
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలకు ఈ ఏడాది దక్కిన ప్రతిష్టాత్మక అవార్డులు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే బాధ్యతను మరింత పెంచాయని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీడీసీఎల్) ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 28న ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంలు, నెడ్‌క్యాప్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, వివిధ విభాగాల ఉద్యోగులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆదివారం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నుంచి అందుకున్న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దేశంలో ఏపీ ఖ్యాతిని మరింతగా పెంచిందని మంత్రి అన్నారు.
ఏకైక రాష్ట్రం ఏపీ
ఇంధన మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి సంబంధించి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎనర్షియా సమ్మిట్‌లో ఏపీ మరో 3 అవార్డులను గెలుచుకుందని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఏపీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీగా, ఉత్తమ పునరుత్పాదక సంస్థల్లో ఒకటిగా నెడ్‌క్యాప్
నిలిచాయన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.