సంగారెడ్డి కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఈ ముగ్గురు | - | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఈ ముగ్గురు

Published Tue, Sep 5 2023 6:38 AM | Last Updated on Tue, Sep 5 2023 11:46 AM

- - Sakshi

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ము గ్గురు నేతలకు చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ము గ్గురు నేతలకు చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జాబితాలో అందోల్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి నుంచి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్‌ పేరు కూడా జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఉండే అవశాలున్నాయి.

అందోల్‌ టిక్కెట్‌ కోసం దామోదర రాజనర్సింహతోపాటు ఆయన కూతురు త్రిష మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డితో పాటు మరో నలుగురు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జగ్గారెడ్డి పేరు తొలిజాబితాలో చోటు దక్కనుంది. ఇక జహీరాబాద్‌ నియోజకవర్గంలో చంద్రశేఖర్‌తో పాటు స్థానికంగా ఉండే ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ టిక్కెట్‌ హామీతోనే చంద్రశేఖర్‌ పార్టీలో చేరడంతో తొలిజాబితాలోనే ఆయన పేరు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసే ప్రక్రియను ఆ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ చేపట్టింది. ఆయా నియోజకవర్గాల టికెట్ల కోసం గతనెల 25 వరకు అందిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరికి దక్కుతాయోనని ఆసక్తి నెలకొంది.

ఆ రెండు చోట్ల పీటముడి..
పటాన్‌చెరు, నర్సాపూర్‌ నియోజకవర్గాల విషయంలో పీటముడి నెలకొంది. పటాన్‌చెరువు నియోజకవర్గం టికెట్‌ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌ ఆశిస్తున్నారు. తొలి జాబితాలోనే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కాటా శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ఈ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు గాలి అనిల్‌ కూడా నర్సాపూర్‌ టికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ గాలి అనిల్‌కు నర్సాపూర్‌ టికెట్‌ ఖరారైతే పటాన్‌చెరు టికెట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పటాన్‌చెరులో కాటా తోపాటు శశికళాయాదవ్‌రెడ్డి, ఎం.సప్పాన్‌దేవ్‌.. ఇలా మొ త్తం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గానికి గాలి అనిల్‌తో పాటు, ఆవుల రాజిరెడ్డి, శివన్నగారి ఆంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డి తదితరులు ఆశిస్తున్నారు.

మలిజాబితాలో..
నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సంజీవరెడ్డి మధ్య పంచాయితీ తేలితే ఇక్కడి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదక్‌లో నియోజకవర్గానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చౌదరి సుప్రభాత్‌రావు, మ్యాడం బాలకృష్ణలతో కలిసి ఏకంగా 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ కొత్త నాయకుడు పార్టీలో చేరే అవకాశాలుండటంతో మెదక్‌ అభ్యర్థిత్వం తొలిజాబితాలో ఉండే అవకాశం లేదు.

ఆ నాలుగు చోట్ల..
దుబ్బాక టికెట్‌ కోసం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ కత్తి కార్తీకగౌడ్‌, శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారికే సాధారణ ఎన్నికల్లోనూ టికెట్‌ ఇవ్వాలనే పార్టీ నిబంధన ఉన్నందున తనకే టికెట్‌ తనకే దక్కుతుందని శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ ద్వారా శ్రావణ్‌కుమార్‌రెడ్డి ప్రయ త్నాలు చేస్తున్నారు.

సిద్దిపేట టిక్కెట్‌ కోసం ఏకంగా 15 మంది దరఖాస్తు చేసుకోగా, గజ్వేల్‌ టికెట్‌కూ పోటాపోటీ నెలకొంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పోటీ చేసే అభ్యర్థి కావడంతో కాంగ్రెస్‌ ఆచీతూచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తొలి జాబితాలో మూడు పేర్లు మాత్రమే ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement