అడ్డగోలు ఆర్డీవోపై కొరడా | Suspension Action On Corruption RDO | Sakshi
Sakshi News home page

అడ్డగోలు ఆర్డీవోపై కొరడా

Published Thu, Mar 15 2018 10:39 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Suspension Action On Corruption RDO - Sakshi

ఆర్డీవో వెంకటేశ్వర్లు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ మాజీ రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లుపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది.ఆర్‌వోఆర్, ఇనాం, ఏపీ భూ అధీకరణ చట్టాల కింద ఆయన జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం నిగ్గుతేల్చింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రైవేటు పార్టీలకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేసేందుకు వీలుగా ఆయన పలు ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవలే ఆయనను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తన నివేదికలో చేసిన అభియోగాలన్నీ వాస్తవాలేనని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.

విశాఖ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఇనాం, ఆర్‌వోఆర్, ఏపీ భూ అధీకరణ చట్టాల కింద జారీ చేసిన పలు ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. ఈ అడ్డగోలు ఉత్తర్వులలో లొసుగుల్ని ‘సాక్షి’ అనేక సందర్భాలలో వెలుగులోకి తేవడం సంచలనమైంది. ‘సాక్షి’ బట్టబయలు చేసిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల ఉదంతాల వెనుక ఆర్డీవో హస్తం కూడా ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. మధురవాడ, కొమ్మాది, పీఎం పాలెం, పరదేశి పాలెం వంటి ప్రాంతాలతో పాటు విశాఖ రూరల్, భీమిలి, ఆనందపురం, పెందుర్తి తదితర ప్రాంతాల్లో జరిగిన భూకబ్జాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులే ఈ అక్రమాలకు కారణమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తులో కూడా ఆర్డీవో పాల్పడిన పలు అక్రమాలు వెలుగు చూశాయి. ‘సాక్షి’ కథనాల నేపథ్యంలో సుమారు తొమ్మిది భూ వివాదాల్లో అప్పిలేట్‌ అథారిటీగా ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సిట్‌ సైతం నిగ్గు తేల్చింది. ఆర్డీవోపై సస్పెన్షన్‌ వేటు వేయాలని, పలుకేసుల్లో ఆయనపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిట్‌ సిఫార్సుల్లో ఉన్నట్టుగా తెలియవచ్చింది.

జేసీ నిర్దేశం
సిట్‌ నివేదిక సమర్పించిన తర్వాత కూడా కోరాడ సీలింగ్‌ భూముల స్వాధీనం వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామంపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.సృజన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో ఆరురోజుల్లోనే తుది ఉత్తర్వులు జారీచేయడం, పైగా ఆనందపురం మండలం వేములవలసలో సర్వే నెం.329లోని 11.14 ఎకరాలకు బదులుగా రావికమతం మండలం బాదనపాడు గ్రామంలో సర్వే నెం.40లో కోరాడ కుటుంబీకులు కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో ఆదేశాలు జారీ చేయడం.. వీటిని క్షణం ఆలోచించకుండా రావికమతం తహశీల్దార్‌ సిద్ధయ్య అమలు చేయడాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో ఆర్డీవోకు జేసీ సృజన షోకాజ్‌ నోటీసు జారీ జేశారు. ఆయన ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు గతంలో ఆయన జారీ చేసిన పలు ఉత్వర్వులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆయన్ని సరెండర్‌ చేయాలని సూచించారు.

దాంతో కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాకుండా ఆర్డీవోను సరెండర్‌ చేశారు. నివేదికలోని అభియోగాలను ఇప్పుడు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో ఆర్డీవోను సస్పెండ్‌  చేస్తూ రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌  జీవో ఆర్టీ నెం.341ను జారీ చేశారు. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఆయన హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆయన ఉత్తర్వులన్నీ పరిశీలిస్తున్నా
ఆర్డీవోగా వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేయాల్సిందే. ఆయన ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. మమ్మల్ని కూడా తప్పు దారి పట్టించేలా ఉత్తర్వులు ఇచ్చారు. పలు తీర్పుల విషయంలో ఆది నుంచి ఆయన్ని హెచ్చరిస్తూనే ఉన్నా. ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎక్కువ శాతం వివాదస్పద మయ్యాయి. ఆయన హయాంలో జారీ చేసిన ఆర్‌వోఆర్, ఇతర అప్పిలేట్‌ ఉత్తర్వులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.ఏ ఒక్కటి అమలు కాకుండా చర్యలు తీసుకున్నాం. ఈ వ్యవహారంలో సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదిగా భావిస్తున్నాం.     
–జి.సృజన, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement