Amara raja batteries
-
2025 కల్లా గిగా ఫ్యాక్టరీ: అమర రాజా బ్యాటరీస్
ముంబై: ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ 2025 ఆఖరు కల్లా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇలాంటి వాటికి అధునాతన టెక్నాలజీ, భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని సంస్థ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల తెలిపారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) నిర్వహించిన ఇండియా బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. తొలి విడత 24 నెలల్లోగానే పూర్తి కాగలదని, దాన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం (2025) ముగిసేలోగా ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని విజయానంద్ పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో గిగా ఫ్యాక్టరీకి కంపెనీ గతేడాది మేలో శంకుస్థాపన చేసింది. ఈ ప్యాక్టరీలో లిథియం సెల్, బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయనుంది. -
అమరరాజాకిచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు పాటించలేదంటూ అమరరాజా బ్యాటరీస్‌కు ఇచ్చిన షోకాజు నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను ఈ మేరకు సవరించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. అమరరాజా తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పదేపదే తనిఖీల పేరిట ఇప్పటివరకు 34 సార్లు నోటీసులు జారీచేశారని చెప్పారు. పిటిషనర్ ప్రతిపక్ష పార్టీ ఎంపీ అని, అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాల జోలికి వెళ్లొద్దని సూచించింది. తనిఖీలు తప్పేంకాదని, షోకాజు నోటీసులకు స్పందించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఐఐటీ–మద్రాస్ ఇచ్చిన నివేదిక కూడా పట్టించుకోలేదని రోహత్గి తెలిపారు. షోకాజు నోటీసులకు స్పందించామని పేర్కొన్నారు. ఏపీపీసీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ణి వాదనలు వినిపిస్తూ.. షోకాజు నోటీసులకు స్పందించారని, అయితే పదేపదే వాయిదాలు కోరారని, అంతకు మించి ఏమీలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించారనిపిస్తే తొలిసారే చర్యలు తీసుకోవాల్సిందని ధర్మాసనం పేర్కొంది. షోకాజు నోటీసుకు స్పందించడానికి పలుసార్లు సమయం ఇచ్చామని నాదకర్ణి తెలిపారు. ఇలా సమయం అడుగుతూనే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు స్టే ఇచ్చి తమ చేతులు కట్టేసిందని చెప్పారు. అనంతరం ధర్మాసనం షోకాజు నోటీసులపై తామెలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి చర్యలు తీసుకునే అధికారం అథారిటీకి ఉందని తెలిపింది. ‘షోకాజు నోటీసులపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తదుపరి చర్యలు తీసుకోవచ్చు. అమరరాజా సంస్థ వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలి. ఆ వాదనలపై మండలి నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఆ నిర్ణయాన్ని నాలుగు వారాలపాటు నిలుపుదల చేయాలి. తదుపరి ఏమైనా ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించుకోవడానికి వాదప్రతివాదులకు స్వేచ్ఛనిస్తున్నాం..’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంటూ పిటిషన్‌పై విచారణను ముగించింది. -
మాకొద్దీ అమరరాజా.. వ్యతిరేకంగా నిరసనలు
-
బ్యాటరీ పరిశ్రమ వద్దేవద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఐటీ, సాఫ్ట్వేర్, అనుబంధ కంపెనీల స్థాపనను స్వాగతిస్తాం గానీ.. బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు’ అని మహబూబ్‌నగర్ ప్రజలు తేల్చి చెప్పారు. పట్టణ సమీపంలోని దివిటిపల్లి ఐటీ కారిడార్ మైదానంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్, పీసీబీ ఈఈ సంగీత హాజరుకాగా.. బాధిత గ్రామాలైన దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్ధాయిపల్లి గ్రామస్తులతోపాటు పర్యావరణ, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. సందిగ్ధత.. అయినా అంగీకరించం దివిటిపల్లి పారిశ్రామికవాడలో బ్యాటరీ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఈ నెల 2న అమర్‌రాజా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.9,500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. అయితే, బ్యాటరీల పరిశ్రమతో జల, వాయు కాలుష్యం వెలువడి.. సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణలో ఆ కంపెనీ పేరు ప్రస్తావించ లేదు. మెకానికల్ బ్యాటరీలు అని గానీ. ఎలక్ట్రానిక్ బ్యాటరీలు అని గానీ స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ అంశాన్ని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు లేవనెత్తారు. బ్యాటరీ తయారీ కంపెనీతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అక్కడి హైకోర్టు కూడా ఆ పరిశ్రమ వద్దని చెప్పిందని, బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని గ్రామస్తులు నినదించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ వద్దు శ్రీసాయి మానస నేచర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రతిపాదిత ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ప్రాజెక్ట్‌ను కూడా గ్రామస్తులు వ్యతిరేకించారు. సర్వే నంబర్ 556, 607లో సేకరించిన 377.65 ఎకరాల్లో రూ.568.49 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీలు, డ్రోన్లు, ఐటీ పార్క్, మొబైల్ఫోన్ల ఉపకరణాలు, చార్జర్లు, డిస్ప్లే, కెమెరాలు తదితరాలను ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించగా వందకు వంద శాతం మంది ఈ క్లస్టర్ ఏర్పాటుపై వ్యతిరేకగళం వినిపించారు. సంతకాల సేకరణ కో సం రిజిస్టర్లో ముందు పేజీలో స్థలం వదిలి సంతకాలు సేకరిస్తుండటంపై పలువురు ప్రశ్నించారు. కాగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన ప్రతీ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఊరు విడిచి వెళ్లాల్సిందే... గతంలో డైయింగ్ ప్లాంట్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ ప్లాంట్‌ను తొలగించాలని ధర్నాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్పందించి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వ్యయం కావడంతో కంపెనీ వాళ్లే మూసేసుకున్నారు. ఆ నీరు తాగి పశువులు, చేపలు మృత్యువాత పడ్డాయి. గర్భిణులు, పిల్లలు దీర్ఘకాలిక రోగాలతో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాటరీ పరిశ్రమ పెడితే మళ్లీ అలాంటి దుస్థితే వస్తుంది. అప్పుడు మేమంతా ఊరు విడిచి వెళ్లాల్సిందే. –హన్మంతు, రైతు, ఎదిర, మహబూబ్‌నగర్ -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అమర రాజా సేల్స్ అదిరాయ్: లాభం రూ. 201 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) 39 శాతం పెరిగింది. రూ. 201 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 144 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 2,264 కోట్ల నుంచి రూ. 2,700 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 2,097 కోట్ల నుంచి రూ. 2,449 కోట్లకు పెరిగాయి. రూ.1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 2.90 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. గురువారం బీఎస్ఈలో సంస్థ షేరు ఒక్క శాతం పెరిగి సుమారు రూ. 520 వద్ద ముగిసింది. -
ఉమ్మడి తనిఖీలకు అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: తమ కంపెనీలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎస్‌పీసీబీ), జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరీ)లకు చెందిన ప్రతినిధులతో ఉమ్మడి తనిఖీలు నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని అమరరాజా బ్యాటరీస్ హైకోర్టుకు నివేదించింది. కాలుష్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, అందువల్ల తనిఖీలకు తాము అభ్యంతరం చెప్పబోమని తెలిపింది. అమరరాజా ప్రతిపాదనపై వైఖరి ఏమిటో తెలపాలని రాష్ట్ర పీసీబీ సభ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై తాజాగా జస్టిస్ శేషసాయి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అమరరాజా బ్యాటరీస్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు ఉమ్మడి తనిఖీల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఉద్యోగుల రక్తంలో సీసం స్థాయిలు పరిమితులకు లోబడే ఉన్నాయన్నారు. రాష్ట్ర పీసీబీ న్యాయవాది సురేందర్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణలో వాదనలు విన్న తరువాత ఉమ్మడి తనిఖీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
‘అమరరాజా’ ఉల్లంఘనలపై వచ్చే విచారణలో ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్‌పై వచ్చిన పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వచ్చే విచారణ సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి ఆ సంస్థ ఉద్యోగుల రక్తనమూనాల పరీక్షల నివేదికను, కౌంటర్‌ను తమ ముందుంచాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.శ్రీ భానుమతిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గతేడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పీసీబీ తరఫు న్యాయవాది వి.సురేందర్‌రెడ్డి స్పందిస్తూ.. అమరరాజా ఉద్యోగుల రక్త నమూనాలపై ఐఐటీ–మద్రాస్ బృందం పరీక్ష చేయాల్సి ఉందన్నారు. అయితే కోవిడ్ కారణంగా అది సాధ్యం కాలేదని చెప్పారు. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించాల్సి వచ్చిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘గత విచారణ సమయంలో నివేదిక ఇస్తామని చెప్పారు. అన్ని వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. ఇంతవరకు వేయలేదు’ అని వ్యాఖ్యానించింది. తనకు కోవిడ్ సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, అందువల్ల నివేదిక తెప్పించుకోవడంలో జాప్యం జరిగిందని సురేందర్‌రెడ్డి విన్నవించారు. అనంతరం అమరరాజా తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో తప్ప ప్రపంచంలో ఏ సంస్థ ద్వారానైనా పరీక్షలకు సిద్ధమన్నారు. ఏపీ ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వచ్చే విచారణలో కేసు పూర్వాపరాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేస్తామంది. -
అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని, డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్‌లో పర్యావరణ కాలుష్యంపై న్యాయస్థానం మరోసారి తీవ్రంగా స్పందించింది. కాసుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తేల్చి చెప్పింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమరరాజా బ్యాటరీస్‌లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తాజాగా జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం, గతంలో అమరరాజా ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య స్థితిపై పీసీబీ సమర్పించిన నివేదికలను పరిశీలించింది. ఆ నివేదికల్లో కార్మికులు, ఉద్యోగుల రక్త నమూనాల్లో సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించింది. ఇదిలాఉంటే ఇదే కేసులో, తమ సంస్థలో ఎలాంటి అధ్యయనం చేయకుండా పీసీబీని నియంత్రించాలని కోరుతూ అమరరాజా బ్యాటరీస్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. -
గల్లా కుటుంబంలోని 12 మంది పై కేసు
-
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
-
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
సాక్షి ప్రతినిధి,తిరుపతి: ‘అమరరాజా’ సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2నెలల కిందట కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతోసహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120బి, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ149 ఐపీసీ ఆర్/డబ్ల్యూ 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, చైర్పర్సన్ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్టు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. -
అమర రాజా పై టీడీపీ అధిక ప్రేమ?
-
కాలుష్యంపైనా ద్వంద్వ ప్రమాణాలా!
కొన్ని వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు విడుదలైన సందర్భంగా ఆ సంస్థను వెంటనే మూసివేయా లని ఏపీ ప్రతిపక్ష టీడీపీ ఎంతగా గగ్గోలు పెట్టిందో అందరికీ తెలిసిందే. కానీ అమర్‌రాజా బ్యాటరీస్ సంస్థకు కాలుష్య నివారణపై నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో... ఉత్పత్తిని ఆపివేయమని ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఆదేశాలిస్తే ఇదే టీడీపీ గగ్గోలు పెడుతోంది. దక్షిణాదిలో ఇతర నగరాల్లోని పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ‘కాలుష్య కాసారం’ పేరుతో గతంలో వరుస కథనాలు దంచిన ఇదే మీడియా... ఇప్పుడు మాత్రం టీడీపీ ఎంపీకి చెందిన పరిశ్రమపై చేయివేస్తే ఊరుకోనంటూ ఎగిరెగిరిపడుతోంది. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అన్నది ప్రశ్న.కొన్ని నెలల క్రితం విశాఖ సమీపంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి కాలుష్యం విడుదల అయిన ఘటనలో పదమూడు మంది మరణించారు. అనేక మంది అస్వస్థతకు గురి అయ్యారు. ఆ సమయంలో ఒక వర్గం మీడియాలో వచ్చిన కథనాలు గుర్తు చేసుకోండి. ఆ సంస్థతో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, అందుకే దానిని మూసివేయడం లేదని ఆరోపించే కథనాలు ఎక్కువగా వచ్చాయి. ఆ కంపెనీ రసాయనాన్ని దక్షిణ కొరియాకు తరలిస్తుంటే కూడా చాలా యాగీ చేశాయి. ప్రతిపక్ష టీడీపీ ఆ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆ సంస్థ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని, ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదని, రకరకాల ఆరోపణలు టీడీపీ నేతలు సాగించారు. సీఎం జగన్ వెంటనే ఎల్జీ పాలిమర్స్ సంస్థ మూసివేతకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, ఆ సంస్థ ఉన్నతాధికారులనూ అరెస్టు చేయించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అది అప్పటి సంగతి. తాజాగా చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా విడుదల అవుతున్న సీసం వంటి కాలుష్య పదార్థాలు ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో వెల్లడైంది. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కాలుష్యమండలి ఆదేశించింది. కానీ సంస్థ యాజమాన్యం స్పందించలేదన్నది అభియోగం. దాంతో మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. దానిపై ఆ సంస్థ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. అదే హైకోర్టు.. కాలుష్య మండలి కాలుష్య నివారణకు చేసిన సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈలోగా అమరరాజా సంస్థ తన కొత్త యూనిట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని వార్తలు. ఇంకేముంది, ఒక పరిశ్రమ వెళ్లిపోతోందని ఆ వర్గం మీడియా గగ్గోలు పెట్టింది. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలన్న ఆలోచన తప్ప, తెలుగుదేశం పార్టీని జాకీలు వేసి లేపాలన్న ఉద్దేశం తప్ప ఇంకో ఆలోచనతో వీరు పనిచేయడం లేదు. మరి అమరరాజా బాటరీస్ సంస్థ ద్వారా కాలుష్యం ఏర్పడుతోందా? లేదా? అనేక మందిని పరీక్షించినప్పుడు ఎక్కువమందిలో ప్రమాదకరమైన సీసం ఉన్నట్లు గుర్తించారా? లేదా? అలా సీసం కారణంగా ఉద్యోగులు, లేదా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఆ సంస్థ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా? లేదా? అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఆ సంస్థపై ఎవరైనా చర్య తీసుకుంటే అది తప్పు అవుతుంది. ఒకవేళ కాలుష్య నియంత్రణ మండలిపై ఏవైనా అనుమానం ఉంటే, వేరే స్వతంత్ర సంస్థతో పరీక్షలు జరిపించి ఆ ఫలితాలను వెల్లడి చేయవచ్చు కదా? ఇలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా ఆ పరిశ్రమవారు వెళ్లిపోతామని బెదిరిస్తే ఏమి చేయాలి? ఈ ఒక్క కంపెనీకి మాత్రమే నోటీసు ఇస్తే ఆలోచించవచ్చు. మరో 54 కంపెనీలకు కూడా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మూసివేయవలసి వస్తుం దని హెచ్చరించిందా? లేదా? అమరరాజా సంస్థ టీడీపీ వారిది కాకపోతే ఒక వర్గం మీడియా ఈ కాలుష్యంపై ఎలాంటి వార్తలు ఇచ్చేది? దేశంలో ఎక్కడైనా కాలుష్య కారక పరిశ్రమలు ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయి. అందుకే కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పాటు అయ్యాయి.1980వ దశకంలో భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ సంస్థ నుంచి వెలువడ్డ విషవాయువులు ఎన్ని వేలమందిని బలిగొన్నది, ఎన్నివేలమంది శారీరకంగా ఎలాంటి రుగ్మతలకు గురైంది ఈ మీడియాకు గుర్తు ఉండాలికదా? అంతదాకా ఎందుకు.. తూర్పు గోదావరి జిల్లాలో ఒక మందుల పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందంటూ టీడీపీనే ఆందోళనకు దిగింది కదా? విశాఖలోని కొన్ని సంస్థలు విడుదల చేసే వాయువుల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంటారో చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలో రొయ్యల పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితం అయి తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. తుందుర్రు అనే గ్రామంలో ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఆందోళనకారులను మహిళలని కూడా చూడకుండా గత ప్రభుత్వం అరెస్టు చేసింది. తమిళనాడులో స్టెరలైట్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఆ పరిశ్రమను మూసివేయాలని న్యాయస్థానమే ఆదేశించింది. అప్పుడు ఈ మీడియా కాని, టీడీపీ వంటి పార్టీలు కాని, ఆ పరిశ్రమను ఎలా మూసివేస్తారని ప్రశ్నించలేదు. ఇక తాజాగా అక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారు? ఇక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారని ఒక మీడియా కథనాలు ఇస్తుంటే, తిరుపతిలో అమరరాజా బ్యాటరీస్ కాలుష్యమే సృష్టించడం లేదంటూ మరో మీడియా ప్రచారం ఆరంభించింది. నిజంగానే రాజకీయ కోణంలోనే అమరరాజాకు ప్రభుత్వం నోటీసులు ఇస్తే ఎవరూ ఒప్పుకోరాదు. అదే సమయంలో ఆ సంస్థలో కాలుష్యం ఉంటే దానిని ఎవరూ సమర్థించరాదు. ఏ పరిశ్రమ అయినా ప్రజలకు ఉపాధి కల్పించాలి. అందుకు ప్రభుత్వాలు సహకరించాలి. కావాలని ఏ పరిశ్రమనూ వేధించరాదు. అలా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తే ప్రభుత్వ నేతలు వెంటనే స్పందించాలి. ఇంతవరకు తప్పు లేదు. కానీ అదే సమయంలో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టాలని కోరడం తప్పు కాదు. 13 వేలమందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోం దని చెబుతున్నారు. మంచిదే. అదే సమయంలో అందుకు రెట్టింపు మంది ఆరోగ్యానికి ముప్పు తెచ్చే విధంగా ఆ సంస్థ వ్యవహరిస్తే ఏమి చేయాలి? దానిని నిరోధించడం ప్రభుత్వ బాధ్యత. గతంలో హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమలు విడుదల చేసిన రసాయనాలతో కూడిన నీరు, వాయువులతో అనేక మంది చర్మవ్యాధులకు గురయ్యేవారు. అప్పట్లో ఈ వర్గం మీడియానే ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా కాలుష్య కాసారం పేరుతో అనేక కథనాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయా కంపెనీలను వేరేచోటుకు తరలించవలసి వచ్చింది. ఆ సంగతిని మర్చిపోకూడదు. ఇప్పుడు అదే మీడియా కాలుష్యాన్ని సమర్థిస్తూ వార్తలు ఎందుకు ఇస్తోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ తాము అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగా చర్యలు చేపడితే మంచిది. లేకుంటే తమిళనాడుకు వారి యూనిట్‌ను తీసుకు వెళ్లినంత మాత్రాన, అక్కడి ప్రభుత్వం ఎలాంటి కాలుష్యాన్ని అయినా భరించడానికి ఒప్పుకుం టుందా? నిజంగానే పరిశ్రమను తరలిస్తే, అక్కడ కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయకుండా ఉండడానికి ఏ రాష్ట్రంలోని ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా? తమిళనాడుకు వందల కోట్లు వ్యయం చేసి తరలించే బదులు కాలుష్య నియంత్రణమండలి చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా. ప్రభుత్వ అధికారులు కూడా ఈ దిశలో ఆ కంపెనీని ఒప్పించే యత్నం చేయాలి. ఎల్.జి. పాలిమర్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉపాధి కల్పిస్తోంది. అయినా అప్పుడు ఆ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేసినవారు, ఇక్కడ మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. కనుక ప్రభుత్వం అయినా, పరిశ్రమ అయినా బాధ్యతగా వ్యవహరించడం అవసరం అని చెప్పక తప్పదు. ఎందుకంటే పరిశ్రమలు ముఖ్యమే. ఉపాధి ముఖ్యమే. అలాగే కాలుష్య నివారణ కూడా అంతకన్నా ముఖ్యం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అమర్ రాజా ఫ్యాక్టరీ కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం
-
అసాధారణ స్థాయిలో అమరరాజా కాలుష్యం
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్ తిరుపతి, చిత్తూరు యూనిట్ల పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆ యూనిట్లు, వాటి పరిసరాల్లో సేకరించిన శాంపిల్స్‌ను పీసీబీ లేబొరేటరీ, హైదరాబాద్‌లోని ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లలో విశ్లేషించగా ఈ విషయాలు బయటపడినట్టు తెలిపారు. అక్కడ వాడిన నీటిని ట్రీట్ చేయకుండా బయటకు వదలడంతో ఆ నీటిని వాడిన పరిసరాల్లోని మొక్కలు, మనుషులు, జంతువుల్లోకి లెడ్ ప్రవేశించే పరిస్థితి నెలకొందన్నారు. డబ్లు్యహెచ్‌వో గుర్తించిన 10 అత్యధిక ప్రమాదకరమైన మెటల్స్‌లో లెడ్ ఒకటని తెలిపారు. -
అమరరాజాపై కక్ష సాధింపుల్లేవు
తిరుపతి మంగళం: అమరరాజా ఫ్యాక్టరీలపై ఎలాంటి కక్ష సాధింపుల్లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరరాజా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలుగుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), హైకోర్టు పలుమార్లు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. అయినా ఫ్యాక్టరీల తీరులో మార్పు రాకపోవడంతో వాటిని మూసివేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అమరరాజా సంస్థల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినా అదే తీర్పు ఇచ్చిందన్నారు. విశాఖలో విషవాయువు వెలువడుతున్న ఓ ఫ్యాక్టరీని మూసివేసినట్లు ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని 66 పరిశ్రమలకు నోటీసులిచ్చామని తెలిపారు. కొన్ని పత్రికలు, చానళ్లు మాత్రం కక్షసాధింపుతో అమరరాజా ఫ్యాక్టరీలు పక్కరాష్ట్రాలకు తరలిపోయేలా ప్రభుత్వం చేస్తోందని చెప్పడం దారుణమన్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. టీడీపీ పోతూపోతూ రాష్ట్రాన్ని ఎంతగా నష్టాల్లోకి నెట్టేసిందో అందరికీ తెలుసన్నారు. అప్పులు చెల్లించాలని ఆర్బీఐ నుంచి హెచ్చరికలు వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్‌తో రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో నష్టం జరిగినప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు ఏవీ ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -
అమరరాజాను తరలించాలని మేమే చెప్పాం
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్‌ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రీతిలో వాతావరణం దెబ్బతినడమేకాక అక్కడి చెరువులు ప్రమాదకరంగా మారాయని, మనుషుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై హైకోర్టులో తాము పిటిషన్ వేశామని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌ను తరలించాలని తాము చెప్పగా.. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పరిశ్రమ వేరే ప్రాంతానికి తరలిపోతోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం అవాస్తవమని స్పష్టం చేశారు. అవాస్తవాలు రాసిన ఆ పత్రికకు లీగల్ నోటీసు ఇస్తామని, పరువు నష్టం దావా వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి విజయకుమార్ ఇంకా ఏం చెప్పారంటే.. గడువు ఇచ్చినా కాలుష్యాన్ని నియంత్రించ లేదు రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ప్రతినెలా చేస్తున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా 54 పరిశ్రమల్లో తనిఖీలు చేశాం. వాటిలో కాలుష్యం ఎక్కువగా వస్తుందని గమనించి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వాటిని సరిచేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా కొంత సమయం అడిగింది. అందుకు 2 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఉల్లంఘనలు ఎంతవరకు సరయ్యాయో తెలుసుకునేందుకు మళ్లీ తనిఖీ చేశాం. అప్పుడు కూడా సరికాకపోవడంతో మళ్లీ నోటీసు ఇచ్చాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఉత్పత్తిని నిలిపివేసి, తప్పుల్ని సరి చేసుకున్నాక మళ్లీ పునఃప్రారంభం చేసుకునేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆ నోటీసు ఇచ్చాం. దీనిపై వారి వాదన వినిపించేందుకు రెండుసార్లు (లీగల్ హియరింగ్)కు అవకాశం ఇచ్చాం. అమరరాజా బ్యాటరీస్ చిత్తూరు, తిరుపతి యూనిట్ల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే అందులో పనిచేసే కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం మరింత పెరిగి, అక్కడి వారి ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించాం. ఏలూరులో ఇలాంటి పరిస్థితిలోనే లెడ్, నికెల్ లెవెల్స్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడిన విషయాన్ని గుర్తు చేశాం. అలాంటి వైపరీత్యాలు వస్తున్న క్రమంలో కాలుష్యాన్ని నియంత్రిస్తే తప్ప పరిశ్రమను నడిపించడానికి వీల్లేదని క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. ఈ విధంగా ఈ ఏడాది 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని, 50 పరిశ్రమలను మూసివేయాలని క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చాం. