సాక్షి, మేడ్చల్ జిల్లా: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. నామినేటెడ్ పదవుల పంపకంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు తాను చెబితేనే పనులు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మంత్రి పెత్తనాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్‌ఎస్ శాసనసభ్యులు.. ఈ వ్యవహారంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. మైనంపల్లితో పాటు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రి వ్యవహారశైలిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో మేడ్చల్‌కే ప్రాధాన్యతనిస్తూ.. మిగతా సెగ్మెంట్లకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.
కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం..
‘మా నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికార పార్టీలో ఉండి ఏం ప్రయోజనం? మంత్రి మల్లారెడ్డి ఒకదారి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు మరొకదారి.. ఈ ఇద్దరి వల్ల విసిగిపోయాం.. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన వారే అయోమయానికి గురిచేస్తూ జిల్లాలో పార్టీని భ్రషు్టపట్టిస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీకి తీవ్ర కళంకాన్ని తెస్తున్నారు..’ అంటూ సమావేశంలో నేతలు చర్చించుకున్నారు. వారిని వెంటనే తప్పించి కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే విషయం కూడా చర్చించారు.
పార్టీ పరువు తీస్తున్నారు!
కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలను సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉండగా..మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురి చేస్తూ పార్టీ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని సాక్షాత్తు సీఎం కేసీఆరే ప్రకటించినప్పటికీ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు నేతలు పలు నియోజకవర్గాల్లో టికెట్ తమకే వస్తుందంటూ కార్యకర్తలను డైలమాలో పడేస్తున్నారని విమర్శించారు.
ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నాం: ఎమ్మెల్యేలు
జిల్లాలోని నామినేటెడ్ పదవులన్నీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కేవలం మేడ్చల్ నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగతా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సోమవారం ప్రత్యేక భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి తీరును నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే మీడియా ముందుకు రావాల్సివచి్చందని చెప్పారు.
మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, చేష్టలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కూడా.. రాత్రికి రాత్రే జీవో జారీ చేసి భాస్కర్ యాదవ్‌ను నియమించి, ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారని విమర్శించారు. మంత్రి గతంలో పదవులను పొందిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కేడరే బలమని, అలాంటి కేడర్‌ను విస్మరిస్తే పార్టీ దెబ్బతినే అవకాశముందన్నారు. పార్టీ కేడర్‌ను రక్షించుకునేందుకే మీడియా ముఖంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయాన్ని తెలుపుతున్నామని, వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment