పర్యావరణంలో తెలంగాణ ‘ఫస్ట్‌’! | Telangana first in environment | Sakshi
Sakshi News home page

పర్యావరణంలో తెలంగాణ ‘ఫస్ట్‌’!

Published Mon, Jun 5 2023 5:26 AM | Last Updated on Mon, Jun 5 2023 5:26 AM

Telangana first in environment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెంపు (చేంజ్‌ ఇన్‌ ఫారెస్ట్‌ కవర్‌)తోపాటు మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానంలో నిలవగా.. వినియోగంలో లేని జలవనరుల శాతం, భూగర్భ జలాలు, నదుల కాలుష్యం వంటి అంశాల్లో వెనుకబడింది. అయితే అన్ని అంశాలను కలిపిచూస్తే ఓవరాల్‌గా దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే టాప్‌ స్కోర్‌ సాధించింది.

తాజాగా ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎన్వి రాన్‌మెంట్‌’విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్వి రాన్‌మెంట్‌ 2023– ఇన్‌ ఫిగర్స్‌’నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రాల్లో వ్యవసాయం, పశు సంపద, వైల్డ్‌లైఫ్‌–బయోడైవర్సిటీ, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, నీరు–నదులు, విద్యుత్, ఆరోగ్యం అంశాల ఆధారంగా.. పర్యావరణం, వ్యవసాయం, ప్రజారోగ్యం, ప్రజా మౌలిక సదుపాయాలు, మానవాభివృద్ధి, మున్సిపల్‌ ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, హానికర వ్యర్థాలు, ఇతర వ్యర్థాల నిర్వహణలో పాయింట్లను కేటాయించారు. 

ఏయే అంశాలకు గరిష్టంగా ఎన్ని పాయింట్లు ఇచ్చారు? 
 2019తో పోల్చితే అటవీ విస్తీర్ణం పెంపునకు 3 పాయింట్లు.
♦ మున్సిపల్‌ ఘనవ్యర్థాల నిర్వహణ (2020–21లో)కు 1.5 పాయింట్లు 
♦ 2020 జూన్‌ 30నాటికి మురుగునీటి శుద్ధి చర్యలకు 1.5 పాయింట్లు 
♦  2019–20తో పోల్చితే 2020–21 నాటికి పునరుత్పాదక విద్యుత్‌ పెంపునకు 1 పాయింట్‌ 
♦  2018తో పోల్చితే 2022 నాటికి కాలుష్యం బారినపడ్డ నదుల ప్రక్షాళన చర్యలకు 1 పాయింట్‌ 
♦ 2022లో భూగర్భజలాల వెలికితీత అంశానికి 1 పాయింట్‌ 
♦ 2022లో వినియోగంలో లేని నీటి వనరుల శాతానికి 1 పాయింట్‌ 
(ఇందులో అటవీ విస్తీర్ణం పెంపు, మున్సిపల్‌ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తెలంగాణకు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీనితో ఎక్కువ పాయింట్లతో దేశంలోనే టాప్‌లో నిలిచింది.)  

పర్యావరణహిత రాష్ట్రం కోసమే: కేటీఆర్‌ 
పర్యావరణహితంలో దేశంలో అగ్రస్థానంలోనే తెలంగాణ నిలవడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎస్‌ఈ విడుదల చేసిన నివేదికలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ఇది తెలంగాణ ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలకు, పర్యావరణం పట్ల సీఎం కేసీఆర్‌ నిబద్ధతకు  దక్కిన గుర్తింపు. భవిష్యత్తుతరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసమే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ పచ్చదనం, పర్యావరణ కార్యక్రమాలలో భాగస్వాములైన రాష్ట్ర ప్రజలకు అభినందనలు’ అని తెలిపారు.  

ఎక్కువ పాయింట్లు తెలంగాణకే..
 వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రాలకు మొత్తంగా 10 పాయింట్లు కేటాయించగా.. తెలంగాణ 7.213 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ (6.593 పాయింట్లు), గోవా (6.394), మహారాష్ట్ర (5.764), హరియాణా (5.578 పాయింట్లు) నిలిచాయి. 
రాజస్తాన్‌ అతి తక్కువగా 2.757 పాయింట్లతో అట్టడుగున 29వ స్థానంలో నిలవగా.. నాగాలాండ్‌ 3.4 పాయింట్లతో 28వ, బిహార్‌ 3.496 పాయింట్లతో 27వ, పశ్చిమ బెంగాల్‌ 3.704 పాయింట్లతో 26వ స్థానాల్లో 
నిలిచాయి. 
♦ తక్కువ పాయింట్లతో అట్టడుగున నిలిచిన పది రాష్ట్రాల్లో ఆరు ఈశాన్య రాష్ట్రాలే కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement