సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్‌ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రీతిలో వాతావరణం దెబ్బతినడమేకాక అక్కడి చెరువులు ప్రమాదకరంగా మారాయని, మనుషుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై హైకోర్టులో తాము పిటిషన్ వేశామని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌ను తరలించాలని తాము చెప్పగా.. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పరిశ్రమ వేరే ప్రాంతానికి తరలిపోతోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం అవాస్తవమని స్పష్టం చేశారు. అవాస్తవాలు రాసిన ఆ పత్రికకు లీగల్ నోటీసు ఇస్తామని, పరువు నష్టం దావా వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి విజయకుమార్ ఇంకా ఏం చెప్పారంటే..
గడువు ఇచ్చినా కాలుష్యాన్ని నియంత్రించ లేదు
రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ప్రతినెలా చేస్తున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా 54 పరిశ్రమల్లో తనిఖీలు చేశాం. వాటిలో కాలుష్యం ఎక్కువగా వస్తుందని గమనించి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వాటిని సరిచేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా కొంత సమయం అడిగింది. అందుకు 2 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఉల్లంఘనలు ఎంతవరకు సరయ్యాయో తెలుసుకునేందుకు మళ్లీ తనిఖీ చేశాం. అప్పుడు కూడా సరికాకపోవడంతో మళ్లీ నోటీసు ఇచ్చాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఉత్పత్తిని నిలిపివేసి, తప్పుల్ని సరి చేసుకున్నాక మళ్లీ పునఃప్రారంభం చేసుకునేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆ నోటీసు ఇచ్చాం. దీనిపై వారి వాదన వినిపించేందుకు రెండుసార్లు (లీగల్ హియరింగ్)కు అవకాశం ఇచ్చాం.
అమరరాజా బ్యాటరీస్ చిత్తూరు, తిరుపతి యూనిట్ల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే అందులో పనిచేసే కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం మరింత పెరిగి, అక్కడి వారి ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించాం. ఏలూరులో ఇలాంటి పరిస్థితిలోనే లెడ్, నికెల్ లెవెల్స్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడిన విషయాన్ని గుర్తు చేశాం. అలాంటి వైపరీత్యాలు వస్తున్న క్రమంలో కాలుష్యాన్ని నియంత్రిస్తే తప్ప పరిశ్రమను నడిపించడానికి వీల్లేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. ఈ విధంగా ఈ ఏడాది 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని, 50 పరిశ్రమలను మూసివేయాలని క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చాం. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునే వరకు మూసివేసి, నియంత్రణ చర్యలు తీసుకున్నాక ఉత్పత్తి చేసుకోవాలని చెప్పాం. క్లోజర్ ఆర్డర్ ఇచ్చాక అమరరాజా బ్యాటరీస్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు 4 వారాలపాటు స్టే ఇచ్చింది. ఈలోపు ఓ బృందాన్ని నియమించి పూర్తిస్థాయి తనిఖీలు చేసి ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఒక సాంకేతిక టీమ్‌ని నియమించి అక్కడికి పంపి హైకోర్టుకు నివేదిక సమర్పించాం.
ఉద్యోగుల రక్తంలోనూ సీసం చేరింది
అమరరాజా ప్లాంట్ వద్ద వాడే నీటిని పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్ చేసి బయటకు పంపించాలి. కానీ లెడ్ (సీసం)తో కలిసిన నీటిని నేరుగా మొక్కలు, ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఏవిధమైన ఏటీపీ (ఎఫిలియెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) చేయకుండా నేరుగా లెడ్ కలిసిన నీటిని ఎస్‌టీపీకి వదిలేశారు. ఆ నీరు మల్లెమడుగు, గొల్లపల్లి, నాయుడు చెరువుల్లో కలిసింది. కొండపక్కనే ఉండటం వల్ల ఈ నీటితోపాటు వర్షం వచ్చినప్పుడు ప్లాంట్ నీరు చెరువుల్లో కలిసింది. మల్లెమడుగులో కేజీకి 134.79 మిల్లీగ్రాముల లెడ్ ఉంది. గొల్లపల్లిలో 319 మిల్లీగ్రాములు, నాయుడు చెరువులో అయితే 3,159 మిల్లీగ్రాములు ఉంది. ఈ నీరు తాగిన జంతువుల్లోకి లెడ్ వెళుతోంది. అక్కడి మొక్కల్లోకి వెళ్లి వాటినుంచి కూరగాయల ద్వారా మనుషుల శరీంలోకి లెడ్ వెళుతోంది. సాధారణంగా ఒక పరిశ్రమలో కాలుష్యం వస్తే అందులో పనిచేసే ఉద్యోగులు, లోపల, పరిసరాల్లో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఇక్కడ 4, 5 కిలోమీటర్ల భూమి, నీటిలో లెడ్ ప్రవేశించింది. భూమి, నీరు, ఇతర రకరకాల శాంపిల్స్‌ని విశ్లేషించాం.
ప్రతిచోటా రెండు చొప్పున శాంపిల్స్‌ని సేకరించి ఒకటి పీసీబీ లేబొరేటరీలో, మరొక శాంపిల్‌ని హైదరాబాద్‌లో ఉన్న స్వతంత్య్ర సంస్థ ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)కి పంపించాం. ఈ రెండు నివేదికలను హైకోర్టుకు సమర్పించాం. పరిశ్రమ మెయిన్ గేటు దగ్గర ఉన్న బోర్ వెల్ శ్యాంపిల్ తీసుకుని ఈపీటీఆర్‌ఐకి పంపితే అందులో లీటర్‌కి 0.08 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. వాస్తవానికి ఇది 0.01కి మించి ఉండకూడదు. ఎల్‌వీఆర్‌ఎల్‌ఏ స్టోర్స్ అనేచోట తీసుకున్న శాంపిల్‌లో 200 శాతం ఎక్కువ లెడ్ ఉంది., మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర లీటర్‌కి 0.3 మైక్రో గ్రాములు లెడ్ ఉంది.
పరిశ్రమకు దగ్గరున్న గొల్లపల్లి చెరువులో 500 శాతం, కరకంబాడీ చెరువులో 90 శాతం, నాయుడుచెరువులో 1,200 శాతం ఎక్కువ లెడ్ ఉంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల బ్లడ్ శాంపిల్స్‌ను బెంగళూరులోని ఒక లేబొరేటరీకి పంపించాం. 12 శాతం శాంపిల్స్‌లో బ్లడ్ లెవెల్స్ డెసిలేటర్‌కి 42 మైక్రో గ్రాములు ఉంది. ఇది అత్యధికంగా 10 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. 450 మంది ఉద్యోగుల శరీరంలో పరిమితిని దాటిపోయి లెడ్ ఉంది. ఈ ఉద్యోగులను లెడ్ రాని ఏరియాలో పనిచేయించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు పూర్తిస్థాయి అధ్యయనం చేయమని చెప్పడంతో మద్రాస్ ఐఐటీ నిపుణులను తనిఖీలకు పంపాం. వాళ్లతోపాటు పీసీబీ సిబ్బందిని యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశాం.
పర్యావరణాన్ని దెబ్బతీస్తే మానవ జాతికి ఇబ్బంది
ఈ రెండు పరిశ్రమలు ఉన్నచోట మొక్కలు, చెట్లు, నేల, నీరు, గాలి, చుట్టుపక్కల అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దాన్ని ఎంతో కొంత పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్పాం. జరిగిన ఉల్లంఘనల్ని సరిచేసే వరకు ఆ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని చెప్పాం. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని, పరిసర గ్రామాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలని ఇవన్నీ వాతావరణాన్ని పరిరక్షిస్తూ చేయాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పర్యావరణాన్ని దెబ్బతీసి.. పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మానవ జాతి మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆ పరిశ్రమను మూసివేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment