సాక్షి, సిటీబ్యూరో: గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్‌లో ఓ మోస్తరు కాలుష్యం తగ్గినట్లు ఇటీవల అధికారులు పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఆ ఆనందం ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వస్తున్న గణపతి విగ్రహాలను సాగర్‌లో భారీగా నిమజ్జనం చేస్తున్నారు. దీంతో కాలుష్యం తీవ్రత పెరిగే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసిన గణపతుల నిమజ్జనంతో ఆయా జలాశయాలు కాలుష్యకాసారం అవుతాయని వారు అంటున్నారు. గత అనుభవాల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ సహా ఇతర జలాశయాల్లో కాలుష్యంతో జరిగే అనర్థాలను వివరిస్తున్నారు.
♦ ఏటా గణేష్ నిమజ్జన ప్రక్రియ కారణంగా సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగర జలాల్లో కలుస్తాయని అంచనా.
♦ ఇందులో ఇనుము, కలపను హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో తొలగించినా..పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళసాగరమౌతోంది.
♦ అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడి) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు.
♦ ఇక కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంకు మించే ప్రమాదం పొంచి ఉంది. సాధారణరోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. ఇక జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోతోంది. ఇది ప్రతి లీటరు నీటిలో ‘సున్న’గా నమోదయ్యే ఆస్కారం ఉంది.
అమ్మో.. ప్లాస్టర్ ఆఫ్‌ప్యారిస్..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్ సహా ఇతర జలాశయాల్లో నిమజ్జనం చేయడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల నీటిలో చేరి పర్యావరణ హననం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రసాయన రంగుల అవశేషాలివే: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్.
♦ హానికారక మూలకాలు::కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా.
జలాశయాల కాలుష్యంతోతలెత్తే అనర్థాలివే..
♦ ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది.
♦ పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది.
♦ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి.
చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి.
♦ మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
♦ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి.
♦ నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్ష జాతులు అంతర్థానమౌతాయి.
♦ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
♦ వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్‌లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి.
♦ జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి.
ప్రత్యామ్నాయాలివే..
♦ రంగులు, రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణంసైతం చిన్నవిగానే ఉండాలి.
♦ ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేలా ఆయా విభాగాలు చర్యలు తీసుకోవాలి.
♦ నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు.
♦ వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకిపూలు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథీన్ కవర్లను పడవేయరాదు.
♦ నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి.
♦ పీఓపి(ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్)తో తయారు చేసిన భారీ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా... వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి. వచ్చే ఏడాది వీటిని వినియోగించేలా ప్రోత్సహించాలి.
♦ జలాశయాల్లో వ్యర్థాలు పోగుపడడంతో దోమలు వృద్ధిచెంది..మలేరియా, డెంగీ వ్యాధులు విజృంభిస్తాయి.
♦ జలాశయాల్లో వృక్ష, జంతు జాతులు, నీరు, మృతిక, గాలి, పర్యావరణం దెబ్బతినకుండా అన్నివర్గాల్లో అవగాహన పెంచాలి.
Comments
Please login to add a commentAdd a comment