సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్‌పై వచ్చిన పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వచ్చే విచారణ సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి ఆ సంస్థ ఉద్యోగుల రక్తనమూనాల పరీక్షల నివేదికను, కౌంటర్‌ను తమ ముందుంచాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.శ్రీ భానుమతిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గతేడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పీసీబీ తరఫు న్యాయవాది వి.సురేందర్‌రెడ్డి స్పందిస్తూ.. అమరరాజా ఉద్యోగుల రక్త నమూనాలపై ఐఐటీ–మద్రాస్ బృందం పరీక్ష చేయాల్సి ఉందన్నారు. అయితే కోవిడ్ కారణంగా అది సాధ్యం కాలేదని చెప్పారు. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించాల్సి వచ్చిందని తెలిపారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ‘గత విచారణ సమయంలో నివేదిక ఇస్తామని చెప్పారు. అన్ని వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. ఇంతవరకు వేయలేదు’ అని వ్యాఖ్యానించింది. తనకు కోవిడ్ సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, అందువల్ల నివేదిక తెప్పించుకోవడంలో జాప్యం జరిగిందని సురేందర్‌రెడ్డి విన్నవించారు. అనంతరం అమరరాజా తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో తప్ప ప్రపంచంలో ఏ సంస్థ ద్వారానైనా పరీక్షలకు సిద్ధమన్నారు. ఏపీ ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వచ్చే విచారణలో కేసు పూర్వాపరాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేస్తామంది.
‘అమరరాజా’ ఉల్లంఘనలపై వచ్చే విచారణలో ఉత్తర్వులు
Published Wed, Jan 26 2022 3:50 AM | Last Updated on Wed, Jan 26 2022 3:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment