సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖనిజాధారిత పరిశ్రమలపై శాస్త్రీయంగా హేతుబద్ధమైన ఫీజులు విధించాలని గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు సూచించారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో మంగళవారం ఇంధన, అటవీ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి కాలుష్యకారక పరిశ్రమలు, వాటి నియంత్రణ తదితర అంశాలపై పెద్దిరెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రోత్సాహకరమైన వాతావరణంలోనే పరిశ్రమలు పనిచేసేందుకు సహకరించాలన్నారు. మైనింగ్ పరిశ్రమలకు అనుమతులు, నిర్వహణ సందర్భంగా విధిస్తున్న సీఎఫ్‌ఓ, సీఎఫ్‌ఈ ఫీజుల పెంపు హేతుబద్ధంగా ఉండాలన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే మైనింగ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారో పరిశీలించాలన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన ఫీజులు తమకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయని మైనింగ్ పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనే సీఎం ఆశయానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లు అందించాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ఆస్పత్రులు, ల్యాబ్‌ల నుంచి పెద్దఎత్తున వస్తున్న బయో మెడికల్ వ్యర్థాలను తగిన జాగ్రత్తలతో నాశనం చేయాలని ఆదేశించారు. పీసీబీ చైర్మన్ ఏకే ఫరీడా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment