
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30 శాతం మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో గాలిలో ఉన్న కాలుష్యం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ రెండు నగరాలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది.
ఇప్పటికే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్.. ఆంధ్ర యూనివర్సిటీ, ఐఐటీ (కాన్పూర్), అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీలతో కలిసి కాలుష్య నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. విజయవాడ కార్పొరేషన్ కూడా ఐఐటీ (తిరుపతి) భాగస్వామ్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ తరహా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
ఇందుకోసం ఆ నగరాలకు ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల చొప్పున మూడేళ్లు కేటాయిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు నగరపాలక సంస్థలు ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందించాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు ఐఐటీ (తిరుపతి) సహకారంతో, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాలకు నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్ఫియరిక్ రీసెర్చ్ (తిరుపతి) ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వాయు కాలుష్య పర్యవేక్షణ
వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈ నగరాల్లో రూ.35 కోట్లతో కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఐదు చొప్పున, 11 మున్సిపాల్టీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా గాలి కాలుష్యాన్ని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడం, ప్రజలకు దానిపై డిజిటల్‌గా చూపించడం అవగాహన కల్పించనున్నారు.
కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 35 స్టేషన్లలో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటోంది.
అక్కడి నుంచి వచ్చే మురుగునీటిని ప్రస్తుతం 89 సివేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధిచేస్తుండగా మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, ఈ–పరిశ్రమల వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రమాదకర వ్యర్థాలను వినియోగించుకునేందుకు 10సిమెంట్ కంపెనీలకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఒకే ఒక భూమి (ఓన్లీ ఒన్ ఎర్త్) పేరుతో నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 8,953 పరిశ్రమల్లో సెస్టెంబర్ నాటికి 33% మొక్కలతో పచ్చదనాన్ని వృద్ధి చేయాలని కోరాం.
– ఎ.కె.పరిడ, చైర్మన్, కాలుష్య నియంత్రణ మండలి
Comments
Please login to add a commentAdd a comment