కొన్ని వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఎల్‌జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు విడుదలైన సందర్భంగా ఆ సంస్థను వెంటనే మూసివేయా లని ఏపీ ప్రతిపక్ష టీడీపీ ఎంతగా గగ్గోలు పెట్టిందో అందరికీ తెలిసిందే. కానీ అమర్‌రాజా బ్యాటరీస్ సంస్థకు కాలుష్య నివారణపై నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో... ఉత్పత్తిని ఆపివేయమని ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఆదేశాలిస్తే ఇదే టీడీపీ గగ్గోలు పెడుతోంది. దక్షిణాదిలో ఇతర నగరాల్లోని పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా ‘కాలుష్య కాసారం’ పేరుతో గతంలో వరుస కథనాలు దంచిన ఇదే మీడియా... ఇప్పుడు మాత్రం టీడీపీ ఎంపీకి చెందిన పరిశ్రమపై చేయివేస్తే ఊరుకోనంటూ ఎగిరెగిరిపడుతోంది. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అన్నది ప్రశ్న.కొన్ని నెలల క్రితం విశాఖ సమీపంలో ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ నుంచి కాలుష్యం విడుదల అయిన ఘటనలో పదమూడు మంది మరణించారు. అనేక మంది అస్వస్థతకు గురి అయ్యారు. ఆ సమయంలో ఒక వర్గం మీడియాలో వచ్చిన కథనాలు గుర్తు చేసుకోండి. ఆ సంస్థతో వైఎస్సార్‌సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, అందుకే దానిని మూసివేయడం లేదని ఆరోపించే కథనాలు ఎక్కువగా వచ్చాయి. ఆ కంపెనీ రసాయనాన్ని దక్షిణ కొరియాకు తరలిస్తుంటే కూడా చాలా యాగీ చేశాయి. ప్రతిపక్ష టీడీపీ ఆ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేసింది. ఆ సంస్థ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని, ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదని, రకరకాల ఆరోపణలు టీడీపీ నేతలు సాగించారు. సీఎం జగన్ వెంటనే ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ మూసివేతకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, ఆ సంస్థ ఉన్నతాధికారులనూ అరెస్టు చేయించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అది అప్పటి సంగతి.
తాజాగా చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ ద్వారా విడుదల అవుతున్న సీసం వంటి కాలుష్య పదార్థాలు ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో వెల్లడైంది. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కాలుష్యమండలి ఆదేశించింది. కానీ సంస్థ యాజమాన్యం స్పందించలేదన్నది అభియోగం. దాంతో మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది. దానిపై ఆ సంస్థ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. అదే హైకోర్టు.. కాలుష్య మండలి కాలుష్య నివారణకు చేసిన సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈలోగా అమరరాజా సంస్థ తన కొత్త యూనిట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని వార్తలు. ఇంకేముంది, ఒక పరిశ్రమ వెళ్లిపోతోందని ఆ వర్గం మీడియా గగ్గోలు పెట్టింది.
ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలన్న ఆలోచన తప్ప, తెలుగుదేశం పార్టీని జాకీలు వేసి లేపాలన్న ఉద్దేశం తప్ప ఇంకో ఆలోచనతో వీరు పనిచేయడం లేదు. మరి అమరరాజా బాటరీస్ సంస్థ ద్వారా కాలుష్యం ఏర్పడుతోందా? లేదా? అనేక మందిని పరీక్షించినప్పుడు ఎక్కువమందిలో ప్రమాదకరమైన సీసం ఉన్నట్లు గుర్తించారా? లేదా? అలా సీసం కారణంగా ఉద్యోగులు, లేదా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఆ సంస్థ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా? లేదా? అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఆ సంస్థపై ఎవరైనా చర్య తీసుకుంటే అది తప్పు అవుతుంది. ఒకవేళ కాలుష్య నియంత్రణ మండలిపై ఏవైనా అనుమానం ఉంటే, వేరే స్వతంత్ర సంస్థతో పరీక్షలు జరిపించి ఆ ఫలితాలను వెల్లడి చేయవచ్చు కదా?
ఇలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా ఆ పరిశ్రమవారు వెళ్లిపోతామని బెదిరిస్తే ఏమి చేయాలి? ఈ ఒక్క కంపెనీకి మాత్రమే నోటీసు ఇస్తే ఆలోచించవచ్చు. మరో 54 కంపెనీలకు కూడా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మూసివేయవలసి వస్తుం దని హెచ్చరించిందా? లేదా? అమరరాజా సంస్థ టీడీపీ వారిది కాకపోతే ఒక వర్గం మీడియా ఈ కాలుష్యంపై ఎలాంటి వార్తలు ఇచ్చేది? దేశంలో ఎక్కడైనా కాలుష్య కారక పరిశ్రమలు ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయి. అందుకే కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పాటు అయ్యాయి.1980వ దశకంలో భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ సంస్థ నుంచి వెలువడ్డ విషవాయువులు ఎన్ని వేలమందిని బలిగొన్నది, ఎన్నివేలమంది శారీరకంగా ఎలాంటి రుగ్మతలకు గురైంది ఈ మీడియాకు గుర్తు ఉండాలికదా?
అంతదాకా ఎందుకు.. తూర్పు గోదావరి జిల్లాలో ఒక మందుల పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందంటూ టీడీపీనే ఆందోళనకు దిగింది కదా? విశాఖలోని కొన్ని సంస్థలు విడుదల చేసే వాయువుల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుంటారో చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలో రొయ్యల పరిశ్రమల వల్ల భూగర్భ జలాలన్నీ కలుషితం అయి తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఏర్పడింది. తుందుర్రు అనే గ్రామంలో ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఆందోళనకారులను మహిళలని కూడా చూడకుండా గత ప్రభుత్వం అరెస్టు చేసింది.
తమిళనాడులో స్టెరలైట్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఆ పరిశ్రమను మూసివేయాలని న్యాయస్థానమే ఆదేశించింది. అప్పుడు ఈ మీడియా కాని, టీడీపీ వంటి పార్టీలు కాని, ఆ పరిశ్రమను ఎలా మూసివేస్తారని ప్రశ్నించలేదు. ఇక తాజాగా అక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారు? ఇక్కడి కాలుష్యాన్ని ఏమి చేస్తారని ఒక మీడియా కథనాలు ఇస్తుంటే, తిరుపతిలో అమరరాజా బ్యాటరీస్ కాలుష్యమే సృష్టించడం లేదంటూ మరో మీడియా ప్రచారం ఆరంభించింది.
నిజంగానే రాజకీయ కోణంలోనే అమరరాజాకు ప్రభుత్వం నోటీసులు ఇస్తే ఎవరూ ఒప్పుకోరాదు. అదే సమయంలో ఆ సంస్థలో కాలుష్యం ఉంటే దానిని ఎవరూ సమర్థించరాదు. ఏ పరిశ్రమ అయినా ప్రజలకు ఉపాధి కల్పించాలి. అందుకు ప్రభుత్వాలు సహకరించాలి. కావాలని ఏ పరిశ్రమనూ వేధించరాదు. అలా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తే ప్రభుత్వ నేతలు వెంటనే స్పందించాలి. ఇంతవరకు తప్పు లేదు. కానీ అదే సమయంలో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టాలని కోరడం తప్పు కాదు. 13 వేలమందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోం దని చెబుతున్నారు. మంచిదే. అదే సమయంలో అందుకు రెట్టింపు మంది ఆరోగ్యానికి ముప్పు తెచ్చే విధంగా ఆ సంస్థ వ్యవహరిస్తే ఏమి చేయాలి? దానిని నిరోధించడం ప్రభుత్వ బాధ్యత.
గతంలో హైదరాబాద్ సమీపంలోని పటాన్‌చెరు ప్రాంతంలో పరిశ్రమలు విడుదల చేసిన రసాయనాలతో కూడిన నీరు, వాయువులతో అనేక మంది చర్మవ్యాధులకు గురయ్యేవారు. అప్పట్లో ఈ వర్గం మీడియానే ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా కాలుష్య కాసారం పేరుతో అనేక కథనాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయా కంపెనీలను వేరేచోటుకు తరలించవలసి వచ్చింది. ఆ సంగతిని మర్చిపోకూడదు. ఇప్పుడు అదే మీడియా కాలుష్యాన్ని సమర్థిస్తూ వార్తలు ఎందుకు ఇస్తోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మాట్లాడుతూ తాము అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగా చర్యలు చేపడితే మంచిది. లేకుంటే తమిళనాడుకు వారి యూనిట్‌ను తీసుకు వెళ్లినంత మాత్రాన, అక్కడి ప్రభుత్వం ఎలాంటి కాలుష్యాన్ని అయినా భరించడానికి ఒప్పుకుం టుందా? నిజంగానే పరిశ్రమను తరలిస్తే, అక్కడ కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయకుండా ఉండడానికి ఏ రాష్ట్రంలోని ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?
తమిళనాడుకు వందల కోట్లు వ్యయం చేసి తరలించే బదులు కాలుష్య నియంత్రణమండలి చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా. ప్రభుత్వ అధికారులు కూడా ఈ దిశలో ఆ కంపెనీని ఒప్పించే యత్నం చేయాలి. ఎల్.జి. పాలిమర్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉపాధి కల్పిస్తోంది. అయినా అప్పుడు ఆ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేసినవారు, ఇక్కడ మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు. ఇది రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. కనుక ప్రభుత్వం అయినా, పరిశ్రమ అయినా బాధ్యతగా వ్యవహరించడం అవసరం అని చెప్పక తప్పదు. ఎందుకంటే పరిశ్రమలు ముఖ్యమే. ఉపాధి ముఖ్యమే. అలాగే కాలుష్య నివారణ కూడా అంతకన్నా ముఖ్యం.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కాలుష్యంపైనా ద్వంద్వ ప్రమాణాలా!
Published Wed, Aug 11 2021 12:19 AM | Last Updated on Wed, Aug 11 2021 12:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment