
తృప్తి దేశాయ్
తిరువనంతపురం/ న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ నెల 17న తాను కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామిని దర్శించుకుంటానని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు మహిళలతో కలసి తాను ఆలయానికి వెళ్తున్నట్లు తెలిపారు. దర్శనసమయంలో తనకు రక్షణ కల్పించాలని ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌లను కోరింది. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టనివ్వ బోమని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోౖ వెపు, తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం మరోసారి నిరాకరించింది. శబరిమల తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లపై జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపడతామని తెలిపింది.