హార్ట్ వర్కర్
సంస్థ పేరు ‘హార్డ్’.. పేరుకు తగ్గట్టే దీని సారథి హార్డ్ వర్కర్. కానీ, ఆయన చేసే సేవా కార్యక్రమాలు హార్ట్ టచ్ చేస్తాయి. ఆదిరాజు కృష్ణమోహన్.. చిన్న వయసులోనే 22 దేశాలను చుట్టొచ్చారు. పబ్లిక్‌కు దగ్గరగా, పబ్లిసిటీకి దూరంగా ఉండే ఆయన.. ఆదరణకు నోచుకోని వృద్ధుల పాలిట పెద్దబిడ్డ. సోషల్ వర్క్ విషయంలో ఆయన పలు దేశాల యువతకు రోల్‌మోడల్. ఆయన బోధించే సామాజిక సేవా పాఠాలు గుండెలకు హత్తుకుంటాయి.
కృష్ణమోహన్ నాన్న ఆదిరాజు జగన్నాథరావు హ్యూమన్ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ (హార్డ్) ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. చిన్నప్పటి నుంచి అవి చూసి సోషల్‌వర్క్‌పై కృష్ణమోహన్‌కి ఇంట్రెస్ట్ ఏర్పడింది. చదువుకునే రోజుల్లోనే తనకు తోచిన విధంగా సాయం చేసేవారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషల్‌వర్క్‌లో యూజీ, పీజీ చేశారు.
ఇలా మొదలైంది
కోటి మొక్కలు నాటినందుకు నోబెల్ బహుమతి అందుకున్న వంగరిమాథై కెన్యాలో స్థాపించిన ‘గ్లోబల్ యంగ్ గ్రీన్’(2007) సంస్థకు భారత్ నుంచి కృష్ణమోహన్ ఫౌండర్ మెంబర్. 2007లో ఆక్స్‌ఫామ్ ఆస్ట్రేలియా ఫెలోషిప్‌కు భారత్ నుంచి కృష్ణమోహన్‌కు అవకాశం వచ్చింది. వివిధ దేశాల్లోని సోషల్ వర్కర్ల పనితీరు, కమ్యూనిటీ ప్రాంతాల్లో ఎలాంటి సర్వీసు చేయవచ్చు.. ఇలా పలు అంశాల్లో మూడేళ్లు శిక్షణ పొందారు. ఈ ట్రైనింగ్ తర్వాత ఆక్స్‌ఫామ్ ఆస్ట్రేలియా ఫెలోషిప్‌కు ఎంపిక చేసిన 20 మందిలో కృష్ణమోహన్ ఒకరు.
దేశదేశాల్లో.. సేవా భావనలు..
సామాజిక దృక్పథం నిండిన కృష్ణమోహన్ తర్వాత కాలంలో పలు దేశాల్లో ‘జెండర్ జస్టిస్’పై క్లాసులు తీసుకున్నారు. కమ్యూనిటీ లీడర్‌షిప్ గురించి సౌత్ అమెరికాలో జాగృతి కల్పించారు. యువత ఎన్జీవోలతో కలసి ఎలా పని చేయవచ్చనే అంశంపై డెన్మార్క్, దక్షిణకొరియా, స్వీడన్ దేశాల్లో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. 2011లో జర్మనీలో జరిగిన పర్యావరణ సదస్సుకు హాజరయ్యారు. అదే ఏడాది తైవాన్ వందేళ్ల ఉత్సవం సందర్భంగా సోషల్ వర్క్‌పై ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ముగ్గురిలో కృష్ణమోహన్ ఒకరు. తైవాన్‌వాసుల సంస్కృతిపై అధ్యయనం చేసి అక్కడి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించారు. 2012లో మహిళలు-సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్ నిర్వహణపై సెనెగల్ దేశంలోట్రైనింగ్ ఇచ్చారు.
ఓల్డ్ ఏజ్ హోంల సందర్శన..
ఇంగ్లండ్‌లో ఉన్న మామూలు సీనియర్ సిటిజన్ల కోసం లాంగ్ స్టే హోం, అనారోగ్యంగా ఉన్న వారి కోసం ట్రీట్‌మెంట్ హోం, అమెరికాలోని అసిస్టెంట్ లివింగ్ హోంలను కృష్ణమోహన్ సందర్శించి వృద్ధాశ్రమాల పనితీరు తెలుసుకున్నారు. అదే అనుభవంతో ఇప్పుడు కొంపల్లి సమీపంలోని దేవర యాంజాల దగ్గర
కృష్ణసదన్ ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభించారు.
వృద్ధులకు బాసట.. ‘కృష్ణసదన్’
వృద్ధులపై శారీరక, మానసిక దాడిలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. వృద్ధాప్యంలో ఉన్న వీరికి ప్రశాంత వాతావరణం కల్పించడానికే కృష్ణసదన్ ఓల్డ్ ఏజ్ హోం ఏర్పాటు చేశాను. పేదరికంలో మగ్గుతున్న ముసలివారు, అన్నీ ఉండి ఆలనాపాలన కరువైన వృద్ధులకుఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నాను. ప్రస్తుతం పూర్తి సమయం దీనికే కేటాయిస్తున్నాను. ఆదరణ లేని వృద్ధులు కనిపిస్తే 8333005264, 8096000008 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు.
- ఆదిరాజు కృష్ణమోహన్, సోషల్ వర్కర్
- వాంకె శ్రీనివాస్