
సాక్షి, అమరావతి: తమ కంపెనీలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎస్‌పీసీబీ), జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరీ)లకు చెందిన ప్రతినిధులతో ఉమ్మడి తనిఖీలు నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని అమరరాజా బ్యాటరీస్ హైకోర్టుకు నివేదించింది. కాలుష్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, అందువల్ల తనిఖీలకు తాము అభ్యంతరం చెప్పబోమని తెలిపింది.
అమరరాజా ప్రతిపాదనపై వైఖరి ఏమిటో తెలపాలని రాష్ట్ర పీసీబీ సభ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై తాజాగా జస్టిస్ శేషసాయి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా అమరరాజా బ్యాటరీస్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు ఉమ్మడి తనిఖీల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఉద్యోగుల రక్తంలో సీసం స్థాయిలు పరిమితులకు లోబడే ఉన్నాయన్నారు. రాష్ట్ర పీసీబీ న్యాయవాది సురేందర్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణలో వాదనలు విన్న తరువాత ఉమ్మడి తనిఖీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment