భర్త గుర్తింపుమీద ఆధారపడొద్దు.. నీ గుర్తింపు నువ్వు తెచ్చుకో..! | uttar pradesh social worker laxmi gautam service deets inside | Sakshi
Sakshi News home page

భర్త గుర్తింపుమీద ఆధారపడొద్దు.. నీ గుర్తింపు నువ్వు తెచ్చుకో..!

Published Sat, Feb 3 2024 10:21 AM | Last Updated on Sat, Feb 3 2024 11:29 AM

uttar pradesh social worker laxmi gautam service deets inside - Sakshi

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర పట్టణమైన బృందావన్‌లోని యమునా నదిలో పవిత్ర స్నానాలు చేయడానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. అలా వచ్చే వారిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా లక్ష్మికి ఫోన్‌ చేస్తారు. ‘నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలబడుతుంది డా.లక్ష్మి.

వితంతువులు, అనాథలు, నిరుపేదలకు ఆమె బృందావన దేవదూత.బృందావన్‌ ‘సిటి ఆఫ్‌ విడోస్‌’ అని పేరు తెచ్చుకుంది. దీనికి కారణం లక్ష్మి మాటల్లో చెప్పాలంటే... పశ్చిమ బెంగాల్‌తోపాటు మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో బాలవితంతువులు ఉన్నారు. కొద్దిమంది విషయంలో భర్త చనిపోయినా, వదిలి వెళ్లినా వారిని పట్టించు కునేవారు ఉండరు. ఈ నేపథ్యంలో వితంతువులకు సురక్షితమైన ఆశ్రమాలు ఉన్న పట్టణంగా బృందావన్‌ మారింది’

అయితే అందరి పరిస్థితి ఒకేలా లేదు.
కొంతమంది వితంతువులు ఇక్కడ కష్టాలు పడేవారు. కొన్ని సంవత్సరాల క్రితం దర్శనం కోసం బృందావన్‌కు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు వితంతువుల దుస్థితిని చూసి ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని వేశారు. అలా నియమించిన కమిటీలో లక్ష్మి కూడా ఉన్నారు. ఈ కమిటీలో భాగం కావడం ద్వారా వితంతువుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను లోతుగా తెలుసుకునే అవకాశం దొరికింది. వితంతువుల అంతిమ సంస్కారాలను ఎవరూ పట్టించుకోక΄ోవడం ఆమెను ఆవేదనకు గురిచేసింది.

బృందావనంలో ఏ ఒక్క వితంతువు కూడా దయనీయస్థితిలో చనిపోకూడదు. వారి కర్మకాండలు గౌరవప్రదంగా చేయాలనే ఉద్దేశంతో ‘కనకధార’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ‘కనకధార’ అనేది ఆమె అత్తయ్య పేరు. మృదుభాషి అయిన తనను అత్తయ్య నలుగురి ముందు గట్టిగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది.

‘భర్త గుర్తింపు మీద ఆధారపడవద్దు. నీదైన గుర్తింపు తెచ్చుకో’ అని చెప్పేది ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అత్తయ్య.

అత్తయ్య ప్రోత్సాహంతో లక్ష్మి పీహెచ్‌డీ చేసి అధ్యాపక వృత్తిలోకి వచ్చింది. వృత్తిని, స్వచ్ఛందసంస్థ కార్యకలాపాలతో బ్యాలెన్స్‌ చేసుకోవడం అంత సులభం కాదు. అయితే సంకల్పబలం ఉన్న వాళ్లకు అదేమీ కష్టం కాదు. లక్ష్మీగౌతమ్‌ ఈ కోవకు చెందిన మహిళ.

‘కనక ధార’ స్వచ్ఛంద కార్యక్రమాలలో అత్తయ్యతో΄ాటు భర్త విజయ్‌ గౌతమ్‌ కూడా భాగం అయ్యారు. ఇప్పటివరకు లక్ష్మి వెయ్యి మందికి పైగా వితంతువుల అంతిమ సంస్కారాలు నిర్వహించింది. అంబులెన్స్‌ అవసరాల నుంచి ఫైనల్‌ డ్రెస్సింగ్‌ వరకు అన్నీ ఆమె చూసుకునేది.

కరోనా మహమ్మారి కాటేస్తున్న సమయంలో మధురలో 72 రోజుల పాటు వందలాది మంది అనాథలకు వండి వడ్డించేది. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతులకు మార్గదర్శనం చేయడంలో, అపహరణకు గురైన యువతులను రక్షించి అండగా నిలవడంలో ‘కనక ధార’ స్వచ్ఛంద సంస్థ సహాయపడుతోంది.


 
వృత్తి జీవితాన్ని, సామాజిక సేవను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేదాన్ని. సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలకు తప్ప వ్యక్తిగత పనుల కోసం సెలవుపెట్టే దాన్ని కాదు. ఒక వితంతువు చనిపోయిందని, మృతదేహాన్ని క్లెయిమ్‌ చేయకుండా అనాథలా పడి ఉందని ఒకరోజు ఫోన్‌ వచ్చింది. ఆ సమయంలో కాలేజీలో ఉన్నాను. వెంటనే ప్రిన్సిపల్‌ను అనుమతి అడిగి బయటికొచ్చాను. బైకర్‌ నుంచి లిఫ్ట్‌ తీసుకొని ఘటన స్థలానికి చేరకున్నాను. అక్కడ ఎన్నో గంటల పాటు ఉండాల్సి వచ్చింది. అంబులెన్స్‌ ఏర్పాటు చేసి అంత్యక్రియలు చేశాను. ఇలాంటి సంఘటనలెన్నోఉన్నాయి – డా.లక్ష్మీ గౌతమ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement