హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీ నేతలను తమవైపు ఆకర్శించే ఎత్తులు వేస్తోంది. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తాగల నేతలవైపు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీప బంధువు, బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఆయన కుమారుడు మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డిలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు నాయకులు జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
ఐదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గు..
మలిపెద్ది సుధీర్ రెడ్డి 2014లో బీఆర్‌ఎస్ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రి వర్గంలోకి చేర్చుకుంది.
తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు. బీఆర్‌ఎస్‌లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సు«ధీర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సుధీర్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి దక్కే ప్రయత్నం చేశారు.
సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు..
2023 ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. బీఆర్‌ఎస్‌లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేని, నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్‌రెడ్డి చాలాకాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో బంధుత్వం ఉండటంతో కాంగ్రెస్ నాయకులు అతడిని తమపార్టీలోకి చేర్చుకోగలమన్న ధీమాతో ఉన్నారు.
అయితే తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సుధీర్‌రెడ్డి మాత్రం తనకు టికెట్ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్‌ఎస్ ఓట్లూ తాను పొందగలనని, టికెట్ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది.
బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలే అవకాశం..
ఒకే నియోజకవర్గంలో పలువురు టికెట్ ఆశిస్తూండగా సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే మిగిలిన వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపడితే హరివర్ధన్ రెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి, నక్క ప్రభాకర్ గౌడ్‌కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి, జంగయ్య యాదవ్‌కు నామినేటెడ్ పోస్టు, ఆయన కుమారుడికి బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇస్తామని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.
తద్వారా అందరి అసంతృప్తిని చల్లార్చి ఒక్కతాటిపై ఎన్నికలకు వెళ్లడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చునని, సుధీర్ రెడ్డి గెలుపు సాధ్యమవుతుందని టీపీసీసీ స్థాయి నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది. సుధీర్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని, కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ స్తబ్ధత పోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment