హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి.. అది దక్కని ఆశావహులు అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్ నీకా? నాకా ? అన్నట్లు పోరాడిన వారు తమకు దక్కని టికెట్ ఇతరులకు దక్కితే వారితో కలిసి పనిచేయడం అసాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం మాట కాదనలేక కలిసి పని చేయగలమని తలాడించినప్పటికీ, నిజంగా క్షేత్రస్థాయిలో ఏమేరకు పని చేయగలరన్నది వేచి చూడాల్సిందే. ఉదాహరణకు ఉప్పల్ అభ్యర్థికి టికెట్ రాకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం పనిచేయగలరా? అని స్థానికులే ప్రశ్నిస్తున్నారు.
అలాగే.. అంబర్‌పేటలో టికెట్ కోసం ప్రయత్నించిన ఎడ్ల సుధాకర్, కాలేరు వెంకటేశ్‌కు టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లు కట్టి డిమాండ్ చేసిన తాజా, మాజీ కార్పొరేటర్లు, తదితరులు ఆయన విజయానికి పనిచేస్తారా? అనే సందేహాలున్నాయి. ముషీరాబాద్‌లో ఎమ్మెన్ శ్రీనివాసరావు, ఆయన అనుయాయులు ముఠాగోపాల్ కోసం పనిచేస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. కంటోన్మెంట్‌లోనూ టికెట్ కోసం కడదాకా పోరాడిన గజ్జెల నగేష్, మన్నె క్రిశాంక్, శ్రీగణేశ్ లాస్యనందితకు సహకరించగలరా అన్నది సందేహాస్పదమే. వీరిలో శ్రీగణేశ్ ఇప్పటికే ఇండిపెండెంట్‌గానైనా సరే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మహేశ్వరం టికెట్ రాని పక్షంలో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారతారని ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఎల్‌బీనగర్ నుంచి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, రాజేంద్రనగర్ టికెట్ కోసం ప్రయత్నించిన ఎంపీ రంజిత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో టికెట్ తనకే వస్తుందని భావించిన బండి రమేశ్ తదితరులు ఎంపికై న అభ్యర్థుల కోసం ఏమేరకు కృషి చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకున్న వారు అసంతృప్తులను తమ దారికి తెచ్చుకోగలరా.. వారి నడుమ సఖ్యత సాధ్యమేనా.. అన్నది కాలమే తేల్చనుంది.
Comments
Please login to add a commentAdd a comment