అడ్డగోలుగా ప్రచారాలు.. జోరుగా వ్యక్తిగత ఆరోపణలు | Parties Campaign In Social Media For Telangana Assembly Polls | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా ప్రచారాలు.. జోరుగా వ్యక్తిగత ఆరోపణలు

Oct 29 2023 8:40 AM | Updated on Oct 29 2023 8:40 AM

Parties Campaign In Social Media For Telangana Assembly Polls  - Sakshi

మేడ్చల్‌: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సోషల్‌ మీడియాలో రాజకీయ ప్రచారాలు అడ్డగోలుగా చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తాము సమర్థంచే పార్టీలు, అభ్యర్థుల కోసం ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తూ సోషల్‌ మీడియాను ఫాలో చేసే వారికి చిర్రెత్తిస్తున్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా తమ ప్రచారం తాము చేసుకోవాలని నిబంధనలు ఉన్నా అడ్డూ అదుపు లేని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ల జోరుగా కనిపిస్తోంది. 
 
ప్రత్యేక గ్రూపులు.. 
ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల్లో మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సోషల్‌ మీడియాను నేటి రాజకీయ నాయకులు ఎక్కువగా వాడుకుంటున్నారు. ప్రధానంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా వాడుతున్నారు. యూట్యూబ్‌కు కొంతవరకు నియంత్రణ ఉంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధిలో ఉండే ఓటర్ల నంబర్లు సేకరించి గ్రూపులుగా తయారు చేస్తున్నారు. 

మా ఊరు, మన వార్డు, మన కాంగ్రెస్, మన బీజేపీ, మన బీఆర్‌ఎస్, జంగయ్య సైన్యం, మల్లారెడ్డి సైన్యం, మున్సిపాలిటీ, మండలం, నియోజకవర్గం ఇలా వార్డు స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు గ్రూపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వారు పెట్టే పోస్టింగ్‌లు నిజమో కాదో ఎవరికీ తెలియదు.. కానీ చక్కర్లు మాత్రం జోరుగా కొట్టిస్తున్నారు. ఓ ప్రముఖ సర్వేలో మా అభ్యరి్థకి 70శాతం మంది ఓటర్లు మొగ్గుచూపారని, గెలుపుమాదే అని ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నారు. ఆ సర్వే ఎవరూ చేశారు, ఏ సంస్థ చేసింది పోస్ట్‌ పెట్టిన వాడికే తెలియదు. అభిమానం కట్టలు తెంచుకుని ఉండటంతో వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ చేయడం ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడమే వారి పని. 

సోషల్‌ మీడియా ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉండటంతో ప్రచారంలో నాయకులు దానిపై ఆధారపడుతున్నారు. వీటీ కోసం స్థానికంగా ప్రత్యేక వ్యస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫొటోలు పెట్టి అందంగా మేకప్‌ చేసి సందేశాలను విడుదల చేస్తున్నారు. ఒక్కో మెసేజ్‌కు రూ.30, వీడియోకు రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. 

చాలామందికి ఇదో రకం ఉపాధిగా మారింది. ఫొటోలు పెట్టుకొని గ్రూపుల్లో ప్రచారాలు చేయడం, వాట్సాప్‌లలో పెట్టడం, స్టేటస్‌ పెట్టుకోవాలని సూచించడం వంటి మెసేజ్‌లు ఎన్నో కనిపిస్తున్నాయి. ఎన్నికలకు నెల రోజుల సమయం ఉన్నా సోషల్‌ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement