సాక్షి, కామారెడ్డి / భిక్కనూరు : కాలుష్యం కోరలు చాస్తోంది. పీల్చే గాలి, తాగేనీరు కలుషితమవుతోంది. జనం రోగాల బారిన పడుతున్నారు. విషవాయువులు పల్లెల్ని కమ్మేస్తుండడంతో భరించలేకపోతున్నారు. తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ఉపాధి ఏమోగాని రోగాలు వెన్నాడుతున్నాయి. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, తలమడ్ల, తదితర గ్రామాల పరిసరాల్లో ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇతర పరిశ్రమలు, కోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి.
అయితే పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల మూలంగా దుర్వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటు న్నారు. పరిశ్రమల నుంచి వదిలే వ్యర్థాలతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోందని, ఆఖరుకు భూ గర్భజలాలు కూడా దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నెలకొల్పిన ఓ ఫార్మా కంపెనీతో తాము అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ కాచాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 57 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఈ ఆందోళనలకు పొరుగున ఉన్న పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, సంగమేశ్వర్, మాందాపూర్, అంతంపల్లి తదితర గ్రామాల ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. వ్యర్థాలతో తామూ ఇబ్బంది పడుతున్నామని పే ర్కొంటూ వారితో జతకలిశారు. అలాగే ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో భూగర్భజలాలు కూడా కలుషితమై, ఆ నీళ్లు తాగిన వారంతా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల వ్యర్థాలన్నీ పంట చేలగుండా కాలువలు, వాగుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది. గతంలో చెరువులోకి వ్యర్థాలు వెళ్లడంతో చేపలు మృత్యువాత పడ్డాయి.
మొక్కుబడి తనిఖీలు..
పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులు మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీ మూలంగా తాము పడుతు న్న ఇబ్బందులపై 57 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పీసీబీ అధికారులు ఇటువైపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 44వ నంబరు జాతీయ రహదారిపై భిక్కనూరు మండలంలో అడుగుపెట్టగానే ఆయా పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వాసనలతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాల అద్దాలన్నీ మూ సి ఉంచినా దుర్గంధంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment