ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్ బటర్‌ఫ్లై మామ్ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు.
ప్రియాంక సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్‌లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది.
బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి.
అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్ ఇండియన్ జాస్మిన్... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్ బటర్‌ఫ్లై, కామన్ జాయ్, లైమ్ స్వాలోటెయిల్ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి.
ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్‌ను బటర్ ఫ్లై మామ్ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్‌లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి.
Comments
Please login to add a commentAdd a comment