స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది.
ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా...
లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము...
విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్...
కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్...
గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది.
ఏనుగుల రాణి
భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్‌లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి.
కళ్లు తెరవగానే ఏనుగు
‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్‌స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్‌లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు.
కష్టకాలంలో ఏనుగే తోడు
1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్‌సైక్లోపిడియాగా మారింది.
క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్
బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది.
‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్‌లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది.
నారియల్ అమ్మ
దక్షిణ అండమాన్‌లోని రంగచాంగ్‌కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్‌లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్‌లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్.
అవమానాలను అధిగమించి
గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్‌లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్‌లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు.
ఆది రాణి
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్‌ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్‌లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్.
మొక్కవోని ఆత్మస్థైర్యం
‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్‌కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది....
తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను.
అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి.
‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్‌లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్‌లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్‌షెడ్‌లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది.
తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి.
ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment