Pakistan Sees Rise In Stealing Sacrificial Animals Amid Bakrid 2023, Details Inside - Sakshi
Sakshi News home page

పాక్‌ దుస్థితి: బక్రీద్‌ వేళ దొంగతనాలు.. ఒక్క కరాచీలోనే మూడు వేల కేసులు!

Published Wed, Jun 28 2023 8:46 AM | Last Updated on Wed, Jun 28 2023 10:31 AM

Pakistan sees rise stealing sacrificial animals Amid Bakrid 2023 - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో..  ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. బతకడానికి దొంగతనాలకు, దోపిడీలకు సైతం తెగపడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో బక్రీద్‌ వేళ మేకలు, గొర్రెల దొంగతనాలు పెరిగిపోవడం.. అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో తెలియజేస్తోంది.

జూన్‌ 29న బక్రీద్ కాగా..  పాక్ లో మేకలు, గొర్రెల వంటి జీవాలకు రక్షణ లేకుండా పోయింది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయం. అయితే మేకలు, గొర్రెల ధరలు అక్కడ ఆకాశాన్నంటుతుండడంతో.. చాలామంది దొంగతనాలకు మొగ్గుచూపుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోనూ ఈ కేసులు అడ్డగోలుగా నమోదు అయ్యాయట. 

గత ఐదు నెలలుగా అక్కడ మూడు నెల కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింధ్‌ సిటిజన్స్‌ పోలీస్‌ కమిటీ ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది కూడా. క్వెట్టాలోనూ  ఈ తరహా కేసులు చాలానే నమోదు అయ్యాయి. మేతకు వెళ్లిన మంద నుంచి.. రిస్క్‌ చేసి వాహనాలపై తీసుకెళ్తున్నవాటిని.. ఆఖరికి దుకాణాలు పగలకొట్టి మరీ మూగజీవాలను ఎత్తుకెళ్తున్నారు. 

అంతేకాదు మందతో అమ్మడానికి వెళ్తున్న వాళ్లను సైతం బెదిరించి దొపిడీలకు పాల్పడుతున్నారట. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను ఎత్తుకెళ్లారు. అలాగే.. ట్రాలీలోకి ఎక్కేసి మరీ చోరీలకు పాల్పడుతున్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అవుతోంది.  దీంతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: కొత్త చట్టంతో పాక్‌లో అడుగుపెట్టబోతున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement