‘చేతబడి చేస్తుందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు’ అనే వార్తను చూసే ఉంటారు. మూఢనమ్మకాల వల్ల స్త్రీలే కాదు, బాధింపబడినవారిలో పురుషులు కూడా ఉన్నారు. అవిద్య, అజ్ఞానం కారణంగా జరిగే ఇటువంటి అకృత్యాలకు చెక్ పెట్టేందుకు నడుం కట్టింది ఓ మహిళ. తనమీద పడిన నిందను దూరం చేసుకోవడానికే కాదు, సాటి అమాయక మహిళలను ఇలాంటి నిందల నుంచి దూరం చేయాలనుకుంది. ఆమె పేరే చుట్నీదేవి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. మంత్రగత్తె అనే నెపంతో స్త్రీలను హింసించి, అనైతికంగా ప్రవర్తించేవారిపైన 25 ఏళ్లుగా పోరాటం చేసి, 125 మంది మహిళలను కాపాడింది. అందుకు గాను ఈ ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. దేశమంతటా ఉన్న ఈ అరాచకాన్ని జార్ఖండ్‌లో పుట్టి పెరిగిన చుట్నీదేవి కథనం ద్వారా తెలుసుకోవచ్చు.
పోరాటమే ఆమె ‘మంత్రం’
తనకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదని గట్టిగా నిర్ణయించుకున్న 63 ఏళ్ల చుట్నీదేవి, అందుకు తన జీవితమే ఓ పాఠమైందని తెలియజేస్తుంది.. ‘‘మంత్రవిద్య ప్రయోగిస్తున్నారనే మూఢ నమ్మకంతో అమాయకులైన వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో విజయం సాధించడం అంత సులభం కాదు. మాది జార్ఖండ్‌లోని భోలాదిహ్ గ్రామం. పన్నెండేళ్ల వయసులోనే పెళ్లయ్యి, అత్తింటికి వచ్చాను. చదవడం, రాయడం రాదు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించేదాన్ని. భర్త, నలుగురు పిల్లలు. ఎప్పుడూ కుటుంబం పనుల్లో మునిగేదాన్ని. ఓసారి పక్కింటి అమ్మాయి నేను చేసిన చేతబడి వల్లే జబ్బున పడిందని గ్రామ ప్రజలు ఆరోపించారు.
తర్వాత్తర్వాత అదే నిజమని ఊళ్లోవాళ్లు నమ్మడం మొదలుపెట్టారు. దాంతో నేను కంటబడితే చాలు పరిగెత్తించి పరిగెత్తించి తరిమేవారు. దాదాపు పదేళ్లపాటు నరకం అనుభవించాను. నిత్యం అవమానాలు, నిందలు. చివరిసారి జరిగిన దాష్టీకానికైతే ఎలాగోలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. అది నా జీవితంలోనే అత్యంత చీకటి రోజు. చెట్టుకు కట్టేసి రెండు రోజుల పాటు దారుణంగా కొట్టారు. గొడ్డలితో దాడి చేశారు. నా ముఖంపై ఇప్పటికీ ఆ కోతల గుర్తులు ఉన్నాయి. నన్ను చంపాలని రకరకాలుగా కుట్రలు చేశారు. నువ్వు ఊరు విడిచి పారిపోవాలి, లేకపోతే చంపేస్తామని గ్రామస్తులు, గ్రామ పెద్ద దారుణంగా బెదిరించారు.
నెల రోజులు అడవిలోనే...
ఆ సమయంలో నా భర్త ధనుంజయ్ మహతో కూడా నాకు మద్దతుగా నిలవలేదు. ఊరి వాళ్లు చెప్పినట్టే నా భర్త చేశాడు. ప్రజలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగోలా నా నలుగురు పిల్లలతో ఊరి నుంచి పారిపోయాను. అడవిలో గుడిసె వేసుకొని నెలపాటు అక్కడే నివసించాను. ఆ తర్వాత ఎలాగోలా మా తమ్ముడు ఇంటికి చేరుకుని, కొంతకాలం అక్కడే ఉన్నాను.
ప్రచారంలో ఒకరిగా!
అమిత్ ఖరే 1995లో పశ్చిమ సింగ్ భూమ్‌కు డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. మంత్రగత్తె అనే నెపంతో వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. అప్పుడు మా ఊళ్లో నా విషయం బయటకు రాకుండా చేశారు. అంటే, అలాంటి ప్రదేశంలోనూ ప్రజలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అర్ధమైంది. నేనే నేరుగా నా సమాచారం అందించాను. వెంటనే చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రచారంలో నేనూ చేరాను.
మంత్రగత్తె చేరే చోటు
ఎవరైనా మంత్రగత్తె అంటూ ఎవరి గురించైనా నాకు వార్తలు వచ్చినప్పుడల్లా, నేను నా బృందాన్ని కలుసుకునేదాన్ని. అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ హ్యూమన్ అవేర్‌నెస్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నాను. అటువంటి కేసుల గురించి నాకు ఎక్కడి నుండైనా సమాచారం వచ్చినప్పుడు, నేను బృందంతో చేరుకుంటాను. నిందితులను విడిచిపెట్టకూడదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. దీని ఫలితంగా, 125 మందికి పైగా మహిళలు రక్షించబడ్డారు.
భరోసా కల్పిస్తూ..
బాధిత మహిళలు భయాందోళనలకు గురికావద్దని ధైర్యం చెబుతుంటాను. జిల్లా యంత్రాంగం వద్దకు వెళ్లండి. న్యాయం కోరండి. పోలీస్ స్టేషన్ లో చెప్పినా వినకపోతే ఎస్పీ వద్దకు వెళ్లండి. మానవ హక్కుల సంస్థలకు ఫిర్యాదు ఇవ్వండి.. అంటూ 35 నుంచి 40 మందిని జైలుకు కూడా పంపాం. చాలాసార్లు నిందితులు జైలుకు వెళ్లే ముందు కూడా రాజీ పడుతున్నారు. నిందితులు తాము ఇంకెప్పుడూ ఏ స్త్రీనీ మంత్రగత్తె అని నిందించబోమని చెబుతూ బాండ్ రాసి ఇచ్చేవారు.
కష్టాల్లో ఉన్న మహిళలకు ఆశ్రయం
మంత్రవిద్య కారణంగా సమాజానికి దూరంగా ఉంటూ బాధపడే మహిళలు దేశంలోని పలు చోట్ల నుంచి న్యాయం కోసం వస్తుంటారు. అప్పుడు వారి పక్షాన గట్టిగా నిలబడతాను. నిందితులపై పోరాడతాను. ఇటీవల సెరైకెలాకు చెందిన ఇద్దరు మహిళలు, చత్రా జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రగత్తె అనే ఆరోపణతో బాధపడుతూ వచ్చారు. ఓ మహిళ భూమిని లాక్కోవాలని ప్రయత్నించినవాళ్లు ఆమెను మంత్రగత్తె అంటూ వేధించారు. సెరైకెలాకు చెందిన మరో మహిళను మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. చత్రా జిల్లాకు చెందిన బాధితురాలు కూడా అక్కడికి చేరుకుని ‘తన సొంత మామ, అతని కొడుకు తన పూర్వీకుల భూమిని లాక్కోవడానికి తనను మంత్రగత్తె అని పిలుస్తున్నాడ’ని చెప్పింది. ఈ స్త్రీలకు ఆశ్రయం ఇచ్చాను.
భూతవైద్యుని నుంచి వైద్యుడి వరకు
గ్రామ గ్రామాన తిరిగి, ప్రజలకు వివరిస్తాను. ఎవరైనా ఎద్దు, మేక మొదలైనవి చనిపోతే, భూతవైద్యుని వలలో పడకండి. ఒకరి బిడ్డ అనారోగ్యం పాలైతే అప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లండి, చికిత్స ఉంటుంది. భూతవైద్యుని దగ్గరకు వెళ్లవద్దు. ఎవరినైనా మంత్రగత్తె అని పిలిచి వేధిస్తే, చట్టం తన పని తాను చేస్తుంది అని చెబుతున్నాను.
భయం లేకుండా...
ఎక్కడనుంచైనా మంత్రగత్తె అనే వార్తలు వచ్చినప్పుడల్లా, నేను కూడా అడవుల మధ్యలో ఉన్న గ్రామాలకు చేరుకుంటాను. పోలీసులు కూడా వెళ్లడానికి ఇష్టపడని ప్రాంతాలు. పంచాయితీలో, గ్రామసభలో అందరినీ సమావేశపరిచి, ఈ దురాచారాన్ని ఎందుకు మానుకోవాలో వివరిస్తాను. ప్రజల ప్రభావం కూడా ఉంటుంది. ‘మీరు మంత్రగత్తె అని పిలిచే వ్యక్తి అంత శక్తివంతమైనది అయితే, ఆమె తనను అణచివేసే వారిని ఎందుకు చంపదు’ అని చెప్తాను. ‘ఆమె మళ్లీ ఎందుకు హింసకు గురవుతుంది?’ అని ప్రశ్నిస్తాను. ఈ నిర్భయత వల్లే నన్ను ’సింహరాశి’ అని పిలవడం మొదలుపెట్టారు’ అని తన ధైర్యాన్ని మన కళ్లకు కడుతుంది చుట్నీదేవి.
నిశ్శబ్దంగా కూర్చోవద్దు.. పోరాడాలి
‘నేనేమీ చదువుకోలేదు. కానీ మానవ హక్కులను అర్థం చేసుకున్నాను. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడాలి. ఎవరైనా స్త్రీని మంత్రగత్తె అనే ఆరోపణపై చిత్రహింసలకు గురిచేస్తే మూడు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించే చట్టం ఉంది. మంత్రగత్తె అనే పేరుతో ఎవరైనా శారీరక గాయం చేస్తే, ఆరు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా విధించే మరో నిబంధన ఉంది. మీ హక్కులు మీరు తెలుసుకోండి’’ అని మంత్రగత్తె ఆరోపణలు ఎదుర్కొంటన్నవారికి ధైర్యం చెబుతుంది చుట్నీ.
పద్మశ్రీ.. తెలియదు
‘ఈ అవార్డు ఏమిటో నాకు తెలియదు. అయితే ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు రావడంతో ఇది పెద్ద అవార్డు అని తెలిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అప్పటి డీసీ అమిత్ ఖరే సాహబ్‌ను కలిశాను. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో నన్ను సత్కరించింది.’
Comments
Please login to add a commentAdd a comment