విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది.
జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, కార్యకలాపాలు ప్రారంభించడానికి నిబంధనలకు విరుద్ధంగా గత చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏకపక్షంగా అనుమతులు ఇచ్చింది. ప్రమాదకరమైన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిద్దామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించినా, నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు.
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో జనావాసాల మధ్య ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ విస్తరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పలు అనుమతులు ఇచ్చింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని పెందుర్తి మండలం ఆర్ ఆర్ వెంకటాపురంలో 213 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. 415 టీపీడీ సామర్థ్యంతో ఉన్న ఫ్యాక్టరీని రూ.168 కోట్ల వ్యయంతో 655 టీపీడీ సామర్థ్యానికి విస్తరించాలని యాజమాన్యం 2016లో నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసింది. కాగా ప్రమాదకరమైన రసాయన వాయువులతో ముడి పడిన ఈ పరిశ్రమ విస్తరణ అంశాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయపడింది. జనావాసాల మధ్యలో ఉన్న ఈ పరిశ్రమ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం తానుగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉన్నతాధికారులు భావించారు. ఆ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి భేటీ మినిట్స్‌లోనూ నమోదు చేశారు.
ఫ్యాక్టరీని తరలించాలని నిపుణుల డిమాండ్
► ఎల్‌జీ పాలిమర్స్ విస్తరణకు సన్నద్ధమవుతుండటంతో విశాఖలోని నిపుణులు అభ్యంతరం తెలిపారు. పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం పట్ల భయాందోళనలు వ్యక్తం చేశారు.
► ఈ ఫ్యాక్టరీని 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ మిగులు భూముల్లో నెలకొల్పిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బదులుగా వేరే చోట భూములు కేటాయించి తరలించాలని డిమాండ్ చేశారు. విస్తరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా పట్టుబట్టారు. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని అప్పట్లో డిమాండ్ చేశారు.
మనమే అనుమతి ఇచ్చేద్దాం..
చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎల్‌జీ పాలిమర్స్ విస్తరణకు, కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీఎఫ్‌ఇ), కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్(సీఎఫ్‌వో)కు తాజాగా 2018 డిసెంబర్ 27న అనుమతులు జారీ చేసింది. ఇవి 2025 డిసెంబర్ 26 వరకు అమలులో ఉండేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమాచారమిచ్చి చేతులు దులిపేసుకుంది. ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణకు 2023 ఏప్రిల్ వరకు అనుమతి ఇస్తూ టీడీపీ ప్రభుత్వం 2018 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యావరణ అనుమతులు లేవని ఒప్పుకున్న ఎల్‌జీ పాలిమర్స్
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేశామని, ఇంకా తమకు మంజూరు కాలేదని ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యమే స్వయంగా పేర్కొంది. ఈ మేరకు 2019 మే 8న (అప్పటికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది) ఆ కంపెనీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది.
► ఈ పరిస్థితిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తామని, ఎలాంటి అపరాధ రుసుము అయినా చెల్లిస్తామని కూడా పేర్కొనడం గమనార్హం.
టీడీపీ హయాంలో తూతూమంత్రంగా తనిఖీలు
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి భూ పందేరం చేయడమే కాకుండా.. దాని విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గత టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఆ కంపెనీలో లోటుపాట్లను కనీస మాత్రంగానైనా పట్టించుకోలేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే విస్తరణకు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు.. సదరు సంస్థ ఉత్పత్తిని పెంచుకునేలా అడ్డగోలు అనుమతులిచ్చింది. అప్పటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలను సైతం తూతూమంత్రంగా నిర్వహించి, మొక్కుబడి నివేదికలు సమర్పించింది. 2016 సెప్టెంబర్ 16న, 2017 మార్చి 21న, 2017 అక్టోబర్ 27న, 2018 ఏప్రిల్ 23న, 2018 అక్టోబర్ 12వ తేదీన.. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి ఎటువంటి సూచనలు, ఆదేశాలు గానీ జారీ చేయలేదు.
బాబుకు ఆది నుంచి ప్రత్యేక ఆసక్తి
► ప్రస్తుతం ఎల్‌జీ పాలిమర్స్ అని పిలుస్తున్న ఈ ఫ్యాక్టరీని 1961లో ‘హిందుస్థాన్ పాలిమర్స్’ పేరుతో స్థాపించారు. అప్పట్లో విశాఖకు దూరంగా ఉన్న ఆర్.ఆర్.వెంకటాపురంలో నెలకొల్పారు. హిందుస్థాన్ పాలిమర్స్‌ను 1978లో యూబీ గ్రూప్‌నకు చెందిన మెక్‌డోనాల్డ్స్ కంపెనీ టేకోవర్ చేసింది.
► 1997లో చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీని యూబీ గ్రూప్ నుంచి దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కొనుగోలు చేసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు యూబీ గ్రూప్‌నకు డీలర్‌గా ఉండేవారు. ఆ గ్రూప్ చైర్మన్ విజయ మాల్యాకు ఆదికేశవులు వ్యాపార భాగస్వామి.
► ఎల్‌జీ కంపెనీ ప్రమోటర్లు 1997లో అప్పటి సీఎం చంద్రబాబు, డీకే ఆది కేశవుల ద్వారానే కథ నడిపించి యూబీ గ్రూప్ నుంచి ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేసినట్టు సమాచారం. అందుకే చంద్రబాబు ఎల్‌జీ కంపెనీ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు.
► 1961లో ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం విశాఖపట్నం నగరానికి దూరంగా ఉండేది. కానీ 2017 నాటికి జనావాసాల మధ్య ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ విస్తరణకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఎల్‌జీ పాలిమర్స్ ప్లాంట్‌లో 1998లో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. నేను అప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నాను. కంపెనీని తరలించాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ శివాజీ రావు నాకు లేఖ రాశారు. నేను ఆ లేఖ విషయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని చంద్రబాబుకు వివరించాను. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. – మానం ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి
అప్పన్న భూములను కట్టబెట్టిన బాబు
ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న భూముల్లో 162.75 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి చెందినవి. ఈ భూములను స్వాధీనం చేసుకోడానికి దేవస్థానం ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని సూచించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ 162.75 ఎకరాల్లోని 128.24 ఎకరాలను డీ నోటిఫై చేస్తూ ఎల్‌జీ పాలిమర్స్‌కు అనుకూలంగా 2015 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా 34.51 ఎకరాల గురించి కూడా నెలరోజుల్లో తేల్చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.10 కోట్ల పైమాటే. అంటే రూ.1,620 కోట్ల విలువైన భూమిని ఎల్‌జీ పాలిమర్స్ పరమయ్యాయన్నమాట.
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు
ఇంతటి ప్రమాదకరమైన పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం ప్రమాదకరం. ఎల్‌జీ పాలిమర్స్ విస్తరణకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పొందలేదు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంతటి ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రమోటర్లపై కేసు నమోదు చేయాలి.
– ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment