కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో వ్యాధుల భయం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మార్బర్గ్, ఎంపాక్స్ వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 17 దేశాలను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. మార్బర్గ్ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో ఈ వైరస్ కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. కొన్నివందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారినపడి, ప్రాణాలతో పోరాడుతున్నారు.
తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బ్లీడింగ్ వైరస్ అనేది 50శాతం మరణాల రేటుతో తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో ఉంది. ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తూ, ప్రపంచదేశాలను వణికిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని ‘బ్లీడింగ్ ఐ’ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఇతర వైరస్‌ల వ్యాప్తితో పోరాడుతున్న ఆఫ్రికా దేశాలను ఈ కొత్త వైరస్ ఇప్పుడు చుట్టుముట్టింది.
లక్షణాలివే..
బ్లీడింగ్ ఐ వైరస్ సోకినప్పుడు తొలి లక్షణాలు రెండు నుండి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తాయి. తరువాత అతిసారం, వికారం, వాంతులు, దురద, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీటి తరువాత ముక్కు, పంటిచిగుళ్ళు, కళ్ళు, నోరు, చెవుల నుండి రక్తస్రావం అవుతుంది. అలాగే వాంతులు, మలంలో రక్తం, అంతర్గత రక్తస్రావం, వృషణాల వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. తరువాత బ్లీడింగ్ ఐ వైరస్ బాధితునికి ప్రాణాంతకంగా మారుతుంది.
కరోనా కంటే ప్రమాదకరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులలో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలలో గబ్బిలాలు నివసిస్తాయి. ఇవి ఈ వైరస్‌కు ప్రధాన కారకంగా గుర్తించారు. కరోనా కంటే మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని పలు నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల ద్వారా లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ వైరస్‌కు ఎటువంటి మందులు లేవు. నివారణ చర్యలే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు
Comments
Please login to add a commentAdd a comment