
నగరంపై కాలుష్య పడగ
ధూళి కణాల (పీఎం10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని వివిధ కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళి వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూ పార్క్, పంజగుట్ట, కూకట్‌పల్లి,చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం శ్రుతి మించుతున్నట్టు తేలింది. ఆ కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజుల పాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు వెల్లడైంది. బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఏడాదిలో 200 రోజులకు పైగానే కాలుష్యం అధికంగా ఉన్నట్లు తేలింది. సెలవు రోజులు, పండగ వేళలు, వర్షం పడినపుడు, ట్రాఫిక్ రద్దీ అంతగా లేని రోజుల్లో కాలుష్య తీవ్రత మోస్తరుగా తగ్గడం ఒకింత ఉపశమనం కలిగిస్తోంది.
భూరేలాల్ కమిటీ ఏం చెప్పిందంటే...
►1999-2000లో భూరేలాల్ నేతృత్వంలో కమిటీఏర్పాటైంది. ఇది 2003లో నివేదిక సమర్పించింది. ప్రధానాంశాలివీ...
►లెడ్ ఆనవాళ్లు లేని డీజిల్, పెట్రోలును వినియోగించాలి. ఇంధన కల్తీని నివారించాలి.
►{పజా రవాణాకు సీఎన్‌జీ ఆధారంగా నడిచే బస్సులను దశల వారీగా ప్రవేశపెట్టాలి.
►15 ఏళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కనీయరాదు.
►నూతనంగా ఆటోలకు అనుమతివ్వరాదు.
►{పజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి.
►కాలుష్య కారక పరిశ్రమలను నగరంఆవలకు తరలించాలి. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.
వాహన విస్ఫోటం...
గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య 43 లక్షలకు చేరుకుంది. వీటికి తోడు రోజువారీగా సుమారు రెండువేల వాహనాలు అదనంగా రోడ్కెక్కుతుండడంతో రహదారులు కిక్కిరిసిపోయి.. పొగ కమ్ముకుంటోంది. వాహన విస్ఫోటంలో చెన్నై, పూణే, ముంబయి తరవాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలుస్తుండడం గమనార్హం.
మెట్రో నగరాల్లో వాహన విస్ఫోటం తీరిదీ...
నగరంప్రతి కిలోమీటరు రహదారిపై వాహనాల సాంద్రత
చెన్నై →2,093
పూణే → 1,260
ముంబయి → 1,014
హైదరాబాద్ → 723
కోల్‌కతా → 723
ఢిల్లీ-ఎన్‌సీఆర్ → 245
కాలుష్యానికి కారణాలివే..
గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య 43 లక్షలకు చేరింది. వీటికి ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు,120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఇంధన కల్తీ అధికంగా ఉండడంతో కాలుష్యతీవ్రత పెరుగుతూనే ఉంది.గ్రేటర్ పరిధిలో కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. వీటి పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.వాహనాల సంఖ్య లక్షలు దాటినా.. గ్రేట ర్‌లో 6,411 కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతోంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది.వాహనాల పొగ నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజిన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం(ధూళిరేణువులు)వంటి కాలుష్య ఉద్గారాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి.
అనర్థాలివే..
టోలిన్, బెంజిన్ కాలుష్యం అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఉన్న వారు క్యాన్సర్, రక్తహీనత, టీబీ వ్యాధుల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసకోశాలకు చికాకు కలిగించి బ్రాంకైటిస్‌కు కారణమవుతోంది. నైట్రోజన్ డయాక్సైడ్‌తో కళ్లు, ముక్కు మండుతున్నాయి. శ్వాసకోశాలకు తీవ్ర చికాకు కలుగుతోంది.అమ్మోనియా మోతాదు పెరగడంతో కళ్లు తీవ్రంగా మండడంతో పాటు శ్వాసకోశ భాగాలన్నీ దెబ్బతింటున్నాయి.పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు,పొడి దగ్గు,ఎలర్జీ, బ్రాంకైటిస్‌కు కారణ మవుతున్నాయి.దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది.చికాకు ,అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది. ఆర్‌ఎస్‌పీఎం మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధికమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాయుకాలుష్యమే.గంట పాటు ట్రాఫిక్ రద్దీలో ప్రయాణించే వారు చురుకుదనం కోల్పోయి ఒళ్లంతా మగత, నొప్పులతో బాధ పడుతున్నారు.ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం దుష్ర్పభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం శ్రుతి మించడంతో ఇటీవల సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌లు నగరంలో డీజిల్ వాహనాలు, ట్రక్కుల రాకపోకలను నిషేధించి... కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఇదే స్ఫూర్తితో అక్కడి ప్రభుత్వం ఒక సిరీస్ వాహనం రోజు విడిచి రోజు మాత్రమే (డేబైడే) తిరిగేందుకు వీలుగా సరి, బేసి సంఖ్యల సిరీస్ విధానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. అంటే ఒక సిరీస్ వాహనం వారంలో మూడు రోజులు మాత్రమే రోడ్లపై తిరిగేందుకు వీలుంటుంది. ఇదే విధానాన్ని నగరంలో ప్రవేశపెడితే సత్ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ కూడళ్లలో అవధులు దాటింది..
కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో ధూళికణాల సాంద్రత 60 మైక్రోగ్రాములు దాటరాదు. కానీ వివిధ ప్రాంతాల్లో దీనికి రెట్టింపు ఉంటోంది. ఆ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించే పాదచారులు, వాహన చోదకులు కాలుష్యం దె బ్బకు ఆస్పత్రుల పాలు కావాల్సి వస్తోంది.
తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు తథ్యం: డాక్టర్ శ్యాంసుందర్‌రాజ్, పల్మనాలజిస్టు.
నగరంలో వాయు కాలుష్యం తీవ్రమవడంతో న్యుమోనియా, ఆస్తమా కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి-సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం) వంటి వి ప్రబలుతున్నాయి. చిన్న పిల్లల్లో ఊపిరితిత్తుల పెరుగుదల అర్థంతరంగా ఆగిపోతోంది. గర్భిణులు కాలుష్యం బారిన పడడంతో తక్కువ బరువున్న పిల్లలు పుడతారు.అలర్జీతో బాధపడే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అస్తమా, అలర్జీ ఉన్న వారు మాస్క్ ధరించి బయటికి వెళ్లాలి.