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునే వరకు మూసివేసి, నియంత్రణ చర్యలు తీసుకున్నాక ఉత్పత్తి చేసుకోవాలని చెప్పాం. క్లోజర్ ఆర్డర్ ఇచ్చాక అమరరాజా బ్యాటరీస్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు 4 వారాలపాటు స్టే ఇచ్చింది. ఈలోపు ఓ బృందాన్ని నియమించి పూర్తిస్థాయి తనిఖీలు చేసి ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఒక సాంకేతిక టీమ్‌ని నియమించి అక్కడికి పంపి హైకోర్టుకు నివేదిక సమర్పించాం. ఉద్యోగుల రక్తంలోనూ సీసం చేరింది అమరరాజా ప్లాంట్ వద్ద వాడే నీటిని పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించాలి. కానీ లెడ్ (సీసం)తో కలిసిన నీటిని నేరుగా మొక్కలు, ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఏవిధమైన ఏటీపీ (ఎఫిలియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) చేయకుండా నేరుగా లెడ్ కలిసిన నీటిని ఎస్టీపీకి వదిలేశారు. ఆ నీరు మల్లెమడుగు, గొల్లపల్లి, నాయుడు చెరువుల్లో కలిసింది. కొండపక్కనే ఉండటం వల్ల ఈ నీటితోపాటు వర్షం వచ్చినప్పుడు ప్లాంట్ నీరు చెరువుల్లో కలిసింది. మల్లెమడుగులో కేజీకి 134.79 మిల్లీగ్రాముల లెడ్ ఉంది. గొల్లపల్లిలో 319 మిల్లీగ్రాములు, నాయుడు చెరువులో అయితే 3,159 మిల్లీగ్రాములు ఉంది. ఈ నీరు తాగిన జంతువుల్లోకి లెడ్ వెళుతోంది. అక్కడి మొక్కల్లోకి వెళ్లి వాటినుంచి కూరగాయల ద్వారా మనుషుల శరీంలోకి లెడ్ వెళుతోంది. సాధారణంగా ఒక పరిశ్రమలో కాలుష్యం వస్తే అందులో పనిచేసే ఉద్యోగులు, లోపల, పరిసరాల్లో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఇక్కడ 4, 5 కిలోమీటర్ల భూమి, నీటిలో లెడ్ ప్రవేశించింది. భూమి, నీరు, ఇతర రకరకాల శాంపిల్స్‌ని విశ్లేషించాం. ప్రతిచోటా రెండు చొప్పున శాంపిల్స్‌ని సేకరించి ఒకటి పీసీబీ లేబొరేటరీలో, మరొక శాంపిల్‌ని హైదరాబాద్‌లో ఉన్న స్వతంత్య్ర సంస్థ ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)కి పంపించాం. ఈ రెండు నివేదికలను హైకోర్టుకు సమర్పించాం. పరిశ్రమ మెయిన్ గేటు దగ్గర ఉన్న బోర్ వెల్ శ్యాంపిల్ తీసుకుని ఈపీటీఆర్ఐకి పంపితే అందులో లీటర్‌కి 0.08 మైక్రో గ్రాముల లెడ్ ఉంది. వాస్తవానికి ఇది 0.01కి మించి ఉండకూడదు. ఎల్వీఆర్ఎల్ఏ స్టోర్స్ అనేచోట తీసుకున్న శాంపిల్‌లో 200 శాతం ఎక్కువ లెడ్ ఉంది., మల్లెమడుగు రిజర్వాయర్ దగ్గర లీటర్‌కి 0.3 మైక్రో గ్రాములు లెడ్ ఉంది. పరిశ్రమకు దగ్గరున్న గొల్లపల్లి చెరువులో 500 శాతం, కరకంబాడీ చెరువులో 90 శాతం, నాయుడుచెరువులో 1,200 శాతం ఎక్కువ లెడ్ ఉంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల బ్లడ్ శాంపిల్స్‌ను బెంగళూరులోని ఒక లేబొరేటరీకి పంపించాం. 12 శాతం శాంపిల్స్‌లో బ్లడ్ లెవెల్స్ డెసిలేటర్‌కి 42 మైక్రో గ్రాములు ఉంది. ఇది అత్యధికంగా 10 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. 450 మంది ఉద్యోగుల శరీరంలో పరిమితిని దాటిపోయి లెడ్ ఉంది. ఈ ఉద్యోగులను లెడ్ రాని ఏరియాలో పనిచేయించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు పూర్తిస్థాయి అధ్యయనం చేయమని చెప్పడంతో మద్రాస్ ఐఐటీ నిపుణులను తనిఖీలకు పంపాం. వాళ్లతోపాటు పీసీబీ సిబ్బందిని యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. పర్యావరణాన్ని దెబ్బతీస్తే మానవ జాతికి ఇబ్బంది ఈ రెండు పరిశ్రమలు ఉన్నచోట మొక్కలు, చెట్లు, నేల, నీరు, గాలి, చుట్టుపక్కల అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. దాన్ని ఎంతో కొంత పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్పాం. జరిగిన ఉల్లంఘనల్ని సరిచేసే వరకు ఆ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని చెప్పాం. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని, పరిసర గ్రామాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలని ఇవన్నీ వాతావరణాన్ని పరిరక్షిస్తూ చేయాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. పర్యావరణాన్ని దెబ్బతీసి.. పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మానవ జాతి మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆ పరిశ్రమను మూసివేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం. -
పీసీబీ తనిఖీలను అడ్డుకోవద్దు
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఉందని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. పీసీబీ తనిఖీలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం చేయొద్దని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యాన్ని ఆదేశించింది. తనిఖీలకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. అలాగే తనిఖీలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని పీసీబీని కోరింది. తనిఖీలకు వెళ్లే ముందు అమరరాజా బ్యాటరీస్‌కు నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆ సంస్థ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. తనిఖీలను అడ్డుకుంటోంది.. పీసీబీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐఐటీ నిపుణులతో కూడిన బృందం తనిఖీలకు వెళ్తే వారిని అమరరాజా బ్యాటరీస్ తన ప్రాంగణంలోకి అనుమతించడం లేదని తెలిపారు. తనిఖీలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తోందని వివరించారు. ఈ కంపెనీ టీడీపీ ఎంపీదని.. అందువల్ల ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ఐఐటీ నిపుణులతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కంపెనీ ఉద్యోగుల రక్తంలో సీసం ఆనవాళ్లు ఉన్నాయని, పూర్తి వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత పీసీబీపై ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. తనిఖీలు చేపట్టకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అమరరాజా యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఆ సంస్థ తరఫు న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ.. పీసీబీకి సంబంధం లేని థర్డ్ పార్టీ వారిని మాత్రమే అనుమతించడం లేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 8 మంది ఉద్యోగులను సీసం రహిత ప్రాంతానికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. పీసీబీ వెంట ఉన్నది ఐఐటీ నిపుణులే తప్ప థర్డ్‌పార్టీ కాదని మోహన్‌రెడ్డి చెప్పారు. నిపుణుల సాయం తీసుకునే అధికారం పీసీబీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘అమర్‌రాజా’లో ప్రమాదకర స్థాయిలో లెడ్
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర స్థాయిలో లెడ్ కాలుష్యం వెలువడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికుల రక్తంలోనూ లెడ్ శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని వెల్లడించింది. గాలి, నీరు, భూమిలో కూడా లెడ్ శాతం ప్రమాదకరస్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసివేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. అమర్‌రాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ కాలుష్య నివేదికలు సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. నివేదికలోని అంశాలను తాము సమగ్రంగా పరిశీలించామని స్పష్టం చేసింది. -
‘లెడ్ స్థాయిని తగ్గించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి’
సాక్షి, అమరావతి: అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీలో లెడ్ స్థాయిని తగ్గించేలా వెంటనే యాజమాన్యం చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీలో కాలుష్యం, పీసీబీ ఆదేశాలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదకరస్థాయిలో లెడ్ ఉందని పేర్కొంది. గాలిలో, నీటిలో, భూమిలో లెడ్ ఉందని, దాన్ని తగ్గించకపోతే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తేల్చిచెప్పింది. -
అమర రాజా బ్యాటరీస్ మూసివేతకు ఆదేశం
సాక్షి, అమరావతి: కాలుష్య కాసారాలుగా మారుతున్న పరిశ్రమలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ (ఏపీ పీసీబీ) మండలి కొరడా ఝళిపిస్తోంది. వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లపల్లి మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న జువారి సిమెంట్ పరిశ్రమ మూసివేతకు గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి.. తాజాగా అమర రాజా బ్యాటరీస్‌కు చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చింది. అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో లోపాలను సరిదిద్దుకోవాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఆ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దాంతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న రెండు పరిశ్రమలనూ మూసివేయాలంటూ ఏపీ పీసీబీ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తనిఖీల్లో వెల్లడైన లోపాలను సరిదిద్దుకుని కాలుష్య ఉద్గారాలకు యాజమాన్యాలు అడ్డుకట్ట వేయగలిగేలా చర్యలు తీసుకుంటే ఈ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తారు. గాలి, నేల, నీరు కాలుష్యమే.. అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో ఫిబ్రవరి 25, 26, మార్చి 8, 9, 25, 26 తేదీల్లో ఏపీ పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతి జారీ చేసినప్పుడు పేర్కొన్న ప్రమాణాలతో పోలిస్తే వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు తేలింది. క్యూబిక్ మీటర్ వాయువు(గాలి)కి నిబంధనల మేరకు లెడ్ (సీసం) 1 మైక్రో గ్రాము ఉండాలి. కానీ.. ట్యాబులర్ బ్యాటరీస్ ఉత్పత్తి చేసే విభాగంలో 1.151, ఆటోమొబైల్ బ్యాటరీస్ విభాగంలో 22.2 మైక్రో గ్రాములు ఉన్నట్టు తేలడంతో పర్యావరణ అనుమతిలో పేర్కొన్న నిబంధనలను అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఉల్లంఘించినట్టు ఏపీ పీసీబీ అధికారులు తేల్చారు. పరిశ్రమ అవసరాల కోసం రోజూ వినియోగించే నీటి ద్వారా వచ్చే 2,186 కిలో లీటర్ల వ్యర్థ జలాలను సక్రమంగా శుద్ధి చేయకుండానే గ్రీన్ బెల్ట్‌లో పెంచుతున్న మొక్కలకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. గ్రీన్ బెల్ట్‌లోని పలుచోట్ల మార్చి 9న మట్టి నమానాలను సేకరించిన ఏపీ పీసీబీ అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక కిలో మట్టిలో కనిష్టంగా 49.2 నుంచి గరిష్టంగా 177.5 మిల్లీగ్రాముల సీసం ఉండాలి. కానీ 295.5 మిల్లీ గ్రాముల సీసీం ఉన్నట్టు తేలింది. ఉద్యోగులు, ప్రజల రక్తంలోనూ సీసం పరిశ్రమలో పనిచేసే 3,533 మంది ఉద్యోగుల రక్త నమూనాలను సేకరించిన తనిఖీ బృందం వాటిని పరీక్షించింది. రక్త నమూనాల్లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు వెల్లడైంది. పరిశ్రమ పరిసర గ్రామాల్లోని ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాల్లోనూ సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు రూఢీ అయింది. దీంతో ఏప్రిల్ 6న అమర రాజా బ్యాటరీస్ సంస్థకు ఏపీ పీసీబీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఏప్రిల్ 20న అమర రాజా సంస్థ సమాధానం ఇచ్చింది. దీనిపై ఏప్రిల్ 22న ఎక్సటర్నల్ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) సమావేశమై సమగ్రంగా చర్చించింది. పర్యావరణ అనుమతిని ఉల్లంఘించిన అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ పీసీబీకి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నూనెగుండ్లపల్లి, కరకంబాడి వద్ద గల రెండు పరిశ్రమలనూ మూసివేయాలని పేర్కొంటూ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: అమరరాజా ‘ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని చర్యలూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సైన్యం, ఆస్పత్రులు, టెలికాం రంగాలకు బ్యాటరీల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కంపెనీ ముందు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. కోవిడ్ విపత్తు వేళ సున్నిత రంగాలకు సరఫరా దెబ్బతినకుండా అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు అమర రాజా సుదీర్ఘకాలంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు అవార్డులను కూడా సాధించింది. మేం తీసుకుంటున్న అన్ని చర్యల్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు వివరించాం’ అని అమర రాజా సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
అమరరాజా మధ్యంతర డివిడెండు 200 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమరరాజా బ్యాటరీస్ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.127 కోట్ల నుంచి రూ.120 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,440 కోట్ల నుంచి రూ.1,767 కోట్లకు ఎగసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది. డిసెంబరు 9 లోగా ఈ మొత్తాన్ని చెల్లించనుంది. రూ.540 కోట్ల మూలధన వ్యయానికి బోర్డు సమ్మతించింది. ఈ మొత్తాన్ని అడ్వాన్స్డ్ స్టాంపెడ్ గ్రిడ్ టెక్నాలజీ, టూ వీలర్ బ్యాటరీ ప్లాంటులో రెండవ పంచింగ్ లైన్, ఎంవీఆర్‌ఎల్‌ఏ ప్లాంటు విస్తరణకు వెచ్చి స్తారు. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 1.06 శాతం తగ్గి రూ.771.80 వద్ద స్థిరపడింది. -
అమర్‌రాజా ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
అమర్‌రాజా ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పూతలపట్టు మండలం పేటమిట్టలోని అమర్‌రాజా బ్యాటరీ ప్లాంట్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.