రాజకీయ కుటుంబాల్లో సీటు పంచాయితీ కామనే. చాలా నియోజకవర్గాల్లో అన్న దమ్ముల మధ్య, కజిన్స్ మధ్య సీటు కోసం కుస్తీ పోటీలు జరుగుతుంటాయి. కాని ఓ నియోజకవర్గం కోసం తండ్రీ కొడుకులే కుస్తీ పట్లు పడుతున్నారు. ఇప్పుడిదే తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీటు త్యాగం చేయడానికి ఇద్దరిలో ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని టాక్. వారి సంగతేంటో తెలుసుకుందా..
తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ తండ్రీ కొడుకుల పొలిటికల్ కుస్తీ ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ పీసీసీలో ముఖ్యులే. కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితులే. కాని సీటు కోసం అటు తండ్రి, ఇటు కొడుకు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ, టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్‌కుమార్ యాదవ్ ముషీరాబాద్ సీటు కోసం పోటీ పడుతున్నారట.
రెండోసారి తప్పుకుంటే ఎలా..
అంజన్‌కుమార్ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలవగా, ఆయన తనయుడు అనిల్‌కుమార్ ముషీరాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలని అనిల్‌కుమార్ కోరుకుంటున్నారు. అయితే ఆయన తండ్రి కూడా తమకు పట్టున్న ముషీరాబాద్ నుంచే పోటీ చేసి గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందాలని తాపత్రయపడుతున్నారు. ఇక్కడే ఇద్దరి మధ్యా వార్ మొదలైంది.
తనకు రానున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తన కొడుకు అనిల్‌కుమార్‌ను డ్రాప్ చేసుకోవాలని అంజన్‌కుమార్ కోరుతున్నారు. అయితే అనిల్ మాత్రం ఒకసారి పోటీ చేసి రెండోసారి తప్పుకుంటే తన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈ సారి పోటీ చేయకుంటే మళ్ళీ ఆ తర్వాత టిక్కెట్ రావడం కష్టమని అనిల్ భావిస్తున్నారట. అందుకే తన తండ్రిని ఎలాగైనా ఒప్పించి ఎలాగైనా ముషీరాబాద్ బరిలో నిలవాలని అనిల్ పట్టదలతో ఉన్నారు.
అయితే తండ్రి, కొడుకులు ఇద్దరూ తమ రాజకీయ భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారా అనే అనుమానం కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తండ్రీ కొడుకుల్లో ఎవరో ఒకరు త్యాగం చేసి తప్పుకోకపోతే.. ఇద్దరూ నష్టపోతారని హితవు చెబుతున్నారు అంజన్‌కుమార్ సన్నిహితులు.
హైకమాండ్ కరుణిస్తే ఓకే లేదంటే..
కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధన కాంగ్రెస్ హైకమాండ్ కచ్చితంగా అమలు చేస్తే ముషీరాబాద్ నుంచి అంజన్‌కుమార్ పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయని, ఇద్దరికీ టిక్కెట్లు ఇస్తే చెరో నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.
ఒకే సీటు కోసం తండ్రీ కొడుకులు పోటీ పడుతుండటం విచిత్రంగా ఉందని గాంధీభవన్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఒక్కరికే సీటిస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అంజన్‌కుమార్‌యాదవ్‌కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మరి తండ్రి కోసం కొడుకు సీటు త్యాగం చేస్తాడా? అయితే టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ కూడా ముషీరాబాద్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తండ్రీ కొడుకుల్లో ఎవరికైనా దక్కుతుందా? లేక పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా మూడో వ్యక్తికి ఇస్తారా అనేది చూడాలి.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment