కల్తీ పదార్థాల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

కల్తీ పదార్థాల సీజ్‌

Published Sun, Dec 15 2024 12:53 AM | Last Updated on Sun, Dec 15 2024 4:39 PM

సంతోష్ ఫుడ్స్ లో సీజ్ చేసిన ఆహార పదార్థాలు

సంతోష్ ఫుడ్స్ లో సీజ్ చేసిన ఆహార పదార్థాలు

పాలమూరు: రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ జోనల్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌రెడ్డి, శ్రీషిక, జగన్నాథం, శివశంకర్‌రెడ్డిల బృందం శనివారం పట్టణంలోని ఏనుగొండలో ఉన్న సంతోష్‌ ఫుడ్స్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసింది. చిప్స్‌, నంకిన్స్‌, వేయించిన పల్లీలు, కారామిక్చర్‌తోపాటు ఇతర ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడంతో రూ.60,500 విలువ చేసే వాటిని సీజ్‌ చేశారు. ఫుడ్‌సేఫ్టీ ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కాలం చెల్లిన లైసెన్స్‌ నంబర్‌ పదార్థాలపై ముద్రించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 

ఆహార ఉత్పత్తులపై తయారీ, గడువు డేట్‌, బ్యాచ్‌ నంబర్‌, లేబులింగ్‌ వివరాలు ఏవీ లేవని, ప్రమాదకరమైన యూరియా బ్యాగుల్లో ఆహార పదార్థాలు నిల్వ చేయడంతో అప్పటికప్పుడు వాటిని ధ్వంసం చేయడంతోపాటు మిగిలిన వాటిని సీజ్‌ చేశారు. స్టోర్‌ రూంలో నాసిరకమైన పిండి, ముడి ఆహార పదార్థాలు భారీగా ఉండటం గుర్తించి నోటీసులు అందించారు. రూ.26 వేల రీయూజ్డ్‌ ఆయిల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో కూడిన ఆలుగడ్డలు, పల్లీలను ధ్వంసం చేశారు. ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగులు వాడుతున్నట్లు గుర్తించి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

● పిస్తా హౌజ్‌లో చేసిన తనిఖీల్లో భాగంగా పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణం చూసి నోటీసులు ఇచ్చారు. స్టోర్‌ రూంలో ఎలుకలు కొరికి ఉన్న ఆహార పదార్థాలతోపాటు రొడెంట్‌ ఇన్‌ఫెక్షన్‌తో కూడిన ఆప్రికాట్స్‌ డ్రైఫ్రూట్స్‌ గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే 160 కిలోల కల్తీ టీ పౌడర్‌, 3 కిలోల యాలకులను సీజ్‌ చేసి శాంపిల్స్‌ సేకరించారు. భారీగా నిల్వ చేసిన మాంసం గుర్తించారు. కిచెన్‌లో డ్రెయినేజీ పేరుకుపోవడంతో ఈగలు, ఇతర కీటకాలు ఆహార పదార్థాలపై వాలడంపై మరో నోటీసు అందించారు. పది రోజుల్లో తప్పులు సరిచేసుకోకపోతే పిస్తాహౌజ్‌ను శాశ్వతంగా సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. అలాగే సంతోష్‌ ఫుడ్స్‌, పిస్తాహౌజ్‌ యాజమాన్యాలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ యాక్ట్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో నోటీసులు, ఇంప్రూవ్మెంట్‌ నోటీసులు జారీచేశారు.

ఈ సందర్భంగా జోనల్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ కొందరు వ్యాపారులు ఆహార పదార్థాలను తయారు చేసి, విక్రయించే క్రమంలో అధిక మోతాదులో రంగులు వినియోగించడం, మోతాదుకు మించిన ప్రిజర్వేటివ్స్‌, ప్రమాదకరమైన అజినోమోటో లాంటి టెస్టింగ్‌ సాల్ట్‌ను కలిపి అనారోగ్యకమైన ఆహారం అందిస్తున్నారని చెప్పారు. కిచెన్లు అపరిశుభ్రంగా ఉండటంతోపాటు అనారోగ్యకరమైన పరిసరాల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. రంగులు వాడటం, గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారని, అతి తక్కువ సమయంలో అధిక లాభార్జన కోసం ఆహారాన్ని కల్తీ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కల్తీ ఆహారంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement