డాక్టర్ కావ్య... ఫలానా వారి అమ్మాయిగా గుర్తింపు పొందడం లేదు. అలాంటి గుర్తింపు ఆమెకే కాదు... వాళ్ల అమ్మానాన్నలకు కూడా ఇష్టం లేదు. ‘నీకు నువ్వుగా సాధించుకున్నదే నీ గుర్తింపు.. అమ్మానాన్నతో వచ్చేది గుర్తింపు కాద’ని చెప్పి పెంచారామెని. మెడిసిన్ కోర్సు మీద ఆసక్తి పెంచుకున్నారామె. ఆమె కోరుకున్నట్లే చదివించారు పెద్దవాళ్లు. పేథాలజిస్టుగా ఆమెది పేషెంట్‌ల హెల్త్ రిపోర్టులను సర్టిఫై చేయాల్సిన బాధ్యత.
ఆ ఉద్యోగం చేయగా చేయగా... ఆమెకు ఒక నిజం తెలిసింది. అనారోగ్యం వ్యక్తుల్లో మాత్రమే కాదని.. సమాజంలోనూ ఉందని! స్త్రీల ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసే ఆ సామాజిక అనారోగ్యానికి కూడా వైద్యం చేయాలనుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను చైతన్యవంతం చేస్తున్నారు.
డాక్టర్ కావ్య తన తండ్రి పేరుతో గుర్తింపు కోరుకోకపోయినప్పటికీ... ఆమె ప్రాథమిక పరిచయం మాత్రం తెలంగాణ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారమ్మాయిగానే. తను సామాజిక వైద్యురాలిగా మారడానికి దారి తీసిన పరిస్థితులను వివరించే ముందు.. తన కుటుంబ వివరాలను సాక్షితో పంచుకున్నారు కావ్య.
సిటీ బస్సులో కాలేజ్‌కి
‘‘ముగ్గురమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. నేను సెవెన్త్‌లో ఉన్నప్పుడు.. అంటే 1994లో ఓ రోజు... ఎప్పటిలాగానే మధ్యాహ్నం భోజనానికి స్కూలు నుంచి ఇంటికి వచ్చాను. మాకప్పట్లో డైనింగ్ టేబుల్ లేదు. నేల మీదనే భోజనాలు. అమ్మ మాకు వడ్డించి తనూ కూర్చుని ఉంది. అప్పుడు నాన్న మంత్రి అయ్యారనే సమాచారం వచ్చింది. మంత్రి అంటే ఏంటని అమ్మని అడిగితే, అమ్మ ఏదో చెప్పింది కానీ, అమ్మకి కూడా వివరంగా చెప్పేటంతగా తెలియదు’’ అన్నారు డాక్టర్ కావ్య. తనకు మంత్రిగారమ్మాయిగా కారులో ప్రయాణించడంతోపాటు బస్ పాస్ కొనుక్కుని ఎంబీబీఎస్ కి కాలేజ్‌లో సిటీబస్‌లో వెళ్లిన అనుభవాలూ ఉన్నాయన్నారామె.
బాల్య వివాహాల నియంత్రణ
రాజకీయాల్లోకి రాకముందు నాన్న లెక్చరర్. ఇప్పటికీ ఆయనలో టీచర్ అలాగే ఉన్నారు. చిన్నప్పుడు స్కూలుకెళ్లావా, కాలేజ్‌కెళ్లావా... అని అడిగినట్లే ఇప్పుడు ‘హాస్పిటల్‌కి వెళ్లావా’ అని అడుగుతారు. మన డ్యూటీ మనం నూటికి నూరు శాతం చేయాలనే తత్వం ఆయనది. ఎవరైనా ఆయన్ని ‘ముగ్గురమ్మాయిలు కదా వాళ్లకు ఏమిచ్చారు’ అని అడిగితే... ‘ఏమివ్వాలి’ అని ఎదురు ప్రశ్నిస్తారు. ‘ముగ్గురినీ చదివించాను. నా పిల్లలు ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజనీర్లు. ముగ్గురూ పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు.
ఇంకా నేనిచ్చేదేంటి? వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడతారు. వాళ్ల జీవితాన్ని వాళ్లే నిర్మించుకుంటారు’ అని చెబుతారు. ఆయనకు రికమండేషన్ చేయడం ఇష్టం ఉండదు. మాకోసం ఫేవర్ చేయమని ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఎవరైనా మమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు... ఆ విషయాన్ని నాన్న దగ్గరకు తీసుకెళ్లినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ‘వ్యక్తులకు కాదు, వ్యవస్థలకు చేయాలి.. అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడదాం’ అనేవారు.
ఆయనకు ఆడపిల్లలంటే ప్రత్యేకమైన అభిమానం. మేము ముగ్గురం. మా ముగ్గురికీ కలిపి నలుగురమ్మాయిలు. ఇంటి నిండా ఆడపిల్లలు కనిపిస్తుంటే ఆయనకు ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేను. ఆయనకు బాలికల కోసం ఏదైనా చేయడం చాలా ఇష్టం. ఒకప్పుడు కస్తూర్బా విద్యాకేంద్రాల్లో ఎనిమిదవ తరగతి వరకే ఉండేది. ఆ తర్వాత ఆ పిల్లలను మరో స్కూల్‌లో చేర్చడం, దూరం పంపడానికి ధైర్యంలేక వాళ్ల అమ్మానాన్నలు ఆ అమ్మాయిలకు తొమ్మిదో తరగతి వయసుకే పెళ్లిళ్లు చేసేవాళ్లు. ఇలాంటి బాల్య వివాహాలను అరికట్టడం కోసం నాన్న ఆ విద్యా కేంద్రాలను పన్నెండవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయించారు.
నాన్న నుంచి చేర్చుకున్నా
పేషెంట్‌ను పేషెంట్‌గా మాత్రమే చూడకుండా వ్యాధి లక్షణం వెనుక ఉన్న సామాజిక కారణాన్ని అన్వేషించడం ఎలా అలవడిందంటే ఇదీ అని స్పష్టంగా చెప్పలేను. మనం చేసిన పని వల్ల సమాజానికి ప్రయోజనం చేకూరాలని నాన్న చెప్పిన మాటలే కారణం అనుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్‌లో పేథాలజిస్టుని. ఇప్పటి వరకు నా ఉద్యోగం గ్రామాలు, చిన్న పట్టణాలు, అల్పాదాయ వర్గాల నివాస ప్రాంతాల్లోనే. నా దగ్గరకు వచ్చిన పేషెంట్‌ల ఆరోగ్య పరీక్షల నమూనాల్లో మహిళల హిమోగ్లోబిన్ పర్సెంట్ ఏడు నుంచి తొమ్మిది వరకే ఉండడాన్ని గమనించాను.
అది కనీసం పన్నెండైనా ఉండాలి. ఏ ఒకరో ఇద్దరిలోనో కాదు, తొంబై తొమ్మిది శాతం ఇంతే. పది శాతం హిమోగ్లోబిన్ నూటికి ఒకరికి మాత్రమే ఉండేది. మహిళలు అమాయకంగా తీసుకునే మరో నిర్ణయం గర్భాశయాన్ని తొలగించుకోవడం. మెన్‌స్ట్రువల్ హైజీన్ తెలియకపోవడం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం. ఇన్నింటిని చూసిన తర్వాత నా ఉద్యోగం నేను చేసుకుని వచ్చేస్తే సరిపోదు.. ఏదో ఒకటి చేయాలనిపించింది. అయితే చేద్దామని అనుకున్నంత సులభం కాదు చేయడం. మెడికల్ క్యాంపు పెట్టి మందులిచ్చి వచ్చేస్తే కూడా సరిపోదు.
ఐరన్‌మాత్రలు వేసుకుంటే పొట్ట ఉబ్బరంగా ఉంటోందని హాస్పిటల్‌లో ఇచ్చిన మాత్రలను వేసుకోవడం లేదు. మేమడిగితే ‘వేసుకున్నాం’ అని మమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తారు. వాళ్ల మాటకంటే ముందు ముఖం చెప్పేస్తుంది రక్తహీనత అలాగే ఉందని. వాళ్లకు మంచి ఆహారం కావాలి. అలాగని ప్రతిదీ ప్రభుత్వపరంగా చేయడం కుదరదు. అందుకే ‘కడియం ఫౌండేషన్’ స్థాపించి రక్తహీనతతో బాధపడుతున్న ఆడపిల్లలు, మహిళలకు వేరుశనగపప్పు ఉండలతోపాటు విడిగా ఒక కేజీ బెల్లం ఇవ్వడం మొదలు పెట్టాను.
మంచి ఫలితాలను ఇస్తోంది
ఎవరెన్ని చెప్పినా ఆడవాళ్లలో ఆహారం పట్ల శ్రద్ధ తక్కువే. మా అమ్మే పెద్ద ఉదాహరణ. మా నాన్న క్యాంపుకెళ్లినప్పుడు ‘నాన్న లేరు కదా, ఏం వండుదాం, ఉన్నవేవో తినేద్దాం’ అనేది. ఈ మాట అనని అమ్మ మనదేశంలో బహుశా ఉండకపోవచ్చు. నేను స్కూళ్లకు వెళ్లి, కమ్యూనిటీ సెంటర్‌లకు వెళ్లి గొంతు చించుకుని చెప్తున్న విషయాలు.. ఒకటి పోషకాహారం అవసరత, రెండు మెన్‌స్ట్రువల్ హైజీన్, మూడవది ఆరోగ్య పరిరక్షణ. నా ప్రయత్నంలో భాగంగా ఇప్పుడిప్పుడు సరిగా తినడం, మెన్‌స్ట్రువల్ హైజీన్ అలవడుతోంది. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తీవ్రత పెరిగే వరకు ఉదాసీనంగా ఉండడంలో పెద్ద మార్పు రాలేదు. ఈ మూడో విషయంలో మా గ్రామాల మహిళలే కాదు, చదువుకున్న సంపన్న కుటుంబాల మహిళలు కూడా అలాగే ఉంటున్నారు.
ఒక పెద్ద మహిళాధికారి ప్రీ క్యాన్సర్ దశలో వైద్యం చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మహిళల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించడానికి ఇలాంటి ఉదాహరణలెన్నింటినో చెబుతుంటాను’’ అన్నారు డాక్టర్ కావ్య. ఒక మహిళ అనారోగ్యం పాలయినా, ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబం ఎంతగా ఒడిదొడుకులకు లోనవుతుందో వివరించగలిగితే చాలు. ఆడవాళ్లు తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరు. అదే విషయాన్ని మనసుకు తాకేటట్లు చెప్పే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరగాల్సిన అవసరమూ ఉంది. అలాంటి ఒక పెద్ద సామాజిక ఆరోగ్య యజ్ఞంలో కావ్య తన వంతుగా చేస్తున్న ప్రయత్నం ఇది.
వాకా మంజులారెడ్డి
ఫొటోలు: జి. అమర్
మా వారిది గుంటూరు జిల్లా. మెడిసిన్ చదివేటప్పుడు పరిచయమ్యారు. నాన్నతో చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏమీ చెప్పలేదు. నజీర్‌తో మాట్లాడిన తర్వాత తన అంగీకారాన్ని తెలియచేశారు. నిరాడంబరత, అభ్యుదయ భావాలను పైకి మాట్లాడరు. కానీ ఆయన ఆచరణలో అవి ఉంటాయి. గ్రామీణ మహిళల కోసం సర్వీస్ కూడా నాన్నతో మాట్లాడిన తర్వాతే మొదలుపెట్టాను.
డాక్టర్ కావ్య, పేథాలజిస్ట్,
వర్ధన్న పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్,
వరంగల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment