జార్ఖండ్‌కు చెందిన రుక్మణి దేవికి చిన్నప్పటినుంచీ కష్టాలే. భరింలేని పేదరికం. దీనికి తోడు ఆమెకు వినపడదు..మాట్లాడలేదు కూడా. ఈ నేపథ్యంలో తండ్రి వేధింపులు.. తనకంటే చాలా పెద్దవాడైన వ్యక్తితో పెళ్లి. అయినా పెళ్లి తరువాతైనా తన జీవితం బాగుపడుతుందని భావించిన ఆమె పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కానీ అన్నింటిని అధిగమించి అందరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంతకీ రుక్మిణీ దేవీ సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..?
ది బెటర్ ఇండియా కథనం ప్రకారం గుమ్లా జిల్లాలో రోజువారీ కూలి పని మీద ఆధారపడే నిరు పేద కుటుంబంలో జన్మించిన ఎనిమిది మందిలో రుక్మిణి కూడా ఒకరు. పైగా తన వైకల్యం గురించి అవహేళనలతో బాల్యమంతా చాలా భారంగా నడిచింది. ఒక్క పక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోపక్క ఎందుకూ పనికిరావంటూ తండ్రి వేధింపులు, హింస. రోజంతా ఇంటి పనులుతోనే సరిపోయేది. పాఠశాల మొఖం ఎన్నడూ చూసింది లేదు.
తండ్రి బతుకుదెరువు కోసం రాళ్ళు కొట్టే పనిచేసేవాడు. దీంతో పని ఉన్న రోజే బువ్వ. లేదంటే పస్తే. కొద్దిగా మిల్లెట్స్, అడవి నుండి తెచ్చిన చింతపండు ఇదే ఆధారం ఆ కుటుంబానికి దీనికి తోడు మాటలురాని రుక్మిణి మరింత ‘భారం’గా భావించాడు తండ్రి. ఆమెకంటే 20 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తితో ఆమెకుపెళ్లి చేసేశాడు. ఇక అప్పటినుంచి ఆమెకష్టాలు మరింత పెరిగాయి. రోజూ తాగి వచ్చి భర్త కొట్టేవాడు. ఇంటినుంచి బయటికి గెంటేసేవాడు. ఇలా అతనితో ఉన్నన్ని రోజులు దాదాపు సగం రోజులు పొరుగిళ్లలో దాక్కోవడమే సరిపోయింది. అలా ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. అయితే మద్యానికి బానిసైన భర్త 2014లో క్షయవ్యాధితో మరణించాడు.
ఒక విధంగా భర్త మరణం తర్వాత ఆమె జీవితంలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనే ఆమె సక్సెస్‌కు బాటలు వేసింది. నెలవారీ వితంతు పింఛనురూ.1000తో నలుగురు పిల్లలను పెంచడం కష్టంగా మారింది. ఈ క్రమంలోగ్రామీణ మహిళలకోసం వ్యవసాయానికి సాయపడే లక్ష్యంతో ఎన్‌జీవో సంస్థ‘ ప్రదాన్’ 2022లో వర్క్‌షాప్‌ని నిర్వహించింది. ఈ సమావేశానికి గ్రామీణ మహిళలందరూ గ్రామ చౌపాల్‌కు తరలి రావడం చూసి, రుక్మిణీదేవికి కూడా ఆసక్తి పెరిగింది. అసలేంటో చూద్దామని అక్కడి వెళ్లింది. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది.
జార్ఖండ్‌లోని నీటి కొరత ఉన్న గ్రామ పంచాయతీలలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టింది ప్రధాన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, మేము పొలాల్లో పైపులు వేసి, సౌరశక్తిని ఉపయోగించి నీటిపారుదల కోసం తగిన నీటిని సరఫరా చేయడానికి వాటిని సమీప నదితో అను సంధానించామని ప్రదాన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సత్యం శర్మ ది బెటర్ ఇండియాతో చెప్పారు. రుక్మిణి కూడా ప్రధాన్ సాయం తీసుకుంది. అలా నిరుపయోగంగా తన వ్యవసాయ భూమిలో పంట పండించడం మొదలు పెట్టింది.
అలా తొలి ఏడాది నాలుగు బస్తాల పెసలు , బంగాళాదుంపలను పండించింది. ఇంటికి ఏడాదికి సరిపడా పప్పులు, ఆలూ గడ్డలతోపాటు రూ. 4,000 ఆదాయం పొందింది. దీంతో చిన్న మట్టి వంటగదిని, పశువుల కోసం షెడ్డును నిర్మించుకుంది. ఇక అప్పటి నుండి అంటే సుమారు ఒకటిర్నరేళ్ల నుంచి రుక్మణి రెండు ఎకరాల భూమిలో సాగును పెంచింది. ఇప్పుడు పెసలు, శనగలు, బీన్స్, బంగాళ దుంపలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆవాలు వంటి అనేక రకాల కూరగాయలను పండిస్తోంది. ఈ నేల తల్లే తనకు ఎంతో సాయం చేసిందంటూ హర్షం వ్యక్తం చేసింది రుక్మిణి.
Comments
Please login to add a commentAdd a comment