![అవినీతిమయంగా కాలుష్య నియంత్రణ బోర్డు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81406832849_625x300.jpg.webp?itok=BUWRAE3g)
అవినీతిమయంగా కాలుష్య నియంత్రణ బోర్డు
- అవినీతిమయంగా కాలుష్య నియంత్రణ బోర్డు
- కాసులిస్తేనే పని, లేదంటే షోకాజ్ నోటీసులతో సంస్థలపై కన్నెర్ర
- భారీ పీసీబీ అవినీతి తిమింగలంతో అక్రమాల బట్టబయలు
- కోరుకొండ రమేష్ అక్రమాస్తులపై అధికారుల్లో విస్మయం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కాలుష్య నియంత్రణ బోర్డు అవినీతికి అడస్‌గా మారింది. పరిశ్రమలను తనిఖీ చేయడం, నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసు కోవడం,షోకాజ్ నోటీసులివ్వాల్సిన కొందరు ఉన్నతాధికారులు కంపెనీల యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారు. అడ్డగోలు ఆదాయంతో నోట్ల మేడలు కడుతున్నారు. జిల్లా, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ బోర్డు పనితీరుపై ఎప్పటినుంచో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా ఆ విభాగం ఉన్నతాధికారి కోరుకొండ రమేష్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డంతో ఆశాఖలో పేరుకుపోయిన అవినీతి కాలుష్యం బట్టబయలవుతోంది. ఈ వ్యవహారం ఈ ఏడాదిలోనే అతిపెద్ద అక్రమార్జన కావడం విశేషం.
కాసులిస్తే కాలుష్యం లేనట్లే : కాలు ష్య నియంత్రణ బోర్డు అక్రమాలకు అలవాలంగా మారింది. జిల్లా అధికారి కార్యాలయంతోపాటు ప్రాంతీయ అధికారి కూడా ఇక్కడే ఉంటారు. వీరంతా కీలకమైన ఉక్కు,రసాయనాలు,ఎరువులు,చక్కెర కర్మాగారాలు,ఫుడ్‌ప్రాసెసింగ్,మత్స్య ఉత్పత్తుల పరిశ్రమలు,ఫెర్రో అల్లాయిస్,హోటళ్లు,హాస్పిటల్స్ ఇలా అన్ని విభాగాల్లో తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. రమేష్ అ యిదుజిల్లాల పరిధిలో విధులు నిర్వర్తించాలి. వీళ్లంతా నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలను గుర్తించి షోకాజ్ నోటీసులిచ్చి కాలుష్య నియంత్రణ చేపట్టాలి.
రమేష్‌తోపాటు మరి కొందరు ఆశాఖలో ఈ నిబంధనలకు ఎప్పుడో చెల్లుచీటి రాసేశారు. కొత్తగా పరిశ్రమ పెట్టడానికి వచ్చే కంపెనీలకు కాలుష్యబోర్డు నుంచి నిరభ్యంతర పత్రం దగ్గర నుంచి, కొత్తగా విస్తరణకు వెళ్లే పరిశ్రమల వరకు కనీసం క్షేత్రస్థాయి తనిఖీలకు ఇక్కడ అధికారులు వెళ్లడం లేదు. నగరంతోపాటు చుట్టుపక్క చమురు, రసాయనాలు,ఆయిల్, ఫార్మా,పోర్టుల వంటి 90 రకాల పరిశ్రమలున్నాయి. వీటినుంచి దుమ్ము, ధూళితోపాటు భయంకరమైన రసాయనాలు వెలువడుతూ జనానికి కంటిపై కునుకులేకుండా బెంబేలెత్తుతున్నాయి. అయినా ఏనాడు కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టిందిలేదు.
గడచిన కొన్నేళ్లలో కాలుష్యం తీవ్రత సాకుతో ఏ కంపెనీనికూడా సీజ్ చేసింది లేదంటే అధికారుల పనితీరు ఎంత నాసిరకంగా ఉందో అర్థమవుతుంది. బడా కంపెనీలతో సదరు రమేష్‌తోపాటు ఇతర జిల్లాస్థాయి అధికారులు సైతం నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ వాటి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్న విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగడంతో అవినీతి కాలుష్యం బట్టబయలవుతోంది. తాజా దాడులతో ఈశాఖలో క్షేత్రస్థాయి,ఇతర ఉన్నతాధికారులు ఏక్షణంలో తమపై దాడులు జరుగుతాయోనని వణికిపోతున్నారు.