కమ్మేసిన కాలుష్యం | Green Piece India Report Says Heavy Pollution In Hyderabad | Sakshi
Sakshi News home page

కమ్మేసిన కాలుష్యం

Published Tue, Nov 10 2020 2:16 AM | Last Updated on Tue, Nov 10 2020 2:20 AM

Green Piece India Report Says Heavy Pollution In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాలుష్యం కోరలు చాస్తోంది. దుమ్ము, ధూళి, పొగ ఇతర రూపాల్లో విస్తరిస్తోన్న కాలుష్యంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజానీకం స్వచ్ఛమైన గాలి పీల్చుకుంది. గత జూలై నుంచి దశలవారీగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో వివిధ కార్యకలాపాలు మొదలయ్యాయి. దీంతో వాయునాణ్యత క్రమంగా తగ్గుతోంది.  ప్రధానంగా హైదరాబాద్‌ మహానగరంలో ద్విచక్రవాహనాలు, కార్లు ఇతరత్రా అన్నీ కలిపి 60 లక్షలకుపైగా వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే కాలుష్యంతో ‘యాంబియెంట్‌ ఎయిర్‌ క్వాలిటీ’ దెబ్బతింటోంది. అదే సమయంలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత తగ్గిపోతోంది.

నిజానికి 2018లోనే దేశంలోని 287 నగరాల్లో, పట్టణాల్లో వాయు నాణ్యతను గ్రీన్‌పీస్‌ ఇండియా అంచనావేసింది. అందులోని 231 నగరాల్లో (తెలంగాణలోని హైదరాబాద్‌ సహా 9 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి) గాలిలో పీఎం–10 (పార్టిక్యులేటివ్‌ మ్యాటర్‌) సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమైంది. అప్పటికీ ఇప్పటికీ వాయునాణ్యత మరింత దెబ్బతిన్నట్టుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) తాజాగా ఈ ఏడాది సెప్టెం బర్‌లో లెక్కగట్టిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ పరిధిలో నమోదైన పీఎం–10 కాలుష్యస్థాయిలను మించి ఈ నవంబర్‌ 1–7 తేదీల మధ్య నమోదు కావడం సమస్య తీవ్రతను చాటుతోంది. చలికాలంలో వాతావరణంలో దుమ్ము కణాలు, వాయు కాలుష్యం సులభంగా గాలిలో కలిసిపోకుండా మంచు అడ్డుకోవడం వాయునాణ్యత మరింత పడిపోవడానికి కారణమని టీపీసీబీ చెబుతోంది.  

గ్రీన్‌పీస్‌ నివేదిక ఏం చెబుతోంది?
వాహన కాలుష్యం, ఇతరత్రా కారణాలతో హైదరాబాద్‌తో పాటు కొత్తూరు, రామగుండం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆదిలాబాద్‌లో వాయునాణ్యత గణనీయంగా పడిపోతోందని గ్రీన్‌పీస్‌ ఇండియా నివేదిక తేల్చింది. 2018లో దేశంలోని 287 నగరాల్లో, పట్టణాల్లోని వాయునాణ్యతను పరిశీలించిన ఈ సంస్థ.. ఇటీవల ఆ వివరాలను ‘ఎయిర్పొకలిప్స్‌’ శీర్షికతో విడుదలచేసిన ఫోర్త్‌ ఎడిషన్‌ నివేదికలో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో పీఎం–10 సూక్ష్మకణాలు పరిమితికి మించి వెలువడుతున్నట్టు తేలింది. నల్లగొండ, నిజామాబాద్‌ ప్రాంతాలు కూడా ఈ పరిమితికి దగ్గరలో ఉన్నాయి. మనిషి వెంట్రుక పరిమాణంలో పదోవంతు సైజులో ఉండే పీఎం–10 కాలుష్య కారకం సులభంగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సంబంధిత రోగాలకు కారణమవుతుంది. 

వాహనాలతోనే అధిక కాలుష్యం..
వాయునాణ్యత తగ్గుదలకు ప్రధానంగా వాహన కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, దుమ్ము, ధూళి కారణమవుతున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో కొంతకాలం పూర్తిగా ఇళ్లకే పరి మితమైన జనం ఇప్పుడు ఎలాంటి నియంత్రణ లేకుండా రోడ్లపై తిరిగేస్తున్నారు. కరోనా వైరస్‌ సోకుతుందనే భయం, ముందుజాగ్రత్తలతో సొంత వాహనాలనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీంతో వాహన కాలుష్యం పెరిగి వాయునాణ్యత క్షీణిస్తోంది. పీఎం–10, పీఎం–2.5 సూక్ష్మకణాల వ్యాప్తికి 50 శాతం వాహన కాలుష్యమే  కారణం. వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి రేగడం వంటి కారణాలతో 33 శాతం కాలుష్యం వెలువడుతోంది. ఇక భవన నిర్మాణ కార్యకలాపాలు, ఇళ్ల కూల్చివేత, ఇతర కార్యక్రమాలతో 11 శాతం సూక్ష్మకణాలు వెలువడి వాయునాణ్యతను దెబ్బతీస్తున్నాయి.

3 జోన్లుగా కాలుష్యం లెక్కలు..
రాష్ట్రాన్ని హైదరాబాద్‌ (ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో కలిపి), వరంగల్, రామచంద్రాపురం జోన్లుగా విభజించి.. సల్ఫర్‌ డైఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, పీఎం–10, పీఎం–2.5, అమ్మోనియా, ఓజోన్, కార్బన్‌ మోనాక్సైడ్, బెంజిన్‌ కాలుష్య విలువలను లెక్కగడుతున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ, సనత్‌నగర్, జూపార్క్, పాశమైలారం, బొల్లారం, ఇక్రిశాట్‌ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఎప్పటిప్పుడు వాయునాణ్యత సూచీని పరీక్షించి వాస్తవ సమయంలో కాలుష్య స్థాయిలను నమోదు చేస్తున్నారు. వరంగల్‌ జోన్‌ పరిధిలో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, వరంగల్, హన్మకొండ, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలున్నాయి.

రామచంద్రాపురం జోన్‌లో ఉమ్మడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన మేరకు నేషనల్‌ యాంబియెంట్‌ ఎయిర్‌ క్వాలిటీ స్టాండర్డ్స్‌ (ఎన్‌ఏఏక్యూఎస్‌) ప్రకారం.. పీఎం–10 (పది మైక్రాన్ల కంటే తక్కువ సూక్ష్మమైన కాలుష్య కణాలు) సగటున ఏడాదికి 60 మైక్రోగ్రాములు మించకూడదు. పీఎం–2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ సూక్ష్మమైన కాలుష్య కణాలు) సగటున ఏడాదికి 40 మైక్రోగ్రాములు మించకూడదు. అయితే, రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో నేషనల్‌ ఇవి 60 మైక్రోగ్రాములకు మించి నమోదవుతున్నాయి.

వాయునాణ్యత లెక్కింపు ఇలా
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వాస్తవ సమయంలో పరిశీలించి ‘సమీర్‌ యాప్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటుంది.
– ఏక్యూఐ 50 పాయింట్లలోపు ఉంటే స్వచ్ఛమైన వాతావరణంతో పాటు నాణ్యమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క.
– 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు.
– 100 పాయింట్లు మించి నమోదైతే ఆయా స్థాయిలను బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

పట్టణీకరణ, వాహనాల పెరుగుదలతోనే..
రాష్ట్రంలోని వివిధ ›ప్రాంతాల్లో పట్టణీకరణతో పాటు వాహనాల వినియోగం గణనీయంగా పెరగడం వాయుకాలుష్యానికి కారణమవుతోంది. హైదరాబాద్‌లో ఐదారేళ్లలో వాయునాణ్యత ప్రమాణాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నాం. రాష్ట్రస్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రణాళికను ప్రతీ 3 నెలలకోసారి సమీక్షిస్తున్నాం.

‘సిగ్నలింగ్‌ ఫ్రీ ట్రాఫిక్‌ ఐలాండ్స్‌’ దిశగా చర్యలు చేపట్టడంతో పాటు రోడ్ల విస్తరణ, కూడళ్లలో గ్రీనరీ పెంచడం, ఫుట్‌పాత్‌లపై దుమ్ము, ధూళి నిలిచిపోకుండా టైలింగ్, మున్సిపల్, ఇతర చెత్తాచెదారం బహిరంగంగా తగులబెట్టకుండా చూడడం వంటివి చేపడుతున్నాం. రియల్‌టైమ్‌లో వాయు కాలుష్యం ఏ మేరకు ఉందో హైదరాబాద్‌లోని కూడళ్లలో డిస్‌ప్లే చేస్తున్నాం. రెండోదశలో రాష్ట్రంలో కాలుష్యం పెరుగుతున్న ఇతర నగరాలు, పట్టణాల్లోనూ వీటినిæ ఏర్పాటుచేస్తాం. ఎక్కడెక్కడ ఏ రకమైన కాలుష్యం ఎంత పెరుగుతుందన్నది పరిమిత గణాంకాలతో కాకుండా ఏడాదిలో నమోదైన విలువలతో బేరీజు వేయాలి. దాన్ని అంతకుముందు ఏడాదితో పోల్చిచూస్తే కాలుష్యం పెరిగిందా తగ్గిందా అన్న దానిపై స్పష్టత వస్తుంది.
– తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి


చలికాలంలో కాలుష్యంతో జాగ్రత్త
వాతావరణ మార్పులు, చల్లని గాలులకు తోడు కాలుష్యం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తిరబెడతాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు, షుగర్, ఆస్తమా, బ్రాంకటీస్, కీళ్లవాపుల సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలి. తుమ్ములు, ముక్కు కారడం, ఛాతీ భారంగా అనిపించడం, నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడం, గాలి పీల్చేపుడు పిల్లికూతలు వంటి సమస్యలు ఎదురవుతాయి. చలికాలమంటేనే వైరల్‌ ఇన్ఫెక్షన్ల సీజన్‌. అన్నిరకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు వ్యాపించేందుకు అనుకూల సమయం. ఈ కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైరల్‌ ఇన్ఫెక్షన్లు న్యూమోనియాకు దారితీయకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగా న్యూమోకోల్‌ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్లు తీసుకుంటే మంచిది. దూరప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దు. పొద్దుటే, మంచు ఉండగానే వాకింగ్‌కు వెళ్లకపోవడం శ్రేయస్కరం.  
– డాక్టర్‌ వీవీ రమణప్రసాద్, కిమ్స్‌ కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement