడీపీకి చెందిన నక్క ప్రభాకర్‌గౌడ్‌పై గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మలిపెద్ది సు«దీర్‌రెడ్డి టీడీపీకి చెందిన తోటకూర జంగయ్యపై ఎమ్మెల్యేగా గెలిచారు. అందరికీ ఆశ్రయం ఇచ్చిన మేడ్చల్.. మేడ్చల్ ఓటర్లు ఏనాడూ స్థానిక స్థానికేతర భేదం లేకుండా అందరినీ రాజకీయంగా ఆదరించారు. మేడ్చల్ నుంచి 12 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఉమాదేవి, సురేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలు మాత్రమే నియోజకవర్గానికి చెందిన వారు కాగా మిగతా వారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నేతలే. ఇలా మేడ్చల్ రాష్ట్రానికి ఉద్దండ నాయకులను అందించడంతో పాటు చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను అందించింది. ఆరుసార్లు ఓడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని మొదటిసారి చట్టసభలకు పంపిన ఘనత మేడ్చల్ ఓటర్లదే.. పోటీలో తొలిసారి నిలిచిన దేవేందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, ఉమాదేవి, మల్లారెడ్డి వంటి నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను కల్పించిన ఘనత మేడ్చల్ ఓటర్లదే.. -
కూకట్పల్లి బరిలో హరివర్ధన్‌రెడ్డి..?
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అలకబూనిన సీనియర్ నాయకుడు పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం పడింది. ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హరివర్ధన్ను దూరం చేసుకుంటే పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు జిల్లాలోని కూకట్పల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించి, అక్కడి నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. హరివర్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయం చేసిన నాయకుడు. గతంలో మేడ్చల్, పరిగి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు. నగరంలోని హబ్సిగూడ నుంచి కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై ఐదేళ్ల పాటు పనిచేశారు. మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్‌రెడ్డి తాను గెలుపు గుర్రమైనా బీసీ నినాదంతో టికెట్ రాలేదని ఆయన వాదన. దీంతో తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని, సర్వే రిపోర్టులను బయటపెట్టాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి నుంచి బరిలోకి.. అసమ్మతితో రగులుతున్న హరివర్ధన్‌రెడ్డికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను జిల్లాలోని కూకట్పల్లి నుంచి బరిలోకి దించాలని రెండవ లిస్ట్‌లో పేరు చేర్చినట్లు సమాచారం. హరివర్ధన్‌రెడ్డి నివాసముండే బోయిన్పల్లి ప్రాంతం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటం, ఆయనకు గతంలో నగరంలో పనిచేసిన అనుభవం ఉండటం, కూకట్పల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య పెద్దగా పోటీ లేకపోవడంతో ఆయనను అక్కడి నుంచి రంగంలోకి దించాలని రేవంత్‌రెడ్డి దూతలు మల్లు రవి యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సెకండ్ లిస్ట్‌లో ఆయన పేరు ఖరారు చేసి జాబితాలో నమోదైందని హరివర్ధన్‌రెడ్డి అనుచరులు జాబితాను చూపిస్తున్నారు. హరివర్ధన్‌రెడ్డి మాత్రం తాను పోటీ చేసేది.. లేనిదీ.. దసరా పండగ తర్వాత ప్రకటిస్తానని చెబుతున్నారు. -
కాంగ్రెస్ వైపు.. తండ్రి కొడుకుల చూపు?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీ నేతలను తమవైపు ఆకర్శించే ఎత్తులు వేస్తోంది. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కొనే సత్తాగల నేతలవైపు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీప బంధువు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఆయన కుమారుడు మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డిలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు నాయకులు జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఐదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గు.. మలిపెద్ది సుధీర్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రి వర్గంలోకి చేర్చుకుంది. తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు. బీఆర్ఎస్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సు«ధీర్రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సుధీర్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి దక్కే ప్రయత్నం చేశారు. సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు.. 2023 ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. బీఆర్ఎస్లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేని, నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్‌రెడ్డి చాలాకాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో బంధుత్వం ఉండటంతో కాంగ్రెస్ నాయకులు అతడిని తమపార్టీలోకి చేర్చుకోగలమన్న ధీమాతో ఉన్నారు. అయితే తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సుధీర్‌రెడ్డి మాత్రం తనకు టికెట్ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్ఎస్ ఓట్లూ తాను పొందగలనని, టికెట్ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది. బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలే అవకాశం.. ఒకే నియోజకవర్గంలో పలువురు టికెట్ ఆశిస్తూండగా సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే మిగిలిన వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపడితే హరివర్ధన్ రెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి, నక్క ప్రభాకర్ గౌడ్‌కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి, జంగయ్య యాదవ్‌కు నామినేటెడ్ పోస్టు, ఆయన కుమారుడికి బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇస్తామని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా అందరి అసంతృప్తిని చల్లార్చి ఒక్కతాటిపై ఎన్నికలకు వెళ్లడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చునని, సుధీర్ రెడ్డి గెలుపు సాధ్యమవుతుందని టీపీసీసీ స్థాయి నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది. సుధీర్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే మేడ్చల్‌లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని, కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ స్తబ్ధత పోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకుల అంచనా. -
‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడిన ఓ సంచలనమే. మల్లారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలకు జనాల్లో, సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలతో కొత్త చర్చకు తెరలేపారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించింది తానేనని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించడంలో తనదే నిర్ణయాత్మక పాత్ర అని పేర్కొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపు గొడవల వెనుక తామే ఉన్నామని చెప్పుకొచ్చారు. గతంలో తనపై జరిగిన ఐటీ దాడుల అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులు ఉన్న గదిని చూడలేదు. ఆ డబ్బులు ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తా..’’అని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా, మరొకరు పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. సొంత పార్టీ నేతల వార్నింగ్!
సాక్షి, మేడ్చల్ జిల్లా: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. నామినేటెడ్ పదవుల పంపకంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు తాను చెబితేనే పనులు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మంత్రి పెత్తనాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్ఎస్ శాసనసభ్యులు.. ఈ వ్యవహారంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. మైనంపల్లితో పాటు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రి వ్యవహారశైలిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో మేడ్చల్‌కే ప్రాధాన్యతనిస్తూ.. మిగతా సెగ్మెంట్లకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం.. ‘మా నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికార పార్టీలో ఉండి ఏం ప్రయోజనం? మంత్రి మల్లారెడ్డి ఒకదారి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు మరొకదారి.. ఈ ఇద్దరి వల్ల విసిగిపోయాం.. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన వారే అయోమయానికి గురిచేస్తూ జిల్లాలో పార్టీని భ్రషు్టపట్టిస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీకి తీవ్ర కళంకాన్ని తెస్తున్నారు..’ అంటూ సమావేశంలో నేతలు చర్చించుకున్నారు. వారిని వెంటనే తప్పించి కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే విషయం కూడా చర్చించారు. పార్టీ పరువు తీస్తున్నారు! కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలను సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉండగా..మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురి చేస్తూ పార్టీ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని సాక్షాత్తు సీఎం కేసీఆరే ప్రకటించినప్పటికీ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు నేతలు పలు నియోజకవర్గాల్లో టికెట్ తమకే వస్తుందంటూ కార్యకర్తలను డైలమాలో పడేస్తున్నారని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నాం: ఎమ్మెల్యేలు జిల్లాలోని నామినేటెడ్ పదవులన్నీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కేవలం మేడ్చల్ నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగతా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సోమవారం ప్రత్యేక భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి తీరును నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే మీడియా ముందుకు రావాల్సివచి్చందని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, చేష్టలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కూడా.. రాత్రికి రాత్రే జీవో జారీ చేసి భాస్కర్ యాదవ్‌ను నియమించి, ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారని విమర్శించారు. మంత్రి గతంలో పదవులను పొందిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కేడరే బలమని, అలాంటి కేడర్‌ను విస్మరిస్తే పార్టీ దెబ్బతినే అవకాశముందన్నారు. పార్టీ కేడర్‌ను రక్షించుకునేందుకే మీడియా ముఖంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయాన్ని తెలుపుతున్నామని, వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
మంత్రి మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమపై అవాకులు చెవాకులు పేలుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. సంస్థాగత కమిటీల్లో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్రూపు రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నందున జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని శరత్ చంద్రారెడ్డి చెప్పారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభ ఆవరణలో మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, శరత్‌లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను వేర్వేరుగా కలిశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించడంతోపాటు, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశమవుతానని కేసీఆర్ సర్దిచెప్పినట్లు సమాచారం. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని, అందువల్ల తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు. కాగా అసెంబ్లీకి వచ్చిన శరత్ చంద్రారెడ్డికి విజిటర్ పాస్ లేకపోవడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆయనను లోనికి తీసుకెళ్లారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
ఇక్కడ ‘సర్వే’ సవాలే!
మేడ్చల్: ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ ఇంట్లో ఉండి సహకరించాలని సమాయత్తం అవుతున్న నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ 19న జరిగే సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇది హైదరాబాద్ శివారులో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతం కబ్జాదారులకు నిలయంగా మారింది. కాస్తోకూస్తో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో నేతలుగా చలామణి అవుతూ భూకబ్జాలు చేశారు. ఒక్కొక్కరు సుమారు 10 నుంచి 20 ఇళ్లను బినామీ పేర్లతో నిర్మించడమే కాకుండా ప్లాట్లను కబ్జా చేశారు. తాజాగా ప్రభుత్వం ఇంటింటికీ సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టడంతో తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే ఆందోళన అక్రమార్కుల్లో మొదలైంది. సర్వేలో తమ బాగో తం బయట పడకుం డా 10 రోజుల ముం దు నుంచే తమ ప్ర ణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇం దులో భాగంగా కబ్జాల్లోని ఇళ్లను, భూములను కాపాడుకోవడానికి తమ బంధుమిత్రులనో, కుటుంబ యజమానులు కానివారినో ఎంత కొంత డబ్బు ఇచ్చి జవహర్‌నగర్‌కు రప్పించే యత్నాలు చేస్తున్నారు. వారికి ముందుగానే అన్ని విషయాలు చెప్పి సర్వే రోజు అధికారులకు ఎలా సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. తమ కబ్జాలోని ఇళ్లు, స్థలాలు, బినామీ పేర్లను తమ బంధుమిత్రులకు ముందుగానే తెలియజేసి వాటికి సంబంధించిన జిరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. జవహర్‌నగర్ పరిధిలో ఇళ్ల రెగ్యులరైజేషన్ను గత ప్రభుత్వాలు చేయకపోవడంతో పేరుకు లక్ష జనాభా, 20 వేల కుటుంబాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా ఏ ఇల్లు ఎవరిదో.. ఏ స్థలం ఎవరిదో.. అర్థం కాని విచిత్ర పరిస్థతి నెలకొంది. దీంతో జవహర్‌నగర్‌లో కుటుంబ సమగ్ర సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. -
మేడ్చల్ టికెట్ నాదే: లక్ష్మారెడ్డి
మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గ టికెట్ తనకే లభిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. ఆ విశ్వాసంతోనే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఒకవేళ అధిష్టానం సిట్టింగ్‌లకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, దాన్ని అరికట్టడానికి తనవంతుగా నామినేషన్ వేయడానికి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వచ్చినట్లు వివరించారు.