జనంపైకి విషం
గాంధీనగర్ పారిశ్రామికవాడ ఉక్కిరిబిక్కిరి ఆస్పత్రులకు జనం పరుగులు
రెండు గంటల పాటు నరకం చూసిన స్థానికులు
కుత్బుల్లాపూర్/సనత్‌నగర్: కాలుష్య విషం చిమ్ముతున్న పరిశ్రమలను మూసేయాలని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ఆదేశించిన కొన్ని గంటల్లోనే పరిశ్రమలు విష వాయువులను ఎగజిమ్మాయి. శనివారం సాయంత్రం గాంధీనగర్ పారిశ్రామికవాడ ఘాటైన వాసనతో ఉక్కిరి బిక్కిరైంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో కాలుష్య కారక పరిశ్రమలపై సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ కొరడా ఝుళిపిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా నాలుగు పరిశ్రమల మూసివేతకు ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకున్న కాసేపటికి గాంధీనగర్ పారిశ్రామికవాడలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని గాంధీనగర్ పారిశ్రామిక వాడ పరిసర ప్రజలు
విషవాయువు ఘాటుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లలు వాంతులు చేసుకుని సొమ్మసిల్లి పడిపోయారు. జనరల్ షిఫ్ట్‌లో పని ముగించుకుని ఇళ్లకు వచ్చిన కార్మికులు, ఇతర పనులకు బయటకు వెళ్లి తిరిగి వచ్చిన వారిదీ ఇదే పరిస్థితి. ఏమైందో తెలియక అందరూ ఆందోళనతో ఆస్పత్రులకు పరుగులు తీశారు.
విషయం ఇదీ..
ఈ పారిశ్రామిక వాడలో అనేక పరిశ్రమలు ఉన్నా 16 పరిశ్రమలు రసాయనాలు అధికంగా వినియోగిస్తుంటాయి. ఇవి వ్యర్థ రసాయనాలను విచ్చలవిడిగా డ్రెయిన్లలోకి వదలడం రోజువారీ తంతు. శనివారం సాయంత్రం స్థానిక హెచ్‌ఎంటీ 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో నాలుగు బస్తాల కెమికల్ పౌడర్, మరో మూడు వందల చిన్న ప్యాకెట్లను ఎవరో పడేసి పోయారు. వీటి నుంచి వెలువడిన విషవాయువులు స్థానికంగా కమ్ముకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఘాటైన వాసన గాంధీనగర్, చింతల్, చంద్రానగర్, భగత్‌సింగ్ నగర్, దుర్గయ్య నగర్‌పై కమ్ముకోవడంతో ప్రజలు దగ్గు, వాంతుల బారిన పడ్డారు. దాదాపు రెండు గంటల పాటు స్థానిక ప్రజలు నరకం చూశారు. దీనిపై పీసీబీ అధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించ లేదు.
శాంపిల్స్ సేకరించిన అధికారులు
జీడిమెట్ల ఫైర్ సిబ్బంది, కేంద్ర అగ్నిమాపక అధికారి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో మొదట రసాయనాలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. దీంతో ఘాటైన వాసన మరింత ఎక్కువైంది. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది హెచ్‌ఎంటీ ఖాళీ ప్రదేశంలో లభించిన నాలుగు బస్తాల రసాయన పౌడర్‌ను గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. జీడిమెట్ల పోలీసులు సైతం ప్రమాదం లేదని మొబైల్ టీం ద్వారా ప్రచారం చేశారు. పీసీబీ అధికారులు పంపారని వచ్చిన రాజేష్ అనే వ్యక్తి రసాయనాల శాంపిల్స్ సేకరించాడు. ఘటనా స్థలంలో సికింద్రాబాద్ అడ్రస్‌తో కూడిన స్లిప్పులు దొరగ్గా వాటిని జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంపిళ్లను ఆదివారం ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.
గాలిలో హెచ్‌సీఎల్ వాటానే ఎక్కువ..
జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామికవాడల్లోని కెమికల్స్ తయారీలో ఎక్కువ శాతం హెచ్‌సీఎల్ వినియోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఈ వాయువును పీల్చడం ద్వారా ముక్కు, కళ్లు మంటలు విపరీతంగా వస్తాయి. చర్మంపై దద్దుర్లతో పాటు వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. పారిశ్రామికవాడల్లో హెచ్‌సీఎల్ వాయువులు ఎక్కువగా విడుదలవుతున్నట్టుగా పీసీబీ అధికారులే గుర్తించారు. ఏ పరిశ్రమ నుంచి హెచ్‌సీఎల్ వెలువడుతోందో స్పష్టత లేకపోవడంతో చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. మరికొన్ని పరిశ్రమల నుంచి అమ్మోనియా సైతం వెలువడుతున్నట్టు పీసీబీ అధికారులు నిర్ధారించారు. ఇవి అర్ధరాత్రి వేళ గాలిలో కలుస్తుండటం.. ప్రజలు గాఢ నిద్రలో ఉండటంతో అంతగా గుర్తించడం లేదు.
ఆదేశాలకే పరిమితమా?
ఇప్పటి వరకు విష వాయువులు వెదజల్లే పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. టాస్క్‌ఫోర్స్ సమావేశాలు నిర్వహించడం, ఆదేశాలు జారీ చేయడం, ఆ తరువాత పరిస్థితి షరా మామూలే అన్నట్టుగా మారింది. శనివారం జరిగిన సమావేశం కూడా ఇదే ఆనవాయితీగా మారుతుందా? లేక పకడ్బందీగా అమలుచేస్తారా? అన్నది ప్రశ్నార్థకం. సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ నాలుగు కంపెనీలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో మూడు కంపెనీ యాజమాన్యాలు తమకు తాము మూసివేసుకుంటామని చెప్పుకొచ్చాయి. అవి మాట మీద నిలబడతాయా...లేక యథావిథిగా విష వాయువులను గాలిలోకి ఎగజిమ్ముతాయా? అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. గతంలో టాస్క్‌ఫోర్స్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది.