రైలొచ్చి ఆగిందంటే స్టేషన్ ఖాళీ అవుతుంది. అక్కొచ్చి వెళ్లిదంటే.. స్టేషన్‌లో అనాథ బాలలెవరూ కనిపించరు.రైలు.. ప్రయాణికుల్ని మోసుకెళ్లినట్లు.అక్క.. గమ్యం లేని ఆ పిల్లల్ని తనతో తీసుకెళుతుంది. వారికో గూడు కల్పిస్తుంది. బడిలో చేర్పిస్తుంది. వాళ్ల భవిష్యత్తుకు బతుకు పట్టాలు వేస్తుంది. ఆ అక్క పరిచయం ఇది.
షోరాపుల్లి రైల్వే జంక్షన్ కోల్‌కతాకు 30 కి.మీ.ల దూరాన ఉంటుంది. తొమ్మిది ట్రాక్‌లు, ఆరు ప్లాట్‌ఫామ్‌లతో ఎప్పుడూ వచ్చే పోయే రైళ్లతో, ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్, హుగ్లీ జిల్లాలో ఉంది షోరాపుల్లి. తూర్పు రైల్వే నడిపిన తొలి రైలు మార్గం ఇది. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి మూడేళ్ల ముందు 1854, ఆగస్టు 15వ తేదీన హౌరా నుంచి హుగ్లీ వరకు షోరాపుల్లి మీదుగా తొలి రైలు నడిచింది. అంతటి చరిత్రాత్మకమైన రైల్వే స్టేషన్ కాలక్రమంలో అనాథ బాలలకు నెలవుగా మారింది. వాళ్లలో నాలుగేళ్ల పిల్లల నుంచి ఉన్నారు, కానీ ఎక్కువ మంది పన్నెండు– పదమూడేళ్ల వయసు వాళ్లు. చాలా మందికి తల్లిదండ్రులు లేరు. కొంతమందికి తల్లి లేదు. మరో పెళ్లి చేసుకున్న తండ్రి శ్రద్ధ పెట్టకపోవడంతో వీధుల బాట పట్టిన బాల్యం వాళ్లది. ఆ పిల్లలను ‘తిన్నారా’ అని అడిగే వాళ్లు ఉండరు. దొరికింది తినడం, ఏదీ దొరక్కపోతే చెట్ల గుబుర్ల నుంచి చిగురుటాకులు కోసుకుని తినడం! ఎక్కడ పడితే అక్కడే నిద్రకు వాలిపోయేవారు. (మదిదోచే జలపాతాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే)
ఆకలిని, చలిని అణుచుకోవడానికి మత్తుగా నిద్రపోవడానికి డెండ్రైట్ గమ్‌కి కూడా అలవాటు పడ్డారు! పరిశ్రమలలో ఉపయోగించే డెండ్రైట్ గమ్ తాగితే మత్తు వస్తుందని, భ్రాంతిలో, అందమైన ఊహల్లో తేలిపోవచ్చని వాళ్లకు ఎలా తెలిసిందో, ఎప్పుడు తెలిసిందో! పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లలకు కొన్నేళ్లుగా ఆ అలవాటు వస్తూనే ఉంది. రైళ్లలో, రైల్వే స్టేషన్‌లో అడుక్కోవడం, వాడేసిన బాటిళ్లను ఏరి అమ్ముకోవడం... పదో పదిహేనో వస్తే బిస్కట్టో, కేక్ ముక్కో కొనుక్కుని తినడమే వాళ్లకు తెలిసింది. అదే డబ్బులకు చిన్న బ్రెడ్ ప్యాకెట్ వస్తుందని, దాంతో అయితే ఆకలి తీరుతుందనే ఆలోచన కూడా ఉండదు. అలాగే ఒక్క కేకు ముక్కతో ఆకలి తీరదని కూడా తెలుసు, అందుకే ఆకలి తీర్చుకోవడానికంటే ముందు గమ్ కొనుక్కోవడానికి కొంత డబ్బు తీసి పక్కన పెట్టుకుంటారు. హార్డ్‌వేర్ షాపుకెళ్లి గమ్ కొనుక్కుంటారు.
ఆ గమ్‌ను పిల్లలకు అమ్మడం నేరమని ఆ దుకాణాల వాళ్లకు తెలుసు. అయినా సరే అమ్మేస్తుంటారు. అది తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేవాళ్లు లేరు. డెండ్రైట్ గమ్ నుంచి వచ్చే తియ్యటి వాసనను పీల్చకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారా పిల్లలు. ఇంకా ఘోరం ఏమిటంటే... స్టేషన్ పరిసరాల్లో నిద్రిస్తున్న ఆడపిల్లల మీద దుండగులు అత్యాచారాలకు పాల్పడడం, కొంతమంది సెక్స్‌వర్కర్లు ఈ పిల్లల్ని మభ్య పెట్టి వ్యభిచారకూపంలోకి దించడమూ. రాత్రయితే ఆ స్టేషన్ పరిసరాలు రెడ్‌లైట్ ఏరియాగా మారిపోతుండేవి. నాలుగేళ్ల కిందట మైత్రేయి బెనర్జీ దృష్టి ఆ పిల్లల మీద పడే వరకు అలాగే ఉండింది.
ఆకలి మత్తు
మైత్రేయి బెనర్జీ పుట్టిల్లు పశ్చిమ బెంగాల్‌లో దక్షిణేశ్వర్. అర్నాబ్ బెనర్జీని పెళ్లి చేసుకుని కోల్‌కతాలో అడుగుపెట్టింది. సోషల్ వర్క్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన మైత్రేయి పెళ్లయి ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగం వదిలేసి గృహిణిగా మారిపోయింది. ఓ రోజు మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు అల్లరిచిల్లరిగా వ్యవహరించడం ఆమె దృష్టిలో పడింది. వాళ్లను మాటల్లో పెట్టి, వాళ్ల బస రైల్వే స్టేషన్ అని తెలుసుకుంది. మరో రోజు అదేపనిగా రైల్వే స్టేషన్‌కెళ్లి గమనించిందామె. పిల్లలు డెండ్రైట్ గమ్ మత్తు మందు పీల్చడం గమనించి ఎందుకిలా చేస్తున్నారని అడిగింది. ఆమె ఏ మాత్రం ఊహించని సమాధానం... ‘‘అక్కా! మాకు తినడానికి తిండి లేదు. దీన్ని పీలిస్తే మత్తుగా నిద్ర వస్తుంది. ఆకలి తెలియదు’’ అన్నారా పిల్లలు. అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘ఆ సమాధానం విని గుండె పగిలిపోయింది’’ అని చెప్పేటప్పుడు మైత్రేయి కళ్ల నుంచి కన్నీరు ధారగా చెంపల మీదకు జారాయి.
బాల్యం పట్టాలెక్కింది
రైల్వేస్టేషన్‌లో రోజులు గడుపుతున్న పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు మైత్రేయి. వాళ్ల సమస్యకు పరిష్కారం అంత సులభం కాదని తెలుసు. అయినా ఒక్కటొక్కటిగా తన ప్రయత్నాలను మొదలుపెట్టారామె. దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌లకు వెళ్లి మధ్యాహ్నం మిగిలిన భోజనాన్ని ఈ పిల్లలకు పెట్టడానికి రెస్టారెంట్ యజమానులను ఒప్పించారు మైత్రేయి. ఒక పూట భోజనానికి భరోసా వచ్చింది. వాళ్లకు నీడ వెతకాలి. ఈ లోపు బంధువులు, స్నేహితులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి తాను చేపట్టిన పని గురించి వివరించారు. అందరి ఇళ్లకు వెళ్లి పిల్లల దుస్తులు, దుప్పట్లు, స్కూలు బ్యాగ్‌లు, బూట్లు సేకరించారామె. ఆ దుస్తులను తాను బాధ్యత తీసుకున్న పిల్లలకు వేసి ఫొటోలు తీసి వాట్సప్ గ్రూప్‌లో పెట్టేవారామె. దాంతో మొదట్లో ఒకింత సహాయం చేసిన వాళ్లందరూ మైత్రేయి చేపట్టిన పనిలో సంతోషంగా భాగస్వాములయ్యారు.
ఆ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేటప్పుడు పుస్తకాలు, యూనిఫామ్ కొనివ్వడం వంటి సహాయాన్ని స్వచ్ఛందంగా అందించారు. ఒక్కొక్కటీ దారిన పడుతోంది. కానీ చీకటి నేరాల నుంచి భద్రత కల్పించే భరోసానిచ్చే నీడ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం నడిపిస్తున్న హోమ్‌లను, ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ గ్రామాలను సంప్రదించి మిగిలిన పిల్లలను చేర్పించారు. మొత్తం నూట పదిమంది పిల్లలకు భద్రత కల్పించారు మైత్రేయి. ‘‘ఎవరి జీవితమూ ఒకరికంటే తక్కువ కాదు, మరొకరి కంటే ఎక్కువా కాదు. ఎవరి జీవితం వాళ్లకు గొప్పది. వీధిపాలైందని జీవితాన్ని వదిలేయకూడదు. పట్టాలు తప్పిన బతుకును గాడిన పెట్టాలి. గొప్ప జీవితంగా మలుచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను చేస్తున్న ఈ పనికి ‘మహా జిబన్’ అని పేరు పెట్టాను. అంటే మహా జీవితం అని అర్థం’’ అన్నారు మైత్రేయి. – మంజీర
అసలైన సవాల్
పిల్లలకు భరోసా కలిగిన ఒక నీడ వెతకడం, అందులో చేర్చడం ఒక ఎత్తయితే.. వారిని అందులో కొనసాగించడం ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది. ఇద్దరు పిల్లలు ఎస్‌ఓఎస్ గ్రామం నుంచి పారిపోయి తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కేవలం డెండ్రైట్ కోసమే వాళ్లు ఆ పని చేశారు. వాళ్లను తిరిగి తీసుకెళ్లి ఎస్‌ఓఎస్‌లో చేర్చడంతోపాటు వాళ్లకు జీవితం పట్ల ఆశ కలిగేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వడం పెద్ద పనిగా మారింది. క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌లు, థెరపీలు, మందులిప్పించడం ద్వారా ఆ పిల్లలను మార్చగలిగారామె. ‘‘ముందున్నది మహా జీవితం అని వాళ్లకు నచ్చచెప్పి జీవితం మీద ఆశలు కల్పించగలిగాను. జీవితేచ్ఛ కలిగితే.. ఆ జీవితేచ్ఛే మనిషిని నడిపిస్తుంది. తొలిసారి వాళ్లను కలిసినప్పుడు స్నానం లేకుండా, మాసిన దుస్తులతో, చింపిరి జుట్టుతో ఎవరు ఎవరో గుర్తు పట్టలేనట్లు ఉన్నారా పిల్లలు. ఇప్పుడు మంచి దుస్తులు ధరించి, స్కూలుకు పోతున్నారు. పలకరిస్తే స్వచ్ఛంగా నవ్వుతున్నారు. బాల్యాన్ని సంతోషంగా గడుపుతున్నారు. వాళ్ల బాల్యాన్ని వాళ్లకు తిరిగి తెచ్చివ్వగలిగినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు మైత్రేయి.
Comments
Please login to add a commentAdd a comment