90 సార్లు రక్తదానం | Devanna Donated blood 90 times | Sakshi
Sakshi News home page

90 సార్లు రక్తదానం

Published Sat, Sep 10 2016 3:49 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

90 సార్లు రక్తదానం - Sakshi

90 సార్లు రక్తదానం

* గవర్నర్ నుంచి అవార్డు
* 250కి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన దేవణ్ణ

బళ్లారి (తోరణగల్లు) : సమాజం నాకేమిచ్చిందని ఆలోచించేవారు కొందరైతే సమాజానికి మనమేమిచ్చామని ఆలోచించేవారు మరికొందరు. తన పరిధిలో ఎంతో కొంత సమాజసేవ చేయాలనుకొనే తపనగలవాడు బీ.దేవణ్ణ. వృత్తి రీత్యా బ్యాంకులో హెడ్‌క్యాషియర్ అయినా ప్రవృత్తిగా సమాజసేవలో రక్తదాన మార్గాన్ని ఎంచుకొన్నాడు. దీంతో పేరు ముందున్న ఇంటి పేరు బీ(బసన్న) కాస్తా బ్లడ్ దేవణ్ణగా మారింది. ఇప్పుడు నగర వాసులు బళ్లారి బ్లడ్ దేవణ్ణగా పిలుస్తారు.
 
విద్యార్థి దశ నుంచే రక్తదానం  
బళ్లారిలోని ఎం.బసన్న, సావిత్రమ్మ దంపతులకు 1963లో జన్మించిన దేవణ్ణ 1981లో ఐటీఐ చదువుతున్నప్పుడు సుధాక్రాస్ వద్ద ప్రమాదం జరిగిన ఓ విద్యార్థిని ప్రాణాలను కాపాడటానికి మొదటిసారిగా రక్తదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరచూ ఆపదలో ఉన్న బాధితులకు రక్తదానం చేయడం ఆనవాయితీగా మార్చుకొన్నాడు.
 
కాన్పుకు వచ్చే మహిళలు, ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ఆదుకోవడం కోసం తానొక్కడే కాకుండా శిబిరాలను ఏర్పాటు చేసి అనేకమందితో రక్తదానం చేయిస్తున్నారు. ఇప్పటి వరకు 90 సార్లు రక్తదానం చేశాడు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 250కి పైగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 12000 యూనిట్ల రక్తాన్ని సేకరించి విమ్స్ బ్లడ్‌బ్యాంకుకు అందజేశారు. ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను నిర్వహించాడు.
 
అవార్డులు, రివార్డులు
బ్లడ్ దేవణ్ణ రక్తదాన సేవా కార్యక్రమాలను గుర్తించి 2007లో డాక్టర్ రాజ్‌కుమార్ ప్రశస్తిని కన్నడ సినీ నిర్మాత దొరే భగవాన్ చేతుల మీదుగా అందుకొన్నారు. 2012లో జనతా సేవాదళ్ సంస్థ ప్రశస్తి ఇచ్చి సన్మానించింది. గతంలో జిల్లాధికారిగా పని చేసిన బిస్వాస్ 2014లో జిల్లా స్థాయి ఉత్తమ రక్తదాతగా ప్రశస్తిని అందజేశారు. అదే సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బెంగుళూరులో ప్రశస్తిని అందుకొన్నాడు. 2015 మే 8న రెడ్‌క్రాస్ డే సందర్భంగా రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బెంగుళూరు రాజ్‌భవన్‌లో అప్పటి గవర్నర్ వాజుబాయ్ రుడాబాయ్ వాలా చేతుల మీదుగా ప్రశస్తితో పాటు జ్ఞాపికను అందుకొన్నారు. ఇదే సంవత్సరం ఎస్‌బీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చీఫ్ మేనేజర్ ప్రభాకర్ జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
 
యువత రక్తదానం చేయాలి
యువత వ్యసనాలకు బానిస కాకుండా అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యవంతులే నిజమైన కోటీశ్వరులు. రక్తదానం వల్ల ఆరోగ్యం, నూతనోత్సాహం, ఉత్తేజం కలుగుతుంది. యువత రక్తదానాన్ని సమాజ సేవగా భావించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఒక దాత ఇచ్చే రక్తం నలుగురి ప్రాణాలను కాపాడుతుందని, అందువల్ల రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని యువతను  బ్లడ్ దేవణ్ణ కోరుతున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement