బీజేపీతో ఒప్పందం చేసుకుంటే కవిత అరెస్టయ్యేవారా?
ప్రతిపక్షనేతలపై కేంద్రానివి అక్రమ కేసులు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ది అక్రమ అరెస్టు
బీజేపీ తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్: నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్య కర్తల సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు. దేశంలో ప్రతిపక్షపార్టీల మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బీజేపీతో బీఆర్‌ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ కవిత అరెస్టయి ఉండేవారా అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును రాహుల్‌గాంధీ ఖండిస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం సమర్థిస్తున్నా రని, రేవంత్‌రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రా..? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా అని నిలదీశారు.
రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే సీఎం రేవంత్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు, 38 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్కరినీ పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు.
చోటే భాయ్‌కి బడే భాయ్ ఆశీర్వాదం
చోటే భాయ్ సీఎం రేవంత్‌రెడ్డి.. బడే భాయ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నా రని, బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక్క ముస్లింను కూడా కేబినేట్‌లోకి తీసుకోలేదని విమర్శించారు.
మైనార్టీల సంక్షేమ బడ్జెట్‌లోనూ కోత విధిస్తున్నారని, కనీసం రంజాన్ తోఫా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment