పాలకొల్లు టౌన్: జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకోవాలని, ఎంతో కొంత సమాజ సేవ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి దృఢ సంకల్పం తోడైతేనే ఆచరణలో సాధ్యమవుతుంది. ఇదే చేసి చూపించారు పాలకొల్లు పట్టణానికి చెందిన యువ న్యాయవాది కర్రా జయసరిత. మానవ సేవే.. మాధవ సేవ అనే నినాదం ఆమెను ముందుకు నడిపిస్తోంది. ఆమె తన సంపాదనలో కొంత సొమ్మును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో నిరుపేదలకు వనితా వాకర్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణానికి చెందిన కర్రా సూర్యనారాయణ మూర్తి, పద్మావతిల నాలుగో సంతానం జయసరిత. సూర్యనారాయణ మూర్తి వామపక్ష భావాలు కలిగిన కమ్యూనిస్టు నాయకుడిగా, కళాకారుడిగా పట్టణ ప్రజలకు సుపరిచితం. జయసరిత పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా డిగ్రీ కళాశాలలో బీకామ్ డిగ్రీ పూర్తి చేసి అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. అనంతరం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో దగ్గరుండి చూసుకోవాలనే ఆలోచనతో ఐదేళ్ల క్రితం పాలకొల్లు వచ్చి స్థిరపడ్డారు. అప్పట్నుంచి వనితా వాకర్స్ క్లబ్‌లో చేరి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2016లో కర్రా జయసరిత పాలకొల్లు వనితా వాకర్స్‌క్లబ్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అనంతరం 2017లో జిల్లా డెప్యూటీ గవర్నర్‌గా, ప్రస్తుతం జిల్లా గవర్నర్‌గా ఏకగ్రీవంగా రెండు రోజుల క్రితం ఎన్నికయ్యారు.
సేవా కార్యక్రమాలకు రూ.20 లక్షలు
జయసరిత తను సంపాదించిన సొమ్ములో కొంత భాగం రూ.20 లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్టు చేసి దానిపై వచ్చే వడ్డీతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలో నిరాధరణకు గురైన పేద మహిళలను గుర్తించి 50 మందికి ప్రతి నెలా రూ.200 పింఛన్‌ను అందజేస్తున్నారు. వనితా వాకర్స్ క్లబ్‌లో ప్రస్తుతం 40 మంది సభ్యులతో కలిసి ఏటా నియోజకవర్గ స్థాయిలో పేదలకు నిత్యావసర వస్తువులు, మురికివాడల్లోని పేదలకు దోమ తెరలు, రగ్గులు అందజేస్తున్నారు. అదే విధంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పేద మహిళలకు లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి ఆపరేషన్లు చేయించి ఉచితంగా కళ్ల జోళ్లు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా గట్టువలస గ్రామం గరోట అటవీ ప్రాంతంలో పర్యటించి గిరిజన మహిళలకు అవసరమైన మెడికల్ కిట్స్, పౌష్టికాహారం అందజేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నడక వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి రోజు అరగంట నడవడం వలన గుండె, ఊపిరితిత్తులు మెరుగుపడి సుగర్, బీపీ వ్యాధులకు దూరంగా ఉంటారని ప్రజలకు వివరిస్తున్నారు. వనితా వాకర్స్‌క్లబ్ ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం తీసుకోవడం, జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, ఐరన్, కాల్షియం ఆహార పదార్థాలు భుజించడంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు మహిళల కోసం యోగా శిబిరాలను నిర్వహిస్తున్నారు.
సేవా భావమే నడిపిస్తోంది
వయోభారంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి హైకోర్టులో న్యాయవాద వృత్తిని మధ్యలో ఆపేసి పాలకొల్లు వచ్చాను. నాటి నుంచి వనితా వాకర్స్‌క్లబ్‌లో చేరి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నడక వలన ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే వృథా. నా సంపాదన నుంచి కొంత నిరుపేదల సేవా కార్యక్రమాలకు కేటాయించి సంతృప్తి పొందుతున్నా.
– కర్రా జయసరిత, వాకర్స్‌క్లబ్ జిల్లా గవర్నర్
Comments
Please login to add a commentAdd a comment