సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ మండలి అప్పీలేట్ అథారిటీ (పీసీబీఏఏ) చైర్మన్ ఎంపికలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టకపోతే ప్రభుత్వ అధికారాలను లాక్కొని తాము నియమించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామని, ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసి గెజిట్ నోటిఫికేషన్‌ను సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే పర్యావరణ విభాగం కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. పీసీబీ అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. చివరి అవకాశం ఇస్తున్నామని, రెండు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి అందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment