
సాక్షి, అమరావతి: ఇటీవల పరిశ్రమల్లో ప్రమాదాల నేపథ్యంలో నిరంతరం తనిఖీ చేసేందుకు మూడు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాస్క్‌ఫోర్స్ బృందాలు పరిశ్రమలు, కాలుష్యకారక సంస్థల్లో తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే ఫరీడా, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ విజయ్‌కుమార్, పీసీబీ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎర్రచందనం నిల్వలు విస్తరించిన ప్రాంతాల్లో సాయుధ అటవీ బృందాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలని, అవసరమైతే డ్రోన్లతో నిఘా పెట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, వాటితోపాటు పులికాట్, నేలపట్టు, కోరింగ, పాపికొండలు ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, పీఆర్, ఆర్డీ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, పీసీసీఎఫ్ బీకే సింగ్, పీసీపీఎఫ్ ఏకే ఝా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment