‘మిషన్ లైఫ్ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం’ | AP Is Top In The Country In Mission Life Programme Minister {Peddireddy | Sakshi
Sakshi News home page

‘మిషన్ లైఫ్ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం’

Published Mon, Jun 5 2023 5:19 PM | Last Updated on Mon, Jun 5 2023 5:51 PM

AP Is Top In The Country In Mission Life Programme Minister {Peddireddy - Sakshi

విజయవాడ: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తాం, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞపూనాలని పర్యావరణ దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్ర ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి సందర్శించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తరువాత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్  (ఎటిబి) వెండింగ్ మిషన్ను మంత్రి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగంను నివారించడం, కాలుష్యాన్ని నియంత్రించాలంటూ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పర్యావరణహిత కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిశ్రమలు, ఆస్పత్రులు, స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ అవార్డులను ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, 1975 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటున్నామని గుర్తచేశారు.  అందరిలోనూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు, పర్యావరణంకు ముప్పు లేని జీవన విధానంను అలవర్చుకునేందుకు ఐక్యరాజ్యసమతి ఈ దినోత్సవంను ప్రకటించిందని వివరించారు.

ఈ ఏడాది ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం, దానికి పరిష్కారాలు అనే అంశంపై ప్రపంచం అంతా పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్‌ గతంలో విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగాగ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్నిమంత్రి గుర్తుచేస్తూ తిరుమలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగిందన్నారు.

ఇదే మాదిరిగా పలు దేవాలయాలు, మున్సిపల్ కార్పోరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేదించామని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్  దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ది, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ఈ ఘనతను సాధించగలిగామన్నారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో నీటి ఆదా, విద్యుత్ పొదుపు, సరైన ఆహార విధానంను అలవరుచుకోవడం, వ్యర్థాలను తగ్గించుకోవడం, స్వచ్ఛతా కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించుకోవడం అనే ఏడు అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. అంతేకాదు మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా మన రాష్ట్రంలోని సముద్రతీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ప్రజాభాగస్వామ్యంతో చేపట్టామని పేర్కొన్నారు. అలాగే అన్ని పట్టణాలు, నగరాల్లో కాలువలు, చెరువుల్లో క్లీనింగ్ కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బైక్ ర్యాలీలు, ప్రధాన ట్రాఫిక్ కూడళ్ళ వద్ద పర్యావరణ అంశాలపై ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
 
విద్యుత్ పొదుపు చర్యలు, నీటి పరిరక్షణ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి గానూ గత మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, వారితో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నామన్నారు. ఈ సదస్సులో మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, రూ. 9 లక్షల కోట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలో వచ్చాయని వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

 దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్యూలన కోసం 'ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్' ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఘన వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలన చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో తాను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రిగా  రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణం కింద కోటి మొక్కలను నాటించడం జరిగిందన్నారు. వాటిని పర్యవేక్షించేందుకు కూడా నరేగా నుంచి నిధులను వినియోగించామని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొక్కలను తీసుకువచ్చి 16 వేల కిలోమీటర్ల పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ కింద 65 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు.. ప్రస్తుతం అటవీశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలోని 120 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎకో పార్క్ లను అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మన రాష్ట్రంలో 37,392 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి అంటే 23 శాతంగా ఉన్న అడవులను  33 శాతంకు పెంచాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ పని చేస్తున్నారన్నారు. కమ్యూనిటీ ఫారెస్ట్ వంటి కార్యక్రమాలు, రైతులకు బీడు భూముల్లో ఉద్యానవనాల పెంపకంను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామన్నారు.  
 

రాష్ట్రంలో చాలా పరిశ్రమలు ఉన్నాయని, రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా పచ్చదనంను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని భావిస్తున్నామన్నారు. పర్యావరణం సురక్షితంగా ఉంటేనే మానవాళితో పాటు అన్ని జంతు, జీవజాలాల మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.పర్యావరణంను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని కోరుకుంటున్నానన్నారు. పర్యావరణహితం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రతిఏటా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నాడు సన్మానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచానికి ఒకే భూమి ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ విధిగా కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం గుర్తుచేశారు. ఏపి పిసిబి ద్వారా గాలి, నీటి కాలుష్యంను తగ్గించుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను కూడా  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.

ప్రతి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ను జాగ్రత్తగా నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేకమైన కార్యాచరణను నిర్ధేశించామన్నారు. పర్యావరణంను కాపాడేందుకు బొగ్గుతో జరిగే విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఆలాగే పెట్రో ఇంధనంతో నడిచే వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. అంతర్జాతీయంగా యుఎన్ నిర్వహించిన మిషన్ లైఫ్ లో ప్రధానమంత్రి పాల్గొని కాలుష్య కారకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నియంత్రించడం, సరైన విధానంలో ప్లాస్టిక్ ను సేకరించి, వాటిని రీసైకిల్ చేసేందుకు తగు చర్యలు చేపట్టామని నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మన దైనందిన జీవనంలో భాగమైందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం 80 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటే, దీనిలో 9 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోందని గణాంకాలతో సహా వివరించారు. మిగిలిన ప్లాస్టిక్ నదులు, సముద్రాలు, భూమిలో కలిసి విపరీతంగా కాలుష్యం పెరుగుతోందన్నారు. ప్లాస్టిక్ ను నిర్వీర్యం చేసేందుకు దానిని తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలిగించే విష వాయువులు గాలిలో కలుస్తున్నాయని, ఇది మానవాళికే ప్రమాదకరమన్నారు.  ప్లాస్టిక్ వినియోగంపై వచ్చిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నామని తెలిపారు. గాలి, నీటి,భూ కాలుష్యంను తగ్గించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందిచగలుగుతామని శ్రీధర్ అన్నారు. 

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్  మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న హాని నుంచి బయటపడాలంటే, నిపుణులు చేస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. విజయవాడ నగర పాలకసంస్థ ప్లాస్టిక్ ను నిషేదించిందని,  సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామన్నారు. పర్యావరణంను పరిరక్షించేందుకు నగరంలోని కాలువలను శుద్ధి చేస్తున్నామన్నారు. దాదాపు 5000 టన్నుల చెత్తను వెలికితీసిన విషయాన్ని మల్లాది విష్ణు గుర్తు చేశారు.అర్భన్ ఫారెస్ట్రీ కింద విజయవాడ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఎపి పిసిబి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణను వివరిస్తూ వేదికపై భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్లాస్టిక్ సంచులు వాడొద్దు.. నార సంచులు, గుడ్డ సంచులు వినియోగించాలని ప్లాస్టిక్ భూతంపై పాడిన పాట, వివిధ రకాల కాలుష్యాలను వివరిస్తూ, భూమిని కాపాడుకుందాం అని పాడిన పాట, పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ రాజమహేంద్రవరానికి చెందిన విభూది దళం బ్రదర్స్ ప్రదర్శించిన బుర్రకథ ఆద్యంతం ఆలోచింపజేశాయి.

ఈ సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న  పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రుల ప్రతినిధులకు, స్థానిక సంస్థలకు కలిపి మొత్తం 13 అవార్డులను మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, లావురుస్ లేబరేటరీస్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, కియా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఆసుపత్రుల విభాగంలో విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్, విజయవాడ సెంట్రల్ రైల్వే హాస్పిటల్, విజయవాడ ఆయూష్ హాస్పిటల్, సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ మెడికల్ సైన్సెస్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. అలాగే అర్బన్ లోకల్ బాడీస్ కేటగిరిలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు అవార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే  శ్రీ. మల్లాది విష్ణు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ. నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి  మెంబర్ సెక్రటరీ  బి.శ్రీధర్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్, జెఎన్‌టియు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.జె. మురళీకృష్ణ,  ప్రొఫెసర్ రామకృష్ణ, ఏపీ పీసీబీ మెంబర్ శివకృష్ణారెడ్డి, ఎన్విరాన్ మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎన్.వి.భాస్కర్ రావు, పలువురు పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement