
సుజాతనగర్ వ్యూ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు పెద్ద నియోజకవర్గంగా వెలిగిన సుజాతనగర్ నియోజకవర్గం రాజకీయ చిత్రపటం నుంచి పూర్తిగా కనుమరుగైంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1978లో ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా.. 2009లో చేపట్టిన పునర్విభజనలో తెరమరుగైంది. నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఏన్కూరు, జూలూరుపాడు, కామేపల్లి మండలాలు పూర్తిగా, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కారేపల్లి, కొత్తగూడెం, టేకులపల్లి, గార్ల మండలాలు పాక్షికంగా ఉండేవి. ఇక్కడ మొత్తం ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు(ఒక ఉప ఎన్నిక కలిపి) జరగగా నాలుగేసి సార్లు సీపీఐ, కాంగ్రెస్ విజయకేతనం
సీపీఐ వరుస విజయాలు ఎగరవేశాయి
సుజాతనగర్ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి మహమ్మద్ రజబ్ అలీ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఆయన విజయం సాధించడం విశేషం. ముప్పై ఏళ్ల పాలన క్రమంలో కేవలం ముగ్గురు అభ్యర్థులే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో చేపట్టిన పునర్విభజనలో ఈ నియోజకవర్గంలోని ఏన్కూరు, కొణిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి మండలాలతో పాటు, మధిర నియోజకవర్గంలో కొనసాగిన వైరా మండలాన్ని కలిపి కొత్తగా వైరా నియోజకవర్గం ఆవిర్భవించింది. దీంతో 30 ఏళ్లపాటు నియోజకవర్గంగా కొనసాగిన సుజాతనగర్ గ్రామపంచాయతీ కేంద్రంగా మిగిలిపోయింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటులో భద్రాద్రి కొత్తగూడెంలో కలిసింది. ఇప్పుడు మండల కేంద్రంగా కొనసాగుతుండగా... నాటి గురుతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
తొలి ఎమ్మెల్యే సీతారామయ్య
1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుజాతనగర్ తొలి ఎమ్మెల్యేగా బొగ్గారపు సీతారామయ్య కాంగ్రెస్(ఐ) నుంచి పోటీ చేసి సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుపై విజయం సాధించారు. బొగ్గారపు సీతారామయ్య, పువ్వాడ నాగేశ్వరరావులు ఇరువురు కలిసి న్యాయవిద్యను అభ్యసించినా రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులుగా పోటీచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, నిజాం హైదరాబాద్ సంస్థానం పాలన విముక్తి కోసం జరిగిన పోరాాటంలో పాల్గొన్న వ్యక్తిగా సీతారామయ్య గుర్తింపు పొందారు. ప్రముఖ న్యాయవాదిగా, శాసనసభ అంచనాల కమిటీ అధ్యక్షునిగా, ప్యానెల్ స్పీకర్‌గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం బలపర్చిన జనతా పార్టీ అభ్యర్ధి గోగినేని సత్యనారాయణ మధ్యే పోటీ ఉంటుందని అప్పట్లో అంతా భావించారు. రాజకీయ అంచనాలకు అందని విధంగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచిన సీతారామయ్య అందరినీ ఆశ్చర్యపరిచారు. హైకోర్టు న్యాయవాదిగా సైతం పనిచేసిన సీతారామయ్య కరోనాతో మృతి చెందారు.
రజబ్ అలీది చెరగని ముద్ర
సీపీఐ నుంచి మహ్మద్ రజబ్ అలీ సుజాతనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తొలిసారి 1983లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి మహ్మద్ ఇస్మాయిల్‌పై గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ విజయం సాధించినా ఆ పార్టీ అభ్యర్థి సామినేని రాఘవులుకు ఇక్కడ కేవలం 12 వేల ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, సీపీఎం మద్దతుతో వరుసగా సీపీఐ అభ్యర్ధి రజబ్ అలీ కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డిపై విజయం సాధించారు. ఒకమారు కాంగ్రెస్ అధిష్టానం చేకూరి కాశయ్యకు టిక్కెట్ ఇవ్వగా...రాంరెడ్డి వెంకటరెడ్డి స్వతంత్య అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో చేకూరికి కేవలం 10 వేల ఓట్లే వచ్చాయి.
రాంరెడ్డి ప్రస్థానం
రజబ్ అలీ మరణాంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్ పాగా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. సీపీఎం, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన రాంరెడ్డి సీపీఐ అభ్యర్థి టీ.వీ.చౌదరిని ఓడించారు. 1999 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. టీడీపీ నుంచి పోట్ల నాగేశ్వరరావు, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి బరిలో నిలవగా.. రాంరెడ్డి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోట్ల మాధవి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి పోటీ చేయగా.. రాంరెడ్డి మళ్లీ గెలుపొందారు. 1996, 1999, 2004లలో వరుసగా మూడుసార్లు గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి హ్యాట్రిక్ సృష్టించారు. 2009లో పునర్విభజనలో సుజాతనగర్ నియోజకవర్గం కనుమరుగు కావడంతో 2009, 2014లో రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తద్వారా ఆయన రెండు నియోజకవర్గాల్లో కలిపి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నట్లయింది.
సుజాతనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు వీరే
సంవత్సరం విజేత పార్టీ
1978 బొగ్గారపు సీతారామయ్య కాంగ్రెస్ (ఐ)
1983 ఎండీ రజబ్ అలీ సీపీఐ
1985 ఎండీ రజబ్ అలీ సీపీఐ
1989 ఎండీ రజబ్ అలీ సీపీఐ
1994 ఎండీ రజబ్ అలీ సీపీఐ
1996 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్
1999 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్
2004 రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్

రజబ్ అలీ (ఫైల్)

రాంరెడ్డి వెంకటరెడ్డి (ఫైల్)

బొగ్గారపు సీతారామయ్య (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment