చేప కర్రీ చేస్తున్నమత్స్యకారుడు
చేప వంటకాలకు అడ్డాగా జూరాల ఎడమ కాల్వ
అంతర్రాష్ట్ర పర్యాటకులను ఆకర్షిస్తున్న ఘుమఘుమలు
కేవలం చేప ఫ్రై, కర్రీ రెండు రకాలతోనే వంటకాలు
వారాంతాల్లో యువకుల సందడి
ఉపాధి పొందుతున్న వందలాది మత్స్యకారులు
జూరాల చేప వంటల తయారీకి పేరుగాంచింది. 25 సంవత్సరాలుగా ప్రాజెక్టు సమీపంలోని నందిమళ్ల గ్రామానికి చెందిన మత్స్యకారులతోపాటు ఇతరులు చేపల విక్రయాలు, వాటి వంటకాల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ దొరికే చేప వంటకాల కోసం ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్, సమీపంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పర్యాటకులు, యువకులు తరలివస్తుంటారు.
వానాకాలంలో ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లను వీక్షించడంతోపాటు ఇక్కడ వండే చేప వంటకాల కోసం ఆసక్తి చూపిస్తారు. అప్పటికప్పుడే పట్టుకున్న చేపలను జాలర్లు విక్రయిస్తుండటంతో నేరుగా కొనుగోలు చేసి వాటిని తమ రుచికి అనుగుణంగా వండమంటూ అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఇస్తూ కడుపార ఆరగించి.. సాయంత్రం వరకు జూరాల అందాలను చూస్తూ సరదాగా గడుపుతారు.
చేప ఫ్రై.. చేప పులుసు వంటకాలకు అడ్డాగా మారింది జూరాల ఎడమ కాల్వ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలు.. వాటి ముందు వంటలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న కట్టెల పొయ్యిలపై చేసిన చేప వంటకాలతో ఆ పరిసరాలు ఘుమఘుమలాడుతాయి. ఇక్కడి చేప వంటలను రుచిచూసిన ప్రతిఒక్కరు.. మరోమారు కుటుంబ సభ్యులతో కలిసి రావాలని ఆశపడతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మామూలు రోజుల్లో పదుల సంఖ్యల్లో, వారాంతాల్లో వందలాదిగా ఉండే పర్యాటకుల సంఖ్య.. జూరాలకు వరదలు వచ్చే సమయంలో వేలకు చేరుతుంది. ఆ సమయంలో గంటల తరబడి వేచిచూసి మరీ చేప వంటకాలను రుచిచూస్తారు. – అమరచింత
ఇక్కడ దొరికే చేపలు..
జూరాల ప్రాజెక్టు వద్ద దూ బొచ్చ, రౌవులు, బొచ్చ, కొరమీనుతోపాటు బంగారు తీగలు విరివిగా లభిస్తాయి. వీటిలో ఫ్రైతోపాటు కూర కోసం దూబొ చ్చ, బొచ్చ రకాల చేపలనే అత్యధికంగా ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. సాధారణ రోజుల్లో కిలో చేపలు రూ.120 – 150 వరకు విక్రయిస్తారు. కొనుగోలు చేసిన చేపలను శుభ్రంగా కడిగి.. కోయడానికి కిలో రూ.20 చొప్పున వసూలు చేస్తారు. ఆ తర్వాత కిలో చేపలు వండటానికి, ఫ్రై చేయడానికి అయినా రూ.వంద చొప్పున తీసుకుంటారు. ఇక వరదలు వచ్చే సమయంలో అయితే ఈ ధరలు ఇంకాస్త పెరుగుతాయి.
అనునిత్యం రద్దీ..
జూరాల ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల కోసం ప్రజలు వస్తుండటంతో ఆ ప్రాంతమంతా నిత్యం జనంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. వీటికి తోడు నందిమళ్ల గ్రామానికి చెందిన సుమారు 300 మత్స్యకార కుటుంబాలు, వంటకాలు తయారు చేసే కుటుంబాలకు చెందినవారు అన్ని సమయాల్లోనూ ఇక్కడే ఉంటారు. జూరాలకు వరదలు వచ్చిన సమయంలో ఏడాది సంపాదన వెనకేసుకుంటారని వినికిడి.
రుచికరంగా వండిస్తున్నాం..
పర్యాటకులతో పాటు ప్రజలకు నచ్చే విధంగా, వారికి ఎలాంటి రుచి కావాలో అలాంటి రుచి వచ్చే విధంగా చేప వంటలను తయారు చేసి ఇస్తున్నాం. గత ఏడేళ్లుగా చేప వంటలను తయారుచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా.
– ఖాజామైనొద్దీన్, చేపవంటల తయారీదారుడు
ఇదే జీవనోపాధి..
ఇక్కడ చేపలు కొన్న వ్యక్తుల నుంచి వాటిని తీసుకుని శుభ్రంగా కడిగి, కొయ్యడమే ప్రధాన పని. కిలో చేపలను కొయ్యడానికి రూ. 20 తీసుకుంటున్నాం. ఇలా రోజువారీగా రూ. 300 నుంచి రూ. 500 వరకు సంపాదించుకుంటున్నా.
– అలివేల, మత్స్యకారురాలు, నందిమళ్ల
రుచి బాగుంటుంది..
మేము ప్రతి సీజన్‌లో చెరుకు కోతలకు వస్తుంటాం. గత తొమ్మిదేళ్లుగా క్రమం తప్పకుండా ఇక్కడికి పిల్లాపాపలతో వచ్చి చేప వంటలను ఆరగిస్తుంటాం. ఇంట్లో తయారు చేసుకుంటే వచ్చే రుచికన్నా ఇక్కడ అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చిన చేపకూర రుచి ఎంతో అనుభూతిని ఇస్తుంది.
– పిచ్చయ్య, ఎర్రగొండు పాలెం, ప్రకాశం జిల్లా
ఒక్కడినే కిలో చేపలు తింటా..
ఇక్కడ చేప వంటలు అతి రుచిగా ఉంటున్నాయి. దీంతో ప్రాజెక్టుకు వచ్చినప్పుడల్లా ఒక్కడినే కిలో చేపలు తీసుకుని ఫ్రై చేయించుకుని తినడం అలవాటు. వీలు దొరికినప్పుడల్లా ఇలా వచ్చి, కడుపార చేప మాంసం ఆరగించడం అలవాటయ్యింది. – మరిదాస్, ప్రకాశం జిల్లా
వీకెండ్‌లో తప్పనిసరి..
ప్రతి వీకెండ్‌లో జూరాల ప్రాజెక్టుకు స్నేహితులతో కలిసి వస్తుంటా. సరదాగా ప్రాజెక్టు పరిసరాలు చూడటం.. ఇక్కడ దొరికే చేపలను కొనుగోలు చేసి వాటిని వండించుకుని తినడం ఎంతో ఆనందం కలుగుతుంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా వీకెండ్‌లో ఎంజాయ్ కోసం ఇక్కడికివస్తుంటాం.
– రాజేందర్, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment