నాలుగైదేళ్లొచ్చినా ఇంకా ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లలే మనకు తెలుసు. అలాంటిది రెండేళ్లకే గలగల మాట్లాడుతూ అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడా బుడతడు. అంతేనా? తొమ్మిదో ఏటనే ‘‘నాది స్కూలు సిలబస్ చదివి, హోం వర్క్ చేసే వయసు కాదు’’ అని చెప్పి ఏకంగా కాలేజీ పుస్తకాలు చేతబట్టాడు. నాలుగేళ్లలో చకచకా డిగ్రీ పూర్తి చేసేశాడు. ప్రస్తుతం పద్నాలుగేళ్ల వయసులో ఎలాన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు కైరాన్ క్వాజీ.
నేటి టెక్నాలజీ టీనేజర్స్ కొందరు అది ఇది అనిచెబుతూ ఎంజాయ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తుంటే.. కైరాన్‌లాంటి కుర్రాళ్లు మాత్రం వయసుకు మించిన ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అత్యంత వేగం, కచ్చితత్వంతో కూడిన ప్రతిభా పాటవాలతో ప్రఖ్యాత స్పేస్ ఎక్స్ కంపెనీ రిక్రూట్‌మెంట్ టెస్ట్ పాసైన కైరాన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎంపికవడమేగాక, కంపెనీలోనే తొలి అతిపిన్న ఇంజినీర్‌గా నిలిచాడు.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన జూలియా, ముస్తాహిద్ క్వాజీ దంపతులకు 2009 జనవరి 27 కైరాన్ పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉండే కైరాన్‌ను గమనించిన తల్లిదండ్రులు.. చక్కగా ప్రోత్సహించేవారు. తెలివిగా చదువుతూ ..ఏడో ఏట యంగ్‌వాంక్స్ కోడింగ్ అకాడమిలో చేరి పైథాన్ ప్రోగ్రామింగ్‌ను నేర్చుకున్నాడు. దీంతోపాటు మెషిన్ లెర్నింగ్‌ను కూడా వంటబట్టించుకున్నాడు.
తొమ్మిదేళ్లకే కాలేజీ..
నాది స్కూల్ హోం వర్క్ చేసే వయసు కాదని తన ప్రతిభతో తొమ్మిదో ఏటనే లాస్‌పొసిటాస్ కాలేజీలో చేరి ఈ కాలేజీ చరిత్రలో తొలి పిన్న వయసు విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు. ఆ తరువాత పదకొండేళ్లకే మ్యాథమేటిక్స్‌లో డిగ్రీ చదువుతూనే శాంత క్లారా యూనివర్శిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ çకూడా చదివాడు. ఇదే యూనివర్శిటీలో ఈ ఏడాది మాస్టర్స్‌ని పూర్తిచేశాడు. ఇటీవల సాంకేతిక ఫన్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌ను అవలీలగా అధిగమించి స్పేస్‌ఎక్స్‌లోని స్టార్‌లింక్ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. దేన్నైనా ఇట్టే పట్టేసే గుణగణాలే కైరాన్‌ని స్పేస్ ఎక్స్ ఉద్యోగిగా మార్చాయి. అందుకే చిన్న వయసులో డిగ్రీలేగాదు, ఉద్యోగాన్ని కూడా కొట్టేశాడు.
ప్రతిభ, పట్టుదల, కృషి ఎక్కువ
‘‘కైరాన్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. అ చురుకుదదాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవాళ్లం. దాంతో వాడు తన ప్రతిభాపాటవాలకు మరింత పదును పెట్టుకుని టీనేజ్‌లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా మారాడు. లాస్‌పొసిటాస్ కాలేజీలో చదివేటప్పుడు అకడమిక్ సిలబస్‌ను నేర్చుకోవడమేగాక, స్టాఫ్ అసిస్టెంట్‌గా, స్టెమ్ ట్యూటర్‌గాను పనిచేసేవాడు. ఇతర ట్యూటర్‌లకు సాయం చేస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు.
వేసవి సెలవుల్లో సైబర్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌షిప్ చేశాడు. దీనితోపాటు బ్లాక్‌బర్డ్ ఏఐలో కూడా ఏఐ ఇంటర్న్‌గా చేశాడు. శాంతక్లారా యూనివర్సిటి, ఇంటెల్ మెంటర్స్ కూడా కైరాన్‌కు మంచి గైడెన్స్‌ను అందించారు. చేతిరాత, స్పెల్లింగ్, నోట్ టేకింగ్, ఇతర భాషలు నేర్చుకోవడం కాస్త కష్టమైనా.. పట్టుదల, కృషితో నేర్చుకున్నాడు. ప్రస్తుతం బెంగాలీ, మాండరిన్ నేర్చుకుంటున్నాడు. ఎప్పుడు కొత్తదాన్ని నేర్చుకోవడానికి కైరాన్ ఆసక్తి కనబరుస్తాడు. ఆ ఆసక్తే వాడి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుతోంది’’ అని కైరా తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.
ఇక ‘‘ నా నెక్ట్స్ స్టాప్ ‘స్పేస్‌ఎక్స్’. ఈ గ్రహంలోనే అత్యంత చక్కని కంపెనీలో స్టార్‌లింక్ ఇంజినీరింగ్ టీమ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరబోతున్నాను. వయసును బట్టి ఉద్యోగాలలో నియమించే కంపెనీలకు భిన్నంగా, నా ప్రతిభ, పరిపక్వతలను దృష్టిలో పెట్టుకుని స్పేస్‌ఎక్స్ నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది’’ అని తన లింక్డ్ ఇన్ అకౌంట్ ద్వారా కైరాన్ తన కలల జాబ్ గురించి సంతోషంతో చెప్పుకున్నాడు.
(చదవండి: రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే)
Comments
Please login to add a commentAdd a comment