సాక్షి హైదరాబాద్: పారిశ్రామిక వాడల్లో అపరిమిత కాలుష్యం వెదజల్లుతున్నవి, నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీల భరతం పట్టే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. మహా నగరానికి ఆనుకొని ఉన్న పది పారిశ్రామిక వాడల్లో ఆల్ఫాజోలం వంటి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తరచూ ఆనవాళ్లు బయటపడడంతో పాటు పలు పారిశ్రామిక వాడల్లోని కంపెనీలు భరించలేని ద్రవ, ఘన, వాయు కాలుష్యం వెదజల్లుతున్నా.. టాస్క్‌ఫోర్స్ బృందాలు చోద్యం చూస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గుట్టుగా కార్యకలాపాలు..
- నగరంలో పదికిపైగానే పారిశ్రామికవాడలున్నాయి. ఆయా వాడల్లో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు కొలువుదీరాయి. వీటిలో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఏం ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు.
- ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమల ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా ఉండదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపలేం జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతుండడం గమనార్హం.
- నిబంధనలివీ..
- వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రె డ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమ లు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా సు మారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టూపక్కల 3 వేల వరకు ఉన్నాయి.
- ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీఎఫ్‌ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్‌వో) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ
- కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి.
- ∙దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందాలి. నిత్యం వెలువడుతున్న వ్యర్థ జలాల, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన కాగితాలకే పరిమితమవుతుండడం గమనార్హం. ఇలాంటి కంపెనీలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు చేసి కట్టడి చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment