సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి, అధికారులు..
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నిషేధిత ప్రమాణాలతో కూడిన ప్లాస్టిక్ వినియోగాన్ని మూడు నెలల్లో పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర పర్యావరణ, శాస్త్రసాంకేతిక, ఇంధన, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నగరంలో బుధవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి. మానవాళికి హాని కలిగించేలా, పర్యావరణంకు విఘాతం ఏర్పడేలా కాలుష్యంను విడుదల చేస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా పరిశ్రమలు వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేయకుండా, వాటిని శుద్దిచేసి, హానికర రసాయనాలను పూర్తిగా తొలగించిన తరువాతే బయటకు వదిలేలా చూడాలని కోరారు. అందుకు అవసరమైన వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ లను పరిశ్రమలు సిద్దం చేసుకోవాలని అన్నారు.
దాదాపు రూ.20.30 కోట్ల జరిమానా
రాష్ట్ర వ్యాప్తంగా 17 కేటగిరిల్లోని 307 పరిశ్రమలు ఇప్పటికే AP PCB పరిధిలో నిత్యం కాలుష్య నియంత్రణ ప్రమాణాలపై ఆన్ లైన్ ద్వారా సమాచారంను అందిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఏ పరిశ్రమలో అయినా కాలుష్యం ప్రమాణాలకు భిన్నంగా వెలువడితే వెంటనే పీసీబీ అధికారులు సదరు పరిశ్రమలను అప్రమత్తం చేయడానికి వీలవుతోందని తెలిపారు. ఇదే విధానాన్ని అన్ని పరిశ్రమలకు వర్తింపచేయాలని అన్నారు. ఇప్పటికే ఇండస్ట్రియల్ పొల్యూషన్ మానిటరింగ్, హజార్డ్ వేస్ట్, బయోవేస్ట్, ఈ-వేస్ట్, ప్లాస్టిక్ వేస్త్, బ్యాటరీ వేస్త్, ఫ్లైయాష్ విభాగాల్లో పీసీబీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రమాణాలను పాటించని సంస్థలపై జరిమానాలు విధించడం, నోటీసులు జారీ చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటివరకు దాదాపు రూ.20.30 కోట్లను జరిమానాలుగా విధించడం జరిగిందని వెల్లడించారు.
జాతీయ స్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఏపీ పీసీబీ పనిచేస్తోందని అన్నారు. వివిధ కేటగిరిల్లోని వ్యర్థాల నిర్వహణపై ఎప్పటికప్పుడు జాతీయ సంస్థలకు నివేదికలను సమర్పిస్తున్నామని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై నేరుగా స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిస్తోందని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ప్రమాణాలు పాటించని సంస్థలపై తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారాయాన.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్ క్యాప్) కింద రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యంను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి గాలి కాలుష్యంపై పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఐఐటి తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ, ఎన్ఎఆర్ఎల్, సిఎస్ఐఆర్, ఎన్ఇఇఆర్ఐ, ఐఐటి మద్రాస్ ల ద్వారా రాష్ట్రంలోని పలుచోట్ల గాలి కాలుష్యంపై అధ్యయనం జరుగుతోందని అన్నారు. హాట్ స్పాట్ లను గుర్తించడం, కాలుష్యానికి కారణాలను పరిశీలించి, వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే 42.90 కోట్లతో పలు నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు.
రాష్ట్రంలో బయో వ్యర్థాల నిర్వహణ సగ్రమంగా జరగాలని, బయోవేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఇస్తున్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపించే బయో వ్యర్థాలను నిర్థిష్టమైన ప్రమాణాల మేరకు డిస్పోజ్ చేస్తున్నారో లేదో పరిశీలించే విధానాలను రూపొందించాలని కోరారు. ఈ సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి మెంబర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